రిబ్బన్‌ రంగు చెబుతుంది.. జరుగుతున్న తంతేంటో

7 Oct, 2021 20:18 IST|Sakshi

రంగు రిబ్బన్లలో దాగున్న రహస్యం ఇదే

యడ్లపాడు: మనం ఆఫీసుకు వెళ్లే క్రమంలో వీధుల్లో..ప్రభుత్వ కార్యాలయాల వద్ద జనాలు నిరసన కార్యక్రమాలను నిర్వహించడం తరచు చూస్తూనే ఉంటాం. వారు ఏ విషయంపై ధర్నా, నిరసన చేస్తున్నారనే విషయాన్ని తెలుసుకోవాలని ఉన్నా...వారు దూరంగా ఉండోచ్చు లేదా మనం వివరంగా తెలుసుకునేంత సమయం ఉండకపోవచ్చు. వారి జేబుకున్న బ్యాడ్జీలా తగిలించుకున్న కలర్‌ రిబ్బన్‌ ఆధారంగా ఆ కార్యక్రమ వివరాలను ఇట్టే తెలుసుకోవచ్చు. 

ఉద్యోగులు, ఇతరులు, సామాన్య ప్రజలు, ఆపత్కాలంలో ఉన్నవారు ఆయా అంశాలకు సంబంధించిన రంగు గుడ్డలు లేదా కలర్‌ రిబ్బన్లను జేబులకు ధరించడాన్ని బట్టి వారి భావాలను పసిగట్టవచ్చు. నలుపు, తెలుపు, ఎరువు ఇలా ఒక్కోరంగు పట్టీ ఒక్కో అంశాన్ని సూచికగా నిలుస్తుంది. తెలియజేస్తుంది. ఏ రంగుపట్టీ దేన్ని సూచిస్తుందో తెలుసుకుందాం.

నలుపురంగు: 
ఉద్యోగులు తమ డిమాండ్లను తెలియజేస్తూ నిరసన వ్యక్తం చేసేప్పుడు నలుపు రంగు రిబ్బను పట్టీ ధరిస్తారు. అలాగే మృతి చెందిన వారికి సంతాప సూచికంగా నివాళి అర్పించే సమయంలోనూ వీటిని జేబులకు పెట్టుకుంటారు. 

తెలుపురంగు: 
గర్భిణులు, మహిళలపై దాడులు జరిగినప్పుడు వాటికి వ్యతిరేకంగా నిర్వహించే సమావేశాల్లో తెలుపురంగు పట్టీలు ధరిస్తారు. సురక్షిత మాతృత్వం, శాంతి, అహింసలను తెలుపుతూ జరిపే కార్యక్రమాల్లోన వీటిని ఉపయోగిస్తారు. 

గులాబీరంగు: 
గులాబీరంగు రిబ్బను మహిళల ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను సూచిస్తుంది. ముఖ్యంగా ఆడవారిలో రొమ్ము కాన్సర్‌ మీద అవగాహన కల్పించేందుకు దీనిని అంతర్జాతీయ గుర్తుగా ఉపయోగిస్తారు.

ఎరుపురంగు: 
ఎయిడ్స్, రక్త క్యాన్సర్, గుండెజబ్బులు, వ్యవసనం, విపత్తు, ఉపశమనం తదితర వాటిపై నిర్వహించే సమావేశాల్లో ఎరుపురంగు రిబ్బను ధరిస్తారు. ఏటా డిసెంబర్‌ ఒకటిన అందర్జాతీయ ఎయిడ్స్‌ నివారణ దినం సందర్భంగా నిర్వహించే ర్యాలీలు, సమావేశల్లో పాల్గొనే వారు వీటిని ధరిస్తారు. అలాగే అత్యవసర పరిస్థితులకు దీన్ని ఉపయోగిస్తారు.

నీలిరంగు: 
ఈ రంగు రిబ్బనును సుమారు 100కుపైగా సందర్భాల్లో ఉపయోగిస్తారు. మానవ అక్రమ రవాణా, బెదిరంపులకు వ్యతిరేకంగా సమావేశాలు జరిపే సమయంలో నిర్వాహకులు వీటిని పెట్టుకుంటారు. జల సంరక్షణపై అవగాహన కల్పించే సమయంలోనూ నీలిరంగు రిబ్బను పట్టీలను ధరిస్తారు. 

ఆకుపచ్చరంగు: 
మూత్రపిండాలు, కాలేయం, అవయవదానం, సురక్షిత వాహన చోదనం తదితర వాటికోసం ఆకుపచ్చ రిబ్బను పట్టీని ధరిస్తారు. గ్లోబల్‌వామింగ్‌ తదితర 45 రకాల కారణాలను తెలిపే సందర్భంలోనూ దీనిని ఉపయోగిస్తారు. 

పసుపురంగు: 
యుద్ధంలో ఖైదు చేయబడిన, తప్పిపోయిన వారికోసం ఏర్పాటు చేసిన సమావేశాల్లో పసుపురంగు రిబ్బను పట్టీని ధరిస్తారు. ఆత్మహత్యల నివారణకు, ఎముకల క్యాన్సర్‌ తదితర వాటి గురించి నిర్వహించే అవగాహన సదస్సుల్నో వీటిని ఉపయోగిస్తారు. 

28 రకాల రంగులు: 
మానవ శరీరంలో వివిధ అవయవాలకు సోకిన క్యాన్సర్‌ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలకు ప్రభుత్వం, వైద్యులు, స్వచ్ఛందసంస్థల నిర్వాహకులు 28 రంగుల రిబ్బను పట్టీలను ఉపయోగిస్తారు. క్యాన్సర్‌ వ్యాధి సోకడానికి కారణాలు, వాటి లక్షణాలు, ట్రీట్‌మెంట్‌ విధానం, ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాల గురించి చైతన్యం చేసేందుకు వీటిని ధరిస్తారు. 
 

Read latest Ap-special News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు