గ్రామం కనుమరుగై 200 ఏండ్లు.. ఆనవాళ్లు ఇప్పటికి పదిలంగా ఉన్నాయి

7 Oct, 2021 21:16 IST|Sakshi

సాక్షి, కర్నూలు( కోయిలకుంట్ల): కర్నూలు జిల్లా కోయిలకుంట్ల పరిసర ప్రాంతాల్లో కొన్ని శతాబ్ధాల క్రితం కనుమరుగైన గ్రామాలు ఆనవాళ్ల ఆధారంగా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కుందూనది పరివాహకంలోని బొబ్బిలి గుంతల, కనుమలపాడు, దద్దనాల గ్రామాలు రెండు వందల ఏళ్ల క్రితం కనుమరుగు కాగా అదే సమయంలో పట్టణానికి ఆరు కి.మీ దూరంలో ఉన్న గుండుమల గ్రామం ఖాళీ అయినట్లు  పలు ఆనవాళ్ల ద్వారా వెలుగులోకి వచ్చింది. రెండు శతాబ్ధాల క్రితం నుంచి గ్రామం లేకపోయినా ఆ గ్రామానికి సంబంధించిన ఆనవాళ్లు గ్రామాన్ని గుర్తుచేస్తున్నాయి.

కాలగమనంలో కలిసిన గుండుమల:
కోవెలకుంట్ల పట్టణ శివారులోని ఎస్సార్బీసీ నుంచి పొలాలకు వెళ్లే రహదారిలో సుమారు ఆరు కి.మీ దూరంలో రెండు వందల సంవత్సరాల క్రితం వరకు గుండుమల గ్రామం ఉండేది. పది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గ్రామంలో అన్ని కులాలకు సంబంధించి సుమారు 300 కుటుంబాలు జీవనం సాగించేవి. సుద్దరాళ్లతో తక్కువ ఎత్తులో నిర్మించుకున్న ఇళ్లు, కొట్టాలు ఏర్పాటు చేసుకుని వ్యవసాయం, కులవృత్తుల ఆధారంగా కుటుంబాలను పోషించుకునే వారు అ‍క్కడ నివసించే ప్రజలు.

కొర్ర, ఆరుకలను ప్రధాన పంటలుగా, సజ్జ, జొన్న, వేరుశనగ, కంది, పెసర, తదితర పంటలను సాగుచేసేవారు. కుండలు చేయడం, చెప్పులు కుట్టడం, మగ్గంనేయడం, తదితర కులవృత్తులతో ఆయా కులాల్లోని కుటుంబాలు కుల వృత్తులు నిర్వహించేవారు. వీరభద్రస్వామి, శ్రీరాముడు, ఆంజనేయస్వాములను ఆరాధ్య దైవాలుగా కొలిచినట్లు ప్రస్తుతం లభ్యమైన ఆధారాల ద్వారా తెలుస్తోంది. గ్రామస్తులు సంక్రాంతి, ఉగాది, శ్రీరామనవమి పండులను అత్యంత వైభవంగా నిర్వహించేవారని బయటపడ్డ ఆధారాల ద్వారా వెల్లడి అవుతోంది. 

కుందూనది వరదలు, దొంగల బెడదతో గ్రామం ఖాళీ:
పట్టణానికి సుదూరంలో ఉండటం, చుట్టుపక్కల కనుచూపుమేర గ్రామాలు లేకపోవడం, పక్కనే కుందూనది ఉండటంతో నదికి తరుచూ సంభవించే వరదలు, దొంగల బెడదతో రెండు వందల సంవత్సరాల క్రితం గ్రామం ఖాళీ అయింది. గ్రామానికి అతి సమీపంలోనే కుందూనది ప్రవహిస్తుండటం, ఆకాలంలో అధికంగా వర్షాలు కురిసేవి.  వర్షాకాలమంతా నది ఉప్పొంగి గ్రామాన్ని ముంచెత్తేది.

వరదల కారణంగా ప్రాణ, ఆస్తి, పంటనష్టం జరిగి గ్రామస్తులు తీవ్ర నష్టాలు చవి చూసేవారు. వేసవికాలంలో దొంగలు పడి గ్రామంలో పడి డబ్బులు, బంగారు ఆభరణాలు, ధాన్యం, తదితర విలువైన వస్తువులు దోచుకెళ్లేవారు. వరదలు, దొంగల బెడదతో గ్రామస్తులు ఒక్కొక్కరుగా గ్రామాన్ని విడిచి గ్రామానికి సమీపంలో ఉన్న భీమునిపాడు, కంపమల్ల, క్రిష్టిపాడు, గుళ్లదూర్తి, కోవెలకుంట్ల ప్రాంతాలకు వలస వెళ్లడంతో క్రమేపి గ్రామం ఖాళీ అయ్యింది. ఈ గ్రామం నుంచి ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డ వంశస్తులు ఇప్పటికి ఆయా గ్రామాల్లోనే నివాసం ఉంటున్నారు. 

రెండు శతాబ్ధాలు గడిచినా ఆనవాళ్లు పదిలం:
గ్రామం కనుమరుగై రెండు వందల సంవత్సరాలు దాటినా గ్రామానికి సంబంధించిన పలు ఆనవాళ్లు ఇప్పటికి పదిలంగా ఉన్నాయి. ఇళ్లకు సంబంధించి పునాది గోడలు, గ్రామ ప్రజల దాహార్తి తీర్చే కుంట, ప్రజలు ఆరాధ్య దైవాలుగా కొలిచే వీరభద్రస్వామి, రామునిరాతి విగ్రహాలు, వీరభద్రస్వామిని ఊరేగించే రథచక్రాలు, కుంటకు సంబంధించిన మెట్లు గ్రామాన్ని గుర్తు చేస్తున్నాయి. గ్రామం కనుమరుగు కాగా గ్రామం ఉన్న ప్రాంతం క్రమేపి వ్యవసాయ భూమిగా మార్పు కావడంతో ప్రస్తుతం ఆ ప్రాంతంలో రైతులు శెనగ, జొన్న పంటలు సాగు చేసుకుంటున్నారు. రెవెన్యూ రికార్డుల్లో గ్రామానికి సంబంధించిన భూములను ఇప్పటికి గుండుమల పొలాలుగా పిలుస్తుండటం విశేషం.

చదవండి: అదొక చిన్న గ్రామం.. అయితేనేం ప్రభుత్వ ఉద్యోగుల అడ్డాగా మారింది

Read latest Ap-special News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు