కారుకూతలు కూస్తే ఖబడ్దార్‌

28 Apr, 2022 12:07 IST|Sakshi
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న జెడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి

మద్దిలపాలెం(విశాఖ తూర్పు): ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై కారుకూతలు కూస్తూ... లేనిపోని రాద్ధాంతాలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని తెలుగుదేశం నాయకులకు జెడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర తీవ్రస్థాయిలో హెచ్చరించారు. బుధవారం నగర పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ఓ సంఘటనను బూచిగా చూపిస్తూ టీడీపీ నాయకులు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీనిపై విచారణకు వెళ్లిన మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మపైన దాడికి పాల్పడిన వీళ్లా మహిళల రక్షణ గురించి ప్రశ్నించేదన్నారు. ఇదేనా మహిళలపై గౌరవమని ధ్వజమెత్తారు. మచ్చలేని ప్రజారంజక పాలన సాగిస్తున్న సీఎం జగన్‌పై బురద చల్లేందుకు గోతికాడి గుంట నక్కలా ఎదురు చూస్తున్నారని విమర్శించారు. మహిళల రక్షణకు దిశ చట్టంగా మార్చేందుకు సహకరించపోవడం దారుణమన్నారు.

టీడీపీ హయాంలో విజయవాడలో బాలికపై ఓ కార్పొరేటర్‌ అఘాయిత్యానికి పాల్పడినప్పుడు చంద్రబాబు ఎందుకు నోరు విప్పలేదన్నారు. ఆనాడు ఓ గిరిజన ఎమ్మెల్యేపైన దేశ ద్రోహం కేసు నమోదు చేశారు? అప్పుడు గుర్తుకు రాలేదా? ఈ అక్కచెల్లెలు అని ప్రశ్నించారు. చట్టసభలో ఎమ్మెల్యే రోజాను ఈడ్చుకెళ్లింది మీరు కాదా అని ప్రశ్నించారు.

14 ఏళ్ల చంద్రబాబు పాలనలో ఎమ్మార్వో వనజాక్షి, రితేశ్వరి లాంటి బాధిత మహిళలు ఎందరో ఉన్నారన్నారు. ఎన్నో కళాశాలలో విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు ఉన్నాయన్నారు. ఉనికి చాటుకోవడానికి లేనిపోని రాద్ధాంతాలు చేసి అభాసు పాలవుతున్నారన్నారు. ప్రజలకు మేలు చేసే వి«ధంగా ప్రజల్లోకి వెళ్లండి, చిల్లర వేషాలు మానుకోవాలని హితువు పలికారు. పేదలకు పట్టాల పంపిణీ చేస్తున్న తరుణంలో ఇలాంటి ఆరోపణలతో పబ్బం గడుపుకోవాలని చూడడం విడ్డూరంగా ఉందన్నారు. 

ఎమ్మెల్సీ వరుదు కల్యాణి:ఉన్మాద పాలన ఘనత చంద్రబాబుది:  
రాష్ట్రంలో ఉన్మాద పాలన సాగించిన ఘనుడు చంద్రబాబు అని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి వ్యాఖ్యానించారు. తహసీల్దార్‌పైన, అధికారులపైనా టీడీపీ ఎమ్మెల్యేలు చేసిన వేధింపులు, చిత్రహింసలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. బిక్కుబిక్కుమంటూ మహిళలు గడిపేవారన్నారు. దిశా యాప్‌తో మహిళలు నేడు ఎంతో ధైర్యంగా ఉన్నారన్నారు. ఇది చూసి ఓర్వలేక చేస్తున్న కుట్రలు అందరికి అర్థమవుతున్నాయన్నారు.

మాది ఆడబిడ్డలకు అండగా ఉండే ప్రభుత్వమని పేర్కొన్నారు. మహిళలకు రాజ్యాధికారం ఇచ్చేందుకు 50 శాతం నామినేటెడ్‌ పదవులతో ఉన్నత స్థానంలో కూర్చొబెట్టామన్నారు. అగ్రవర్గాల మహిళలకు ఈబీసీ కింద రుణాలు, గ్రామ సచివాలయాల్లో 2 లక్షల ఉద్యోగులు ఇచ్చామన్నారు. ముఖ్యమంత్రిపై వ్యాఖ్యల చేయడానికి వంగలపూడి అనితకు అర్హత లేదన్నారు. కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అని మహిళా పుట్టుకనే హేళన చేసిన దౌర్భాగ్యుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. బెయిల్‌ కోర్టులిస్తాయా.. ప్రభుత్వాలు ఇస్తాయో మాజీ ఎమ్మెల్యే అనితకు తెలియకపోవడం దురదృష్టమన్నారు.

14 ఏళ్ల పాలనలో మహిళల కోసం ఏం చేయలేని చంద్రబాబు ఇంటి ముందు ధర్నా చేయాలని కోరుతున్నానన్నారు. నారా లోకేష్‌ పీఏ టీడీపీ ఆఫీస్‌లో ఇబ్బందులున్నాయని చెప్పినప్పడు తెలుగు మహిళల నోరు ఎందుకు లేవలేదన్నారు. కాల్‌మనీ, సెక్స్‌ రాకెట్‌లో అప్పటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధాలున్నాయని తెలిసినప్పడు నిరసన ఎందుకు చేయలేదన్నారు.

ధ్వజమెత్తిన మహిళా నాయకులు...  
రాష్ట్రంలో మహిళల రక్షణే ధ్యేయంగా పాలన సాగిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై దుష్ప్రచారం చేయడం మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వైఎస్సార్‌సీపీ మహిళా నాయకులు హెచ్చరించారు. దిశ యాప్‌ పట్ల లేనిపోని రాద్ధాంతం చేయాలని చూస్తే మహిళలు ఉగ్రరూపం దాల్చాల్సి వస్తుందని పలు కార్పొరేషన్ల చైర్మన్లు కొండా రమాదేవి, పిళ్లా సుజాత, చొక్కాకుల లక్ష్మి, మాధవివర్మ, చిన్నతల్లి, వైఎస్సార్‌ సీపీ మహిళా నాయకులు పేడాడ రమణకుమారి, నల్ల కృపాజ్యోతి హెచ్చరించారు.    

(చదవండి: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్‌ సీపీదే విజయం :పుష్ప శ్రీవాణి)

మరిన్ని వార్తలు