రాష్ట్రంలో మహిళా ఓటర్లే అధికం 

28 Oct, 2023 05:01 IST|Sakshi

మొత్తం ఓటర్లు 4,02,21,450

మహిళా ఓటర్లు 2,03,85,851 

పురుష ఓటర్లు 1,98,31,791

18, 19 ఏళ్ల ఓటర్లు 2,88,155 

2023 తుది ఓటర్ల జాబితా కన్నా 2.36 లక్షల ఓట్లు పెరుగుదల 

ప్రకటించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌ కుమార్‌ మీనా 

జనవరి 1 వరకు అర్హతలున్న వారు ఓటర్‌గా నమోదుకు అవకాశం 

డిసెంబర్‌ 9 వరకు నమోదు, అభ్యంతరాలకు గడువు 

జనవరి 5న తుది ఓటర్ల జాబితా     

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో మహిళలే నిర్ణేతలు కానున్నారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం ఓటర్లలో పురుషులతో పోలిస్తే మహిళలే అధికంగా ఉన్నారు. 2024 ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం.. రాష్ట్రంలో సాధారణ ఓటర్లు, ఓవర్సీస్, సర్విసు ఓటర్లతో కలిపి మొత్తం 4,02,21,450 ఓటర్లున్నారు. ఇందులో అత్యధికంగా 2,03,85,851 మంది మహిళా ఓటర్లుండగా 1,98,31,791 మంది పురుష ఓటర్లున్నారు.

పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు 5,54,060 మంది అధికంగా ఉన్నారు. సర్విసు ఓటర్లు 68,158 ఉండగా థర్డ్‌ జెండర్‌ ఓటర్లు 3,808 మంది ఉన్నారు. ఈ మేరకు రాష్ట్ర ముసాయిదా ఓటర్ల జాబితా–2024ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌ కుమార్‌ మీనా శుక్రవారం ప్రకటించారు. ఈ జాబితాను ఆన్‌లైన్‌లో ఉంచారు. అలాగే రాజకీయ పార్టీల ప్రతినిధులకు ముసాయిదా ఓటర్ల జాబితాను అందజేశారు.

వచ్చే ఏడాది జనవరి 1 నాటికి అర్హులైన ఓటర్లందరినీ నమోదు చేసేందుకు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను చేపట్టారు. శుక్రవారం నుంచి డిసెంబర్‌ 9 వరకు ఓటర్ల నమోదుకు, అభ్యంతరాలకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. డిసెంబర్‌ 26లోగా అభ్యంతరాలను, నమోదు దరఖాస్తులను పరిష్కరిస్తారు. వచ్చే ఏడాది జనవరి 5న ఓటర్ల తుది జాబితాను ప్రకటించనున్నారు.

మూడు జిల్లాలు మినహా..  
రాష్ట్రంలో ప్రకాశం, శ్రీ సత్యసాయి, శ్రీకాకుళం మినహా మిగతా 23 జిల్లాల్లో పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్లే అత్యధికం. పురుష, మహిళా ఓటర్లు కలిపి అనంతపురం జిల్లాలో అత్యధికంగా 19,79,775 ఓటర్లుండగా అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 7,40,857 మంది ఓటర్లు ఉన్నారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో 18 నుంచి 19 ఏళ్ల ఓటర్లు 2,88,155 మంది ఉన్నారు. 2023 తుది ఓటర్ల జాబితాతో పోల్చితే తొలగింపులు, నమోదుల అనంతరం ముసాయిదా జాబితా–2024లో 2,36,586 మంది ఓటర్లు పెరిగారు.  

నవంబర్‌ 4, 5, డిసెంబర్‌ 2, 3 తేదీల్లో ప్రత్యేక క్యాంపులు 
వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1, జూలై 1, అక్టోబర్‌ 1కి 18 ఏళ్లు నిండేవారు ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. పోలింగ్‌ కేంద్రాల వారీగా బూత్‌ లెవల్‌ ఆఫీసర్, రాజకీయ పార్టీల బూత్‌ స్థాయి ఏజెంట్లతో నవంబర్‌ 4, 5 తేదీలు, డిసెంబర్‌ 2, 3 తేదీల్లో (శని, ఆదివారాలు) ప్రత్యేక క్యాంపులను నిర్వహిస్తారు. ఆయా పోలింగ్‌ కేంద్రాల వారీగా ఓటర్ల జాబితాతో ఆ తేదీల్లో వారు అందుబాటులో ఉంటారు.

ఆయా పరిధిలోని ఓటర్లు తమ పేర్లు ఉన్నాయా, లేవా అనే విషయాన్ని పరిశీలించుకుని, లేకపోతే దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు కూడా అవకాశం ఉంది. క్షేత్రస్థాయి డాక్యుమెంట్లతో తనిఖీల ద్వారా ఓటర్ల జాబితాలో 21.18 లక్షల ఓటర్లను తొలగించారు. 99.9 శాతం తనిఖీలు పూర్తయ్యాయి. వెయ్యి మంది జనాభాకు ఓటర్ల నిష్పత్తి 729, జెండర్‌ రేషియో 1,031గా ఉంది. రాష్ట్రంలో మొత్తం పోలింగ్‌ కేంద్రాలు 46,165 ఉన్నాయి.

మరిన్ని వార్తలు