అమర జవాన్‌ స్థూపం ఆవిష్కరణ

22 Mar, 2023 02:06 IST|Sakshi
ఆలయ ప్రధాన అర్చకులను సన్మానిస్తున్న జిల్లా కలెక్టర్‌, దేవాదాయశాఖ అధికారులు

సంబేపల్లె: ఇండో టిబెటియన్‌ బోర్డర్‌ పోలీసుగా బాధ్యతలు నిర్వహిస్తూ అమరుడైన జవాన్‌ దేవరింటి రాజశేఖర్‌ స్మారక స్థూపాన్ని జిల్లా కలెక్టర్‌ గిరీష పీఎస్‌, ఎస్పీ హర్షవర్దన్‌రాజులు మంగళవారం ఆవిష్కరించారు. మండల పరిధిలోని దేవపట్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో స్థూపాన్ని మాజీ డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఆవుల విష్ణువర్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్మించారు. కలెక్టర్‌, ఎస్పీ మాట్లాడుతూ జవాన్‌ కుటుంబసభ్యులకు లబ్ధిని త్వరలోనే అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. అంతకు ముందు కలికిరి ఐటిబిపి బెటాలియన్‌ వారు స్థూపాన్ని వివిధ రకాల పూలతో అలంకరించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఆవుల వేణుగోపాల్‌రెడ్డి ఐటిబిపి బెటాలియన్‌ కమాండెంట్‌ అమిత్‌ బాటియా, డిప్యూటీ కమాండెంట్‌ ఆయూస్‌ దీపక్‌, ఇంజనీర్‌ రంజన్‌, మాజీ డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఆవుల విష్ణువర్ధన్‌రెడ్డి, రాష్ట్రకార్యదర్శి చిదంబర్‌రెడ్డి, డీఎస్పీ శ్రీధర్‌, మండల కన్వీనర్‌ ఉదయకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అర్చకులకు సన్మానం

రాయచోటి టౌన్‌ : అన్నమయ్య జిల్లాలో ప్రధాన అర్చకులుగా విశిష్ట సేవలు అందించిన పలువురు అర్చకులకు మంగళవారం నగదు పురస్కారం, ప్రశంసా పత్రాలు అందజేసి సన్మానించారు. ఉగాది పురస్కరించుకొని ముందస్తుగా అర్చకులకు రాయచోటి కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా చేతులమీదుగా పురస్కారాలు అందించారు. అన్నమయ్య జిల్లా దేవాదాయశాఖ అధికారి విశ్వనాథ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సన్మానం అందుకున్నవారిలో వాయిల్పాడు మండలం కురుబల కోట శ్రీకోదండరామ దేవస్థానం అర్చకులు మల్లిఖార్జున్‌, మదనపల్లె మండలం బసినికొండ శ్రీ కనుమల గంగమ్మ దేవస్థానం అర్చకులు ఎం. వెంకటరమణ, పీలేరు మండలం చెన్నకేశవ స్వామి ఆలయం అర్చకులు నరసింహన్‌లను సన్మానించారు. రూ.10,116లు నగదు, శాలువ, పంచ, కండువాతో సన్మానించారు. ఈ సందర్భంగా రాయ చోటి శ్రీ వీరభద్రస్వామి ఆలయ ఈఓ డీవీ రమణారెడ్డి, ముఖ్య అర్చకులు చంద్రశేఖర్‌ స్వామి, మల్లిఖార్జున స్వామి, లక్కిరెడ్డిపల్లె గంగమ్మ ఆలయ ఈఓ రవీంద్రా రాజు, గుర్రంకొండ రెడ్డెమ్మ తల్లి ఆలయ ఈఓ టి. మంజుల, చెన్నకేశవ దేవస్థానం ఈఓ కొండారెడ్డి, ఏపీఐఐసీ డైరెక్టర్‌ శ్రీనివాసరెడ్డిలు కలెక్టర్‌ను సన్మానించారు.

వేలాంగిణికి ప్రత్యేక బస్సులు

కడప కోటిరెడ్డిసర్కిల్‌ : ఏపీఎస్‌ ఆర్టీసీ కడప రీజియన్‌ పరిధిలోని బద్వేలు, మైదుకూరు డిపోల నుంచి వేలాంగిణికి ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని జిల్లా ప్రజా రవాణాధికారి గోపాల్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం రాత్రి 7.00 గంటలకు మైదుకూరు నుంచి (సర్వీసు నెంబరు 93263) బయలుదేరి 8.00 గంటలకు కడప, మరుసటిరోజు ఉదయం 10.00 గంటలకు వేలాంగిణికి చేరుతుందన్నారు. తిరిగి వేలాంగిణిలో ఆదివారం ఉదయం 11.00 గంటలకు బయలుదేరి నాగూరు, నాగపట్నం, చిదంబరం మీదుగా మరుసటిరోజు ఉదయం 5.00 గంటలకు బస్సు మైదుకూరుకు చేరుతుందన్నారు. అలాగే బద్వేలులో (సర్వీసు నెంబరు 930061) రాత్రి 7.00 గంటలకు బయలుదేరి కడప మీదుగా నాన్‌స్టాప్‌గా వేలాంగిణికి మరో బస్సు చేరుతుందన్నారు. ప్రయాణీకులకు రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించామని తెలిపారు.

మరిన్ని వార్తలు