Palamaneru Real Name: మూడు రాష్ట్రాల ముచ్చటైన కూడలిగా ఫేమస్‌..  ఏ ఊరో తెలుసా!

6 Oct, 2021 16:57 IST|Sakshi
పలమనేరు పెద్దచెరువు

సాక్షి, చిత్తూరు: ఈతరం పిల్లలకు ఉంటున్న ఊరు పేరెందుకొచ్చిందో తెలియని వారు చాలామంది ఉన్నారు. కనీసం ఊరి పేరు ఎందుకొచ్చిందో గూగూల్‌ తల్లిని అడిగినా పెద్దక్లారిటీ ఉండదు. అందుకే పలమనేరుకు ఆపేరెలా వచ్చిందో తెలిపే ప్రయత్నం చేద్దాం. పూర్వం పలమనేరు ప్రాంతాన్ని పల్లవులు పరిపాలించే వారు. పట్టణానికి పడమటి వైపు ఓ చెరువును తవ్వించి దానికి పల్లవన్‌ ఏరి అనే నామకరణం చేసినట్లు తెలుస్తోంది. పల్లవన్‌ ఏరి అంటే చెరువు వద్ద ఉన్న గ్రామమని అర్ధం. ఈ పల్లవనేరే కాలక్రమేణ పల్నేరు ఆపై పలమనేరుగా రూపాంతరం చెందింది.


పలమనేరు పట్టణ వ్యూ

ఈ ప్రాంతం సముద్ర మట్టానికి  2244 అడుగుల ఎత్తున ఉండడంతో ఇక్కడ వేసవిలోనూ వాతావరణం చల్లగా ఉంటుంది. అందుకే ఈ పట్టణాన్ని పేదవాని ఊటిగా పిలుస్తారు. పలమనేరు పట్టణం మూడు రాష్ట్రాల కూడలిగా ఉండడంతో ఇక్కడ తెలుగు,తమిళం, కన్నడ భాషలను మాట్లాడుతారు. ఇప్పటికీ ఈ మూడు సాంప్రదాయలు, సంస్కృతులు ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడి నుంచి గుడియాత్తం, క్రిష్ణగిరి, మదనపల్లె, కుప్పం, బెంగుళూరులకు రోడ్డు మార్గాలున్నాయి. ఇక్కడి ఆహ్లాదకర వాతావరణానికి పులకించిన అప్పటి యూరోపియన్, బ్రిటిష్‌ అధికారులు దీన్ని వారి వేసవి విడిదిగా ఉపయోగించారు.


పలమనేరులోని నాటి బ్రిటీష్‌భవనాలు

దానికి సంబంధించిన విడిది గృహము ఇప్పటికీ ఉపయోగంలో ఉంది. (ప్రస్తుత తహసీల్దార్‌ కార్యాలయం). వీటితో పాటు పీర్ల రహదారి, సర్కెట్‌ హౌస్, వైట్‌ సైడ్‌ అతిథి గృహాల పేర్లు ఉన్నాయి. దీంతో పాటు అమెరికన్‌ ఆర్కాడ్‌ మిషన్‌చే ఓ అతిథి గృహం 1932లోనే నిర్మితమైంది. అప్పట్లోనే నెలకు దీని అద్దె రూ.40గా వసూలు చేసేవారట. ఇక ఫారెస్ట్‌ గెస్ట్‌ హౌస్‌తో పాటు క్రిస్టియన్‌లకు సంబంధించిన పలు సుందరమైన పురాతన భవనాలు నేటికీ చెక్కుచెదరలేదు.


పలమనేరులోని నాటి బ్రిటీష్‌భవనాలు

ఇక్కడి సీఎస్‌ఐ ప్రాంగణంలో గాంధీ మహాత్ముడు సేద తీరిన మర్రి చెట్టు ఉంది. ప్రతి శుక్రవారం పట్టణంలో జరిగే వారపు సంత, పశువుల సంత అనాదిగా జరుగుతోంది. పలమనేరు టమోటా, పట్టు, చింతపండు, పాలుకు ప్రసిద్ది చెందింది. జిల్లాలోనే టమోట, పట్టు సాగులో పలమనేరు ద్వితీయ స్థానంలో ఉంది. ఇక్కడ పాల ఉత్పత్తి ఎక్కువ. దీన్ని మిల్క్‌ సిటీగా కూడా పిలుస్తారు.

చదవండి: అంతరిస్తున్న ఆదిమానవుడు

మరిన్ని వార్తలు