AP Special: శ్రీవారి సన్నిధిలో ఇం‘ధన’ పొదుపు

21 Dec, 2021 14:38 IST|Sakshi

 విద్యుత్‌ ఖర్చు తగ్గించే దిశగా టీటీడీ చర్యలు

తిరుమల, అనుబంధ ఆలయాలు, సత్రాల్లో పొదుపు చర్యలు

స్టార్‌ రేటెడ్‌ ఉపకరణాలు, పునరుత్పాదక ఇంధనంపై ప్రత్యేక దృష్టి

2 మెగావాట్ల రూఫ్‌టాప్‌ సోలార్‌ సిస్టం ఏర్పాటుకు నిర్ణయం

సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానములు(టీటీడీ)లో విద్యుత్‌ పొదుపునకు చర్యలు తీసుకుంటున్నారు. పర్యావరణహిత, ఇంధన సామర్థ్య సాంకేతికతలను ప్రవేశపెడుతున్నారు. బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ), ఆంధ్రప్రదేశ్‌ ఇంధన పరిరక్షణ మిషన్‌ (ఏపీఎస్‌ఈసీఎం) సహకారంతో  ఈ ఇంధన సామర్థ్య కార్యక్రమాలను టీటీడీ అమలు చేయనుంది. దీనివల్ల టీటీడీ ప్రస్తుతం విద్యుత్‌ బిల్లులపై చేస్తున్న వ్యయంలో దాదాపు 10 శాతం ఆదా అయ్యే అవకాశముందని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి. టీటీడీ ఏటా 68 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తును వినియోగిస్తోంది.

ఇందులో 30 శాతం సౌర, పవన విద్యుత్తు కాగా, 70 శాతం విద్యుత్‌ను ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్‌) సరఫరా చేస్తోంది. విద్యుత్‌ బిల్లులకు ఏటా సుమారు రూ. 40 కోట్ల వరకు టీటీడీ ఖర్చు చేస్తోంది. విద్యుత్‌ ఆదా చర్యలు అమలు చేయడం ద్వారా బిల్లులలో కనీసం 10 శాతం ఆదా చేయాలని భావిస్తోంది. దీనికోసం టీటీడీ ఆధ్వర్యంలోని అన్ని పాఠశాలలు, కళాశాలల భవనాలపై 2 మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్తు కేంద్రాలను న్యూ రెన్యూవబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ), జాతీయ స్థాయి ఏజెన్సీల సహకారంతో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 

పాత ఫ్యాన్ల స్థానంలో కొత్తవి..
టీటీడీలోని పాత పంప్‌ సెట్ల స్థానంలో ఇంధన సామర్థ్య పంపు సెట్లు, 5 వేల సాధారణ ఫ్యాన్ల (75 వాట్లు) స్థానంలో సూపర్‌ ఎఫిషియంట్‌ బీఎల్డీసీ (బ్రష్‌ లెస్‌ డైరెక్ట్‌ కరెంటు) ఫ్యాన్లు (35 వాట్లు) వంటి ఇంధన సామర్థ్య ఉపకరణాలను అమర్చనున్నారు. వీటి వల్ల ఏడాదికి రూ. 62 లక్షల విలువైన 0.88 మిలియన్‌ యూనిట్లు విద్యుత్‌ ఆదా అయ్యే అవకాశముంది.

విద్యుత్‌ ఆదాకు ప్రణాళికలు
టీటీడీ అనుబంధ ఆలయాలు, సత్రాలలో విద్యుత్‌ పొదుపు చర్యలు చేపడుతున్నాం. దీనిలో భాగంగా బీఈఈ స్టార్‌ రేటెడ్‌ ఉపకరణాలు వినియోగంతో పాటు పునరుత్పాదక ఇంధన వనరులను తగినంత స్థాయిలో వినియోగించుకోవాలని భావిస్తున్నాం. అదే విధంగా తిరుమల, తిరుపతిలో ఎలక్ట్రిక్‌ రవాణా సదుపాయాలను కూడా ప్రోత్సహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. ఈ చర్యల వల్ల విద్యుత్‌ వినియోగం తగ్గడంతో పాటు భక్తులకు మరింత సౌకర్యంగా ఉంటుందని భావిస్తున్నాం.
–టీటీడీ ఈవో కె.జవహర్‌రెడ్డి

మరిన్ని వార్తలు