‘అవ్వ’ హోటల్‌.. రూ. 25కే మీల్స్‌.. ఎక్కడో తెలుసా?

7 Dec, 2021 18:34 IST|Sakshi

కడుపునిండా భోజనం

కర్నూలు పాతబస్తీలో ‘అవ్వ’ హోటల్‌గా ప్రసిద్ధి

‘అవ్వ కావాలా.. బువ్వ కావాలా ఏదో ఒకటి ఎంచుకోమనే పదాన్ని సర్వసాధారణంగా క్లిష్ట సమస్యలొచ్చినప్పుడు వాడుతుంటాం.. కాకపోతే కర్నూలు నగర పాతబస్తీలో మాత్రం అవ్వే స్వయంగా బువ్వ వడ్డిస్తుంది. తన హోటల్‌లో సన్న బియ్యంతో చేసిన అన్నం, పప్పు, సాంబారు, కర్రి, పచ్చడి, మజ్జిగ మధ్యాహ్న భోజనంగా అందిస్తోంది. బయటి హోటళ్లలో మీల్స్‌ రూ. 60 నుంచి రూ. 90లకు విక్రయిస్తున్న ఈ కాలంలో అవ్వ వద్ద రూ.25ల ధరకే లభిస్తుండటం విశేషం.

ఆశ్చర్యం వేస్తోంది కదూ! ఇది వాస్తవం. కడుపు మాడ్చుకునే నిరుపేదల ఆకలి తీర్చేందుకు ఈమె ఇలాంటి పద్ధతికి శ్రీకారం చుట్టారు. ఇప్పటినుంచి కాదు.. ఓ పదహైదేళ్ల నుంచి! అలాగని ఆమె గొప్ప ధనవంతురాలేమీ కాదు.. ఆస్తిపాస్తులు అసలే లేవు. ఓ సామాన్యురాలే. ఆకలిబాధేమిటో ఆకలిగొన్నవారికే తెలుస్తుందనే అనుభవాన్ని ఆమె స్వయంగా చవిచూసింది.

భర్త మరణంతో తెలిసొచ్చిన ఆకలిబాధ..
ఈ అవ్వ పేరు కురువ లక్ష్మీదేవి. ఈమె భర్త కె.తిప్పన్న. సేంద్రీయ ఎరువుల వ్యాపారం చేసేవాడు. పశువుల పేడను ఆర్డరిచ్చిన రైతుల చేన్లకు లారీలో తరలించేవాడు. వీరిరువురికి యాభైఐదు ఏళ్ల క్రితం వివాహం అయింది. ఓ ఐదేళ్లకు కుమారుడు (కె.మద్దయ్య) పుట్టాడు. పెళ్లి చేసుకున్న పదేళ్లూ ఆ దంపతులు సుఖంగానే ఉన్నారు. అప్పటివరకు ఆకలి బాధేంటో అవ్వకు తెలీదు. విధి వక్రించడంతో ఆమెకు భర్త వియోగం కలిగింది. అప్పటినుంచి ఆ కుటుంబానికి అధోగతి పట్టింది. అప్పట్లో బుధవారపేట బ్రిడ్జీ స్థానంలో హంద్రీ నదిలో గచ్చు (ఇసుక, సున్నం, నీరు కలిపిన మిశ్రమం) గానుగలు ఉండేవి.

ఇంటిగోడల నిర్మాణానికి, ప్లాస్టిరింగ్‌కు గచ్చునే వాడేవారు. అవ్వ మారెమ్మ గానుగలో పని కుదుర్చుకుంది. రాత్రింబవళ్లు కష్టపడినా కూలీడబ్బులు వారానికి రూ.50 మాత్రమే లభించేది. పెద్దపడఖానాలోని తన ఇరుకింటిలోనే జీవనం గడిపేది. వర్షానికి కారుతున్నా మరమ్మతులకు డబ్బులుండేవి కావు. కనీసం టీ తాగడానికి పది పైసలు ఉండేవి కావు. ఇంతటి ఆర్థిక కష్టాన్ని సైతం ఆమె ఎదురీదుతూ కుమారుడిని ఏడో తరగతి దాకా చదివించుకుంది. కొన్నాళ్లకు గానుగలకు డిమాండ్‌ పడిపోయింది. ఈమె ఉపాధి కోల్పోయింది. బొంగుల బజార్‌లోని జైనమందిరంలో నెలకు రూ. 900ల చొప్పున పని కుదుర్చుకుంది. అక్కడ పదహైదేళ్లు పనిచేస్తే జైనమత పెద్దలు జీతాన్ని రూ. 1500లకు పెంచారు.1994లో కుమారుడికి నగరానికే చెందిన సుభద్రతో పెళ్లి చేసింది.

హమాలీల ఆకలిబాధలు కలచివేశాయి..
అవ్వ మండీబజార్‌లో రూ.600తో ఓ చిన్నగదిని అద్దెకు తీసుకుంది. కుమారుని సాయంతో మొదట ఉగ్గాని, బజ్జి వంటి టిఫిన్‌ పదార్థాలను విక్రయిస్తుండేది. మండీబజార్‌కు దూర ప్రాంతాల నుంచి సరుకుల లారీలు వస్తుంటాయి. నగరంతో పాటు పరిసర గ్రామాలకు చెందిన హమాలీలు లారీల్లోంచి సరుకుల బస్తాలు దింపుతుంటారు. మధ్యాహ్న సమయంలో భోంచేయడానికి ఇళ్ల వద్ద నుంచి చద్దిమూట తెచ్చుకునే వారు. తెల్లవారు జామునే వారు తెచ్చుకున్న అన్నం పాచిపోయేది.

పప్పు వాసనకొట్టేది. చేతిలో డబ్బులేక వారు బజ్జీ తిని కాలం వెళ్లబోసుకునే వారు. మధ్యాహ్నం పూట వారి ఆకలి నకనకలను అవ్వ అతి సమీపం నుంచి చూసింది. ఏదోరీతిలో వారికి సాయం చేయాలనే సంకల్పానికి వచ్చింది. తను బజ్జీలమ్మే గదిలోనే సన్నబియ్యంతో అన్నం తయారు చేసి రూ. 10కే విక్రయించింది. ధర చౌకగా ఉండటం వల్ల హమాలీలు రాసాగారు. అన్నంతో పాటు పప్పు, సాంబారు, పచ్చడి, మజ్జిగలను వడ్డించింది.

నష్టం కలిగించిన వరద..
2009లో నగరానికి వరదలు వచ్చాయి. వరద ప్రభావంతో నిల్వ ఉంచుకున్న కొన్ని బియ్యం బస్తాలు, బ్యాళ్లు వంటివి పాడైపోయాయి. పుంజుకోవడానికి సమయం పట్టింది. అయినా అవ్వ అధైర్య పడలేదు. అన్నం వడ్డింపునకు అంతరాయం కలిగించలేదు. భోజన ధరను రూ. 15కు పెంచారు. స్థలం చాలడం లేదని 2014లో ఎదురుగా ఉండే షాపులోకి షిఫ్ట్‌ అయ్యారు. కొడుకు, కోడలు అవ్వకు తోడుగా నిలిచారు.హమాలీలతో పాటు షాపుల్లో పనిచేసే గుమస్తాలు, పనిమీద నగరానికి వచ్చిన బాటసారులు, నిరుపేదలు అందరు రాసాగారు. ఆమె అన్నానికి క్రమేపీ గిరాకీ పెరిగింది.  భోజన సరఫరా వేళలను పెంచుతూ ఈ ప్రక్రియను మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగించారు. బియ్యం ధర కేజీ రూ. 50 ఉండే ప్రస్తుత రోజుల్లోనూ అవ్వ రూ.25కే భోజనం వడ్డిస్తుండటం గమనార్హం. 

రైతుబజార్‌ రైతులకూ ఉపయోగకరమే..
నగరంలోని సీక్యాంప్‌ రైతుబజార్‌కు కూరగాయలు తెచ్చే గ్రామీణ రైతులు తెల్లవారు జామునే సరుకులతో బయలుదేరి వస్తారు. వారు చద్దిమూట తెచ్చుకున్నా పాచిపోతుంటుంది. ఇక్కడ అవ్వ హోటల్‌ ఉందనే విషయం తెలుసుకుని వారూ ఉపయోగించుకుంటున్నారు. పేద సాదలే కాకుండా ఒకసారి రుచి చూసిన వారు మళ్లీమళ్లీ వస్తున్నారు.

సేవతో సంతృప్తి: కురువ లక్ష్మీదేవి (అవ్వ)
 కలిసి ఉంటే కలదు సుఖం అనే మాట నిజం. మేం కుటుంబ సభ్యులంతా కలిసి అన్నం పెట్టే మహాయజ్ఙాన్ని నడిపిస్తున్నాం. మేమే స్వయంగా నిర్వహించుకుంటాం  కాబట్టి మాకు పనివాళ్ల అవసరం ఉండదు. వేతనాల చెల్లింపుల ఖర్చు అసలే ఉండదు. బియ్యం లూజుగా కొంటే ధర ఎక్కువ. మేం ఒకేసారి ఐదారు బస్తాలు కొనేస్తాం. చౌకధరకు లభిస్తాయి. బ్యాళ్లు, నూనె వంటి ఇతర వస్తువులను కూడా టోకులో కొంటున్నాం. లాభాపేక్షతో కాకుండా సేవాభావంతో (అంటే తక్కువ లాభంతో) పనిచేస్తున్నాం. పేదలకు సైతం కడుపు నింపుకునే అవకాశం కల్పించినందుకు నాకు, మా కుటుంబానికి ఎంతో సంతృప్తినిస్తోంది. ఇటీవలే కంటి ఆపరేషన్‌ చేసుకున్నా ఇంట్లో ఉండలేకపోయా.  నా పేరుతోనే హోటల్‌ నడుస్తుంది – కాబట్టి పనిలోకి వెంటనే వచ్చేశా.

పడిదెంపాడు నుంచి వచ్చా: నాగరాజు, రైతు
నేను పండించిన కూరగాయలను పడిదెంపాడు నుంచి తెచ్చా. నేను, నా భార్య ఉదయం నుంచి సాయంత్రం దాకా సీక్యాంప్‌ రైతుబజార్‌లో కూరగాయలు విక్రయించుకుని ఊరికి వెళుతుంటాం. మేం తెచ్చే కూరగాయలపై వచ్చే లాభం అంతంత మాత్రమే. హోటల్‌ భోజనం తినేంత స్థోమత ఉండదు. రోజూ మధ్యాహ్నం అవ్వ హోటల్‌కు వచ్చి తింటా. నా భార్యకు పార్సిల్‌ తీసుకెళతా.

గోకులపాడు నుంచి వచ్చా: మద్దిలేటి, హమాలీ
ఇక్కడ మండీబజార్‌లో హమాలీ పని చేయడానికి నేను ఎ.గోకులపాడు గ్రామం నుంచి వచ్చా. హమాలీ కార్మికుల ఒప్పందం ప్రకారం మాకు 24 గంటల షిఫ్ట్‌ ఉంటుంది. ఇరవైనాలుగు గంటల కాల వ్యవధిలో మూడుసార్లు తినాల్సి వస్తుంది. మధ్యాహ్న భోజనం మాత్రం అవ్వ వద్ద తిని. మిగతా వేళల్లో టిఫిన్లతో గడుపుతుంటా.

గొందిపర్ల నుంచి వచ్చా: రాజు, హమాలీ
నేను హమాలీ పనిచేస్తుంటా. ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చే లారీల లోడ్‌ దింపడం, ఎక్కించడం నా పని. ఉదయం ఇంట్లో టిఫిన్‌ చేసి వస్తా. భోజనం తెచ్చుకుంటే చెడిపోద్ది. అవ్వ హోటల్‌ నాకు వరం. రూ.25 ఇచ్చి కడుపునిండా భోజనం చేస్తాను. ఇలాంటి హోటల్‌ లేకపోయింటే మా లాంటి పేదలు ఎనభై రూపాయలు చెల్లించుకోలేక పస్తులుండాల్సి వచ్చేది.

మరిన్ని వార్తలు