హైకోర్టును తాకిన ఓట్ల తొలగింపు వివాదం!

22 Mar, 2023 23:56 IST|Sakshi
రాజంపేట బార్‌ అసోసియేషన్‌

రాజంపేట : పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రంలోని రాజంపేట బార్‌ అసోసియేషన్‌ ఎన్నికల ఓట్ల జాబితాలో కొందరి న్యాయవాదుల ఓట్ల తొలిగింపు వివాదానికి దారితీసింది. ఎన్నడూలేని రీతిలో బార్‌ అసోసియేషన్‌ ఎన్నికల వివాదం హైకోర్టును తాకడం ఇదే ప్రప్రథమం. దీంతో ఎన్నికల వ్యవహారంపై సర్వత్రా చర్చనీయాంశమైంది.

● బార్‌ అసోసియేషన్‌లో సభ్యత్వం లేదన్న కారణం చూపి ఓటరు లిస్టులో నుంచి పలువురు న్యాయవాదుల పేర్లను తొలిగించేశారు. దీంతో తమను ఉద్దేశ్యపూర్వకంగా తీసేశారని ఆవేదన చెందిన న్యాయవాదులు బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ను కలిసి విన్నవించారు. కాగా 130 మంది సభ్యులుగా ఉండగా, 102 మందికి మాత్రమే ఓటు హక్కు కల్పిస్తూ ప్రతిపాదనలు పంపారు. 31న పోలింగ్‌ నిర్వహించనున్నారు.

ఓటు హక్కు కల్పిస్తూ హైకోర్టు ఆర్డర్‌

ఓటర్ల జాబితా నుంచి తొలిగించిన వారికి తిరిగి ఓటు హక్కు కల్పించాలని హైకోర్టు ఆర్డర్‌ జారీ చేసింది. 20మందికి సభ్యత్వం కల్పించి, ఓటు వేసే అవకాశం కలిగేలా హైకోర్టు ఆదేశించింది. అయితే పోలింగ్‌ ముగిసినా కౌంటింగ్‌ ఉండదని న్యాయవర్గాల్లో చర్చ కొనసాగుతోంది. ఎన్నికల అధికారి వద్ద ఓటింగ్‌ బ్యాలెట్‌బాక్స్‌ సీజ్‌ భద్రపరుచుకోవాలని హైకోర్టు ఆదేశించినట్లు సమాచారం. తదుపరి ఆర్డర్‌ వచ్చిన తర్వాత కౌంటింగ్‌ ప్రక్రియను చేపట్టాలని ఆదేశించినట్లు న్యాయవాదులు అంటున్నారు. కోర్టును ఆశ్రయించిన వారిలో సీనియర్‌ న్యాయవాదులు జిలానీ, రెడ్డయ్య, జల్లి నారాయణ మరికొంతమంది ఉన్నారు.

ముగిసిన నామినేషన్ల పర్వం..

రాజంపేట బార్‌ అసోసియేషన్‌ ఎన్నికల వ్యవహారంలో నామినేషన్ల పర్వం ముగిసింది. అసోసియేషన్‌లోని ఇతర పదవులకు నామినేషన్లు పడ్డాయి.ఈ సందర్భంగా ఎన్నికల అధికారి బాలాజీ మాట్లాడుతూ రాజంపేట బార్‌ అసోసియేషన్‌ ఎన్నికల జాబితాలో లేని న్యాయవాదులకు ఓటు హక్కు కల్పించాలంటూ హైకోర్టు ఆర్డర్‌ వచ్చిందని చెపుతున్నారని, ఇంకాతనకు అందలేదన్నారు. అలాగే ఓటింగ్‌వరకే అని, కౌంటింగ్‌ నిలుపుదల అనే అంశంకు సంబంధించి ఆర్డర్‌ కూడా తనకు రాలేదని స్పష్టంచేశారు. గురువారం స్క్రూట్నీ, రెండురోజులు విత్‌డ్రాలు ఉంటాయన్నారు. అన్ని పోస్టులకు నామినేషన్లు దాఖలు అయ్యాయని వివరించారు.

రసవత్తరంగా మారిన రాజంపేట బార్‌ ఎన్నికలు

20 మందికి ఓటు హక్కు కల్పిస్తూ ఉత్తర్వులు!

31న పోలింగ్‌ అని ఎన్నికల అధికారి వెల్లడి

>
మరిన్ని వార్తలు