సిద్దవటం కోట అద్భుతంగా ఉంది

22 Mar, 2023 23:56 IST|Sakshi
సిద్దవటం కోటలోని శిల్పసంపదను పరిశీలిస్తున్న కర్నూల్‌ రేంజి డీఐజీ సెంథిల్‌కుమార్‌

సిద్దవటం : సిద్దవటం లోని మట్లిరాజుల కోట ఆహ్లాదకరమైన వాతావరణంలో చాలా అద్భుతంగా ఉందని కర్నూల్‌ రేంజి డీఐజీ సెంథిల్‌ కుమార్‌ అన్నారు. ఒంటిమిట్ట లోని శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల పర్యవేక్షణ లో భాగంగా బుధవారం శ్రీ కోందడ రామస్వామిని దర్శించుకొని, అనంతరం సిద్దవటం కోటను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కోటలోని మొదటి, రెండవ మండపాలు, ఢంకానగర్‌, ఈద్గా, దెబ్బతిన్న నంది విగ్రహం, తవ్వకాల్లో బయల్పడిన శివలింగం, కామాక్షమ్మ గుడి, టిప్పుసుల్తాన్‌ కాలం నాటి బిస్మిల్లా షావలి దర్గా, మసీదు, రాణి స్నానవాటిక, రాజమహల్‌, రాణి మహల్‌లను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటలోని కట్టడాలకు ఉన్న శిల్పసంపద చాలా అద్భుతంగా ఉన్నాయన్నారు. విభిన్న మతాలకు, సంస్కృతి, సంప్రదాయాలతో కూడిన కట్టడాలు కోటలో ఉన్నాయన్నారు. ఇక్కడి కోట భిన్నత్వంలో ఏకత్వాన్ని తలపించేలా ఉందన్నారు. చారిత్రక కట్టడమైన మట్లిరాజుల కోటలో సీసీ కెమెరాల ఏర్పాటుకు పురాతత్వ శాఖకు లేఖ రాశామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట సీఐ పురుషోత్తంరాజు, స్థానిక ఎస్‌ఐ తులసీ నాగప్రసాద్‌, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఒంటిమిట్ట రామయ్యను దర్శించుకున్న డీఐజీ

ఒంటిమిట్ట: ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలోని సీతారామలక్ష్మణ మూర్తులను బుధవారం ఉగాది సందర్భంగా కర్నూల్‌ రేంజ్‌ డీఐజీ సెంథిల్‌ కుమార్‌ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు వారికి ఆలయ లాంచనాలతో స్వాగతం పలికి, ఆలయ ప్రదక్షణ కావించి, సీతారామలక్ష్మణ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ రంగమండపంలో వారు కాసేపు సేదతీరి, స్వామి వారి తీర్ధప్రసాదాలు స్వీకరించారు. వీరి వెంట కడప డీఎస్పీ వెంకట శివారెడ్డి, ఒంటిమిట్ట సీఐ పురుషోత్తం రాజు, ఎస్‌ఐ మధుసూదన్‌ రావు, తులసి నాగప్రసాద్‌ ఉన్నారు.

కర్నూల్‌ రేంజి డీఐజీ సెంథిల్‌కుమార్‌

మరిన్ని వార్తలు