Andhra Pradesh: ’సాల్ట్‌’తో చదువులు సంపూర్ణం

18 Dec, 2021 14:25 IST|Sakshi

ప్రాజెక్టు ద్వారా పూర్వ ప్రాథమిక, ప్రాథమిక విద్యపై ప్రత్యేక దృష్టి

భాషా నైపుణ్యాలు, అభ్యసన సామర్థ్యాలు మెరుగు

50 లక్షల మందికి ప్రయోజనం

ప్రపంచ బ్యాంకు ఆర్థిక సాయంతో అమలుకానున్న ప్రాజెక్టు 

సాక్షి, అమరావతి : ప్రపంచ బ్యాంకు ఆర్థిక సాయంతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ‘సపోర్టింగ్‌ ఆంధ్రాస్‌ లెర్నింగ్‌ టాన్ఫర్మేషన్‌’(సాల్ట్‌) ప్రాజెక్టు ద్వారా దాదాపు 50 లక్షల మందికి పైగా పిల్లలకు ప్రయోజనం చేకూరనుంది. వారిలో అభ్యసన సామర్థ్యాలు పెంపొందించేందుకు ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపడుతోంది. పునాది స్థాయిలో సామర్థ్యాలు తగిన రీతిలో లేనందున ఉన్నత తరగతులకు వెళ్లే కొద్దీ విద్యార్థుల్లో ప్రమాణాలు సన్నగిల్లుతున్నాయి. ఈ పరిస్థితి నుంచి విద్యార్థులను దశల వారీగా ‘సాల్ట్‌’ ప్రాజెక్టు ద్వారా ఉత్తమ సామర్థ్యాలతో తీర్చిదిద్దుతారు. ప్రాజెక్టు అమలుకు ప్రపంచ బ్యాంకు 250 మిలియన్‌ డాలర్లను అందించనున్న సంగతి తెలిసిందే.

అభ్యసన సామర్థ్యాలను తరగతులకు తగ్గట్టుగా అభివృద్ధి చేస్తారు. ముఖ్యంగా అట్టడుగు వర్గాలు, దివ్యాంగులు, బాలికల్లో ఉత్తమ సామర్థ్యాలే లక్ష్యంగా ప్రాజెక్టును రూపొందించారు. కోవిడ్‌ కారణంగా బడులు మూతబడి ఈ వర్గాల పిల్లలు విద్యాభ్యసన సదుపాయాల్లేక సామర్థ్యాలను అందుకోలేకపోయారు. అంతకు ముందు నేర్చుకున్న పరిజ్ఞానాన్నీ కోల్పోయారు. ప్రభుత్వం దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆయా వర్గాల విద్యార్థులకు మేలు చేకూర్చే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును అమలు చేస్తోంది. వారికి మౌలిక సదుపాయాలు, డిజిటల్‌ అభ్యాసన వనరులు, ఆర్థిక ప్రోత్సాహకాలు అందించడం ద్వారా నాణ్యమైన విద్యా ప్రమాణాలు సాధించేలా చేయనుంది.
చదవండి: అభివృద్ధి వికేంద్రీకరణపై తిరుపతిలో భారీ బహిరంగ సభ

టీచర్లకు స్వల్పకాల శిక్షణ 
రాష్ట్రంలో 45 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో 45 లక్షల మంది వరకు విద్యార్థులున్నారు. విద్యారంగానికి సీఎం జగన్‌ అత్యధిక ప్రాధాన్యమిస్తుండటంతో అంతకు ముందుకన్నా విద్యా ప్రమాణాలు మెరుగయ్యాయి. నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే–2017 గణాంకాలతో పోల్చి చూస్తే.. పలు అంశాల్లో పిల్లల్లో సామర్థ్యాలు మెరుగుపడ్డాయి. అయితే గత ప్రభుత్వం పాఠశాల విద్యపై పూర్తిగా నిర్లక్ష్యం వహించడంతో ఎలిమెంటరీ స్థాయి విద్యార్థుల్లో ప్రమాణాలు పూర్తిగా దెబ్బతిని ఉన్నాయి. ఐదో తరగతి విద్యార్థుల్లో కనీస గ్రేడ్‌ స్థాయి నైపుణ్యాలూ కరవయ్యాయి. ఈ పరిస్థితి నుంచి విద్యార్థులను గట్టెక్కించేందుకు ప్రభుత్వం అనేక ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి కొంత వరకు ఫలితాలు సాధించగలిగింది.

నూతన సామర్థ్య ఆధారిత బోధనాభ్యసన విధానాలను అమలు చేయించింది. అలాగే పాఠశాలలను నాడు–నేడు ద్వారా అభివృద్ధి చేస్తుండటంతో పాటు.. విద్యార్థులకు జగనన్న విద్యా కానుక ద్వారా విద్యకు అవసరమైన వస్తువులు, పౌష్టికాహారాన్ని అందిస్తోంది. ఇప్పుడు ఈ సాల్ట్‌ ప్రాజెక్టు ద్వారా వీటిని మరింత బలోపేతం చేయనుంది.  ప్రాజెక్టు ద్వారా అంగన్‌వాడీ టీచర్లకు, ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు స్వల్పకాల శిక్షణ ఇస్తారు. విద్యార్థులకు బోధనకు వీలైన టీచింగ్‌ లెర్నింగ్‌ మెటీరియల్‌ను అందిస్తారు. ముఖ్యంగా పూర్వ ప్రాథమిక, ప్రాథమిక విద్యల బలోపేతంపై దృష్టి పెట్టనున్నారు. తద్వారా పై తరగతులకు వెళ్లే కొద్దీ విద్యార్థుల్లో భాషా నైపుణ్యాలు, అభ్యసన సామర్థ్యాలు మెరుగుపడతాయి.

ముఖ్యంగా మారుమూల, గిరిజన ప్రాంతాల్లో టీచర్లను దృష్టిలో పెట్టుకుని ఆ ప్రాంతాల్లోని 3,500 స్కూళ్లలో ప్రీస్కూల్‌ స్థాయి కోర్సును అమలు చేయనున్నారు. ఇక పూర్వ ప్రాథమిక విద్య(పీపీ–1, పీపీ–2) ప్రారంభమవుతున్న అంగన్‌వాడీల్లో మూడు నుంచి ఆరేళ్ల లోపు పిల్లలు పది లక్షల మంది వరకూ ఉన్నారు. వీరందరికీ మేలు చేసేలా ఈ ప్రాజెక్టు అమలు కానుంది.  

మరిన్ని వార్తలు