చీటింగ్‌ కేసులో నిందితులకు జైలు

22 Mar, 2023 02:04 IST|Sakshi

నెల్లూరు(లీగల్‌) : నకిలీ పేర్లతో సొసైటీని స్థాపించి ప్రజలను మోసగించారని నమోదైన కేసులో నేరం రుజువు కావడంతో ఇద్దరికి నాలుగేళ్ల జైలు శిక్ష, మరో ముగ్గురికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.యామిని మంగళవారం తీర్పు చెప్పారు. వారిలో వైఎస్సార్‌ కడప జిల్లా, మైదుకూరు, బసవపురం గ్రామానికి చెందిన బైరి మారుతీప్రసాద్‌, మైదుకూరులోని రాజీవ్‌గాంధీనగర్‌కు చెందిన తిరువాయిపాటి రమేష్‌లకు నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు రూ.20 వేల చొప్పున జరిమానా, నాగాలాండ్‌లోని దిమ్మాపూర్‌ ప్రాంతానికి చెందిన సెంథికుమ్లా, హైదరాబాద్‌కు చెందిన అప్పల మహేష్‌, ఆత్మకూరులోని రావకొల్లు గ్రామానికి చెందిన ఆత్మకూరు రాముకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.20 వేల చొప్పున జరిమానా విధించారు. ప్రాసిక్యూషన్‌ కథనం మేరకు.. సెంథికుమ్లాతో పాటు పై నిందితులందరూ మారు పేర్లతో 2011 ఆగస్టు 3న యూత్‌ అలైవ్‌ సొసైటీని స్థాపించారు. హైదరాబాద్‌తో పాటు కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పలువురు ఏజెంట్లను నియమించుకుని ప్రజల నుంచి నెలకు రూ.11 వేల చొప్పున మూడు నెలలు చెల్లిస్తే ఆరు నెలల అనంతరం కట్టిన రొక్కానికి మూడో వంతు చెల్లిస్తామని నమ్మించి రూ.కోట్ల నగదును వసూలు చేశారు. మొదట కొందరికి చెల్లించి అనంతరం అర్ధాంతరంగా సొసైటీని మూసివేసి పరారయ్యారు. దీంతో లబ్ధిదారుడు అరవ రమేష్‌ ఫిర్యాదు మేరకు నెల్లూరు సీఐడీ డీఎస్పీ కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం కోర్టులో నిందితులపై చార్జిషీట్‌ దాఖలు చేశారు. విచారణలో నిందితులపై నేరం రుజువు కావడంతో పై మేరకు శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ తరఫున స్పెషల్‌ పీపీ అయ్యపరెడ్డి కేసు వాదించారు.

మరిన్ని వార్తలు