చీటింగ్‌ కేసులో ఇద్దరి అరెస్ట్‌

22 Mar, 2023 02:06 IST|Sakshi

రాజంపేట : చీటింగ్‌, ఫోర్జరీ కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. రాజంపేట రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్‌ఐ భక్తవత్సలం వివరాలు వెల్లడించారు. ఈ నెల 15న రాజంపేట మండలం మందరం గొల్లపల్లెకు చెందిన సంపతి సగలమ్మ ఫిర్యాదు మేరకు చీటింగ్‌, ఫోర్జరీ కేసు నమోదు చేశామన్నారు. ప్రజలకు విలేకరినని చెపుతూ రాజంపేట పట్టణానికి చెందిన కర్నాటకం అనిల్‌కుమార్‌.. నందలూరు మండలం అరవపల్లెకు చెందిన తోట కుమార్‌, చెవ్వు అశోక్‌కుమార్‌రెడ్డి, మరి కొంత మందితో కలిసి నేరపూరిత కుట్రపన్ని ఒక ప్రణాళిక ప్రకారం ఫోర్జరీ డాక్యుమెంట్‌లను, వాటికి లింక్‌ డాక్యుమెంట్స్‌ను కూడా తయారు చేశారన్నారు. మార్కెట్‌ విలువ కంటే తక్కువ వస్తుందని ఆశ చూపారన్నారు. లేని భూమిని ఉన్నట్లుగా రూ.31 లక్షలు తీసుకొని మోసం చేసినట్లు సగలమ్మ ఫిర్యాదు చేసిందన్నారు. కర్నాటకం అనిల్‌కుమార్‌పై ఇప్పటికే రైల్వేకోడూరు, రాజంపేట అర్బన్‌ పోలీసుస్టేషన్‌, మన్నూరు పోలీసుస్టేషన్‌లో పలు చీటింగ్‌ కేసులున్నాయన్నారు. కర్నాటకం అనిల్‌కుమార్‌, తోట కుమార్‌ను మంగళవారం రాజంపేట ప్రభుత్వాసుపత్రి వద్ద అదుపులోకి తీసుకున్నామన్నారు. తర్వాత కోర్టుకు హాజరు పెట్టామన్నారు. కావున రాజంపేట పరిసర ప్రాంతాల్లో భూములు కొనదలచిన వారు లీగల్‌ ఓపీనియన్‌ తీసుకోవాలని ఎస్‌ఐ తెలిపారు. మోసగాళ్ల మాయలో పడకుండా ఉండాలని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు