సామర్థ్యం పెంచుతున్నాం.. శత శాతం సాధిస్తాం

22 Mar, 2023 23:56 IST|Sakshi
‘విద్యార్థి జీవితంలో కీలకమైన పదో తరగతి పరీక్షలను ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. తొలిసారి ఎదుర్కొనే పబ్లిక్‌ పరీక్షలకు విద్యార్థులు ఆందోళన చెందకుండా ఉత్తమ మార్కులు సాధించే దిశగా వారిని తీర్చిదిద్దుతున్నాం. హెచ్‌ఎం, ఉపాధ్యాయులను అప్రమత్తం చేయడంతో పాటు పిల్లలను బ్యాచ్‌లుగా విభజించి బోధన అందిస్తున్నాం’ అని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీరామ పురుషోత్తం తెలిపారు. ఏప్రిల్‌ 3వతేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఆయన పలు విషయలు వెల్లడించారు. – మదనపల్లె సిటీ

? ఈ ఏడాది పరీక్షలు రాసే విద్యార్థులెందరు

జవాబు : జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఈ ఏడాది 22,395 మంది విద్యార్థులు పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు హాజరవుతున్నారు. వీరి కోసం 492 పరీక్షా కేంద్రాలను ఎంపిక చేశాం. వీటిలో కొన్ని కేంద్రాలను సమస్యాత్మకంగా ఉన్నాయని గుర్తించి అందులో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నాం. అలాగే ప్రశ్నాపత్రాల భద్రతకు నిర్దేశించిన స్టోరేజీ పాయింట్లు ఏర్పాటు చేయడంతో ఫ్లయింగ్‌, సిట్టింగ్‌ స్క్వాడ్‌లను సిద్ధం చేస్తున్నాం.

? కేంద్రాల వద్ద ఏర్పాట్లు ఎలా

ఇప్పటికే ప్రణాళికలకు అనుగుణంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. విద్యాశాఖ, రెవెన్యూ, పోలీసు, రవాణా, విద్యుత్‌, వైద్య, పోస్టల్‌ తదితర అన్ని శాఖలు కూడా అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు మెడికల్‌ సిబ్బందిని అందుబాటులో ఉంచుతాం. ప్రతి గదిలో ఫ్యాన్‌, మంచినీటి సౌకర్యం ఉండేలా దృష్టి పెట్టాం.

? విద్యార్థుల సామర్థ్యంపై ఎలాంటి దృష్టి సారించారు

పాఠశాలల తనిఖీ సమయంలో తరగతి గదికి వెళ్లి విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకుంటున్నాం. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిలో సామర్థ్యాల పెంపునకు కృషి చేస్తున్నాం. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలు రాసే విద్యార్థులంతా ఉత్తీర్ణులయ్యేలా ప్రణాళికతో చదివిస్తున్నాం. ఈ ఏడాది ప్రతి పరీక్షకు ఒకరోజు, రెండు రోజులు చదువుకునే అవకాశం లభిస్తోంది. దీన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. వందశాతం ఉత్తీర్ణత సాధిస్తామనే విశ్వాసం ఉంది.

? ఈ ఏడాది ప్రశ్నపత్రాల కుదింపు జరిగింది కదా

జ:ఈ ఏడాది పబ్లిక్‌ పరీక్ష విధానం మారింది. గతంలో ఉండే 11 పేపర్లను 7 పేపర్లుగా కుదించగా, తాజాగా ఆరు పేపర్లుగా మార్పు చేశారు. వంద మార్కుల పరీక్షకు 3.15 గంటల సమయం కేటాయించారు. బుక్‌లెట్‌ రూపంలో ఉండే జవాబుపత్రంలోనే అన్ని సమాధానాలు పొందుపరచాలి. ప్రీపబ్లిక్‌ పరీక్షలతో పాటు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ నూతన ప్రశ్నపత్రం ఎలా ఉంటుందన్న విషయాలపై కూడా అవగాహన కల్పిస్తున్నాం.

? తల్లిదండ్రులు ఎలాంటి చర్యలు తీసుకోవాలి

విద్యాశాఖ అధికారులు,హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు సైతం విద్యార్థులకు ప్రేరణ కలిగిస్తున్నారు. తల్లిదండ్రులు సైతం పిల్లలపై ఒత్తిడి లేకుండా ప్రశాంత వాతావరణంలో చదివేలా వారికి సౌకర్యాలు కల్పించాలి. మంచి ఆహారంతో పాటు ప్రోత్సాహం అందిస్తే పిల్లలు అనుకున్న లక్ష్యాలను అధిగమిస్తారు. పరీక్షల సమయంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమని గుర్తించి వారికి అండగా ఉండటంతో పాటు మానసికంగా ఽధైర్యం నింపాలి.

? విద్యార్థులకు మీ సూచన

పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కంగారు పడకూడదు. ప్రశ్నపత్రాల కుదింపు విద్యార్థుల సౌలభ్యం కోసం చేసినదే. ప్రీపబ్లిక్‌ పరీక్షలకు హాజరైన రీతిలోనే ప్రధాన పరీక్షలకు కూడా హాజరవ్వాలి. ఉపాధ్యాయుల సూచనలు, సలహాలు పాటిస్తూ ఎప్పటికప్పుడు సందేహాలు నివృత్తి చేసుకోవాలి. అనుకున్న లక్ష్యాలను అధిగమించేందుకు కొద్దిగా కష్టపడితే విజయాలు సాధించవచ్చు.

వెనుకబడిన టెన్త్‌ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి

వారిపై నిరంతర పర్యవేక్షణ

ఆహ్లాదకర వాతావరణంలో పది పరీక్షలు

జిల్లా విద్యాశాఖాఽధికారి పురుషోత్తం

మరిన్ని వార్తలు