నేటి నుంచి మంచాలమ్మ జాతర

22 Mar, 2023 23:56 IST|Sakshi
ప్రత్యేక అలంకరణలో మంచాలమ్మ

రామాపురం : మండలంలోని రాచపల్లె పంచాయతీ గంగనేరులో వెలసిన మంచాలమ్మ తల్లి జాతరను గురువారం, శుక్రవారంలలో జరుగుతుందని కార్యనిర్వాహకులు తెలిపారు. ఈ జాతర ప్రతి ఏడాది చైత్రమాసం మొదటి రోజున జరుగుతుందన్నారు. మండలం నుంచే కాకుండా ఇతర ప్రాంతల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారన్నారు. మంచాలమ్మ తల్లి పుట్టినిల్లు కోవూరువాండ్లపల్లె నుంచి రాత్రి ఊరేగింపుగా గ్రామంలో ఆలయానికి బయలుదేరేటప్పుడు నుంచి అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లను చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

పల్లమ్మతల్లి జాతర

పెనగలూరు : మండలంలోని ఎన్‌ఆర్‌ పురం పంచాయతీ చెయ్యేరు నది ఒడ్డున వెలసిన పల్లమ్మతల్లి ఉత్సవాలు నేటి(గురువారం) నుంచి ప్రారంభం కానున్నాయి. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా ఇక్కడి ప్రజల విశ్వాసం. ప్రతి ఏడాది ఉగాది మరుసటి రోజున పల్లమ్మ జాతర నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది రోజు గంగమ్మతల్లికి పొంగుబాలు పెట్టుకొని మరుసటిరోజు జాతర నిర్వహిస్తారు. జాతర భక్తులు వేల సంఖ్యలో పాల్గొంటారు. కాగా జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ చైర్మన్‌ కాలి నరసింహులు తెలిపారు. భక్తుల దర్శనానికి వీలుగా బారీకేడ్లు ఏర్పాటు చేశామన్నారు. భక్తులు జాతరలో పాల్గొని పల్లమ్మతల్లి ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు.

మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

మదనపల్లె : మనస్తాపంతో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించిన సంఘటన తంబళ్లపల్లె మండలంలో మంగళవారం జరిగింది. మండలంలోని కోసువారిపల్లె పంచాయతీ తరుగువారిపల్లెకు చెందిన సుబ్బిరెడ్డి (42) కుటుంబ కలహాల కారణంగా మనస్తాపం చెంది ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబసభ్యులు మదనపల్లె జిల్లా ఆస్పత్రి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతికి రెఫర్‌ చేశారు.

మరిన్ని వార్తలు