డ్రాగన్‌.. ‘ఫల’కరింపు

3 Dec, 2021 19:35 IST|Sakshi

సాక్షి, తుని(తూర్పుగోదావరి): అందరూ వెళ్లే దారిలో వెళ్లాలనుకోలేదాయన.. ఫ్రూట్‌ఫుల్‌గా ఉండే డ్రాగన్‌ సాగుపై దృష్టిసారించారు. ఔషధగుణాలు అధికంగా ఉండే ఈ పండ్లకు ఉన్న డిమాండ్‌ తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాకు వెళ్లి అక్కడ సాగవుతున్న పంటను వారం రోజుల పాటు పరిశీలించారు. ఈ ఏడాది ఆగస్టులో అమెరికన్‌ బ్యూటీషన్‌ (ఎంఎం గోల్డ్‌) రకం విత్తనం తీసుకుని ఎస్‌.అన్నవరంలో తనకున్న 2.40 ఎకరాల్లో సాగుకు శ్రీకారం చుట్టారు.

ఆయనే తూర్పు గోదావరి జిల్లా మెట్ట ప్రాంతానికి చెందిన పోలిశెట్టి రామారావు (టైల్స్‌ రామారావు). ఒకసారి నాటితే మూడేళ్ల నుంచి 25 ఏళ్లు ఏకధాటిగా (ఫిబ్రవరి నుంచి నవంబర్‌ వరకు) డ్రాగన్‌ ఫ్రూట్‌ ఫలసాయాన్ని పొందవచ్చని ఆయన చెబుతున్నారు. దీని సాగుకు మెట్ట ప్రాంత నేలలు అనుకూలంగా ఉన్నాయంటున్నారు.    

సాగు ఇలా.. 
ఆరు అడుగులు ఎత్తులో చక్రాకారంలో సిమెంట్‌ స్తంభాలను ఏర్పాటు చేసుకోవాలి. డ్రాగన్‌ ఫ్రూట్‌ లభించిన మట్టల నుంచి సేకరించిన విత్తనాన్ని సిమెంట్‌ స్తంభాల చట్టూ నాలుగైదు నాటుకోవాలి. మూడు నెలల్లో సిమెంట్‌ స్తంభాలకు విస్తరిస్తుంది. అప్పటి నుంచి ఒక్కొక్కటిగా డ్రాగన్‌ ఫ్రూట్‌ ఫలసాయం లభిస్తుంది. విస్తారంగా ఫలసాయాన్ని పొందేందుకు నవంబరు, ఫిబ్రవరి మధ్యకాలంలో వచ్చే పూతను రైతులు ఎప్పటికప్పుడు తొలగించడం ఉత్తమం.

దీంతో ఫిబ్రవరి నుంచి అధికంగా ఫలసాయం లభించనుంది. తొమ్మిది నెలల్లో ఎకరాకు నాలుగు నుంచి పది టన్నులు డ్రాగన్‌ ఫ్రూట్స్‌ లభిస్తాయి. చీడపీడలు ఆశించకపోవడంతో రసాయనక ఎరువులు, మందులు వాడాల్సిన పనిలేదు. విస్తారంగా పంట విరబూసేందుకు గో మూత్రం, వివిధ రకాల ఆకులతో తయారు చేసిన కషాయాల పిచికారీ, కలుపు నివారణ, వేసవిలో రెండు రోజులకు డ్రిప్‌ పద్ధతిలో ఒక తడుపు వంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి.

ఎండవేడిమిని అదుపు చేసేందుకు డ్రాగన్‌ ఫ్రూట్‌ చక్రాకార సిమెంట్‌ స్తంభాలను ఆనుకుని సీతాఫలం మొక్కలు వేసుకోవడం మంచిది. ఫ్రూట్‌ తొలగించిన రెబ్బలు (మట్టలు) నుంచి రైతు సొంతంగా విత్తనాన్ని తయారు చేసుకోవచ్చు. విత్తనాన్ని విక్రయించుకోవడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు.  

అబ్బురపరిచే ఔషధ గుణాలు  
పుచ్చకాయ మాదిరిగా తియ్యని రుచి కలిగిన డ్రాగన్‌ ఫ్రూట్స్‌లో అబ్బుర పరిచే ఎన్నోపోషక విలువలు ఉన్నాయి. రక్తంలో చక్కెర నియంత్రణ, తెల్లరక్త కణాలు, ప్రేగుల్లో మంచి చేసే 400 రకాల బ్యాక్టీరియాల వృద్ధి, క్యాన్సర్, కీళ్ల నొప్పులు, మలబద్ధకాన్ని నివారించడం, రోగ నిరోధక శక్తిని పెంపొందించడం, జీర్ణాశయ రుగ్మతలు తొలగించే పీచు పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో డ్రాగన్‌ ప్రూట్స్‌కి రోజురోజుకీ డిమాండ్‌ పెరుగుతోంది.

రూ.15 లక్షల పెట్టుబడి  
డ్రాగన్‌ ఫ్రూట్స్‌కు ఉన్న డిమాండ్‌తో సాగు చేయాలన్న ఆసక్తి కలిగింది. తెలంగాణ రాష్ట్రం నల్గొండలో వారం రోజులు పంటను పరిశీలించి, సాగు, సంరక్షణ, సస్యరక్షణ తదితర విషయాలపై అవగాహన వచ్చింది. సీజన్‌లో ఎకరానికి నాలుగు నుంచి పది టన్నులు దిగుబడి, రూ.లక్షల్లో ఆదాయం వస్తుందని తెలుసుకున్నాను. ఆగస్టులో అమెరికన్‌ బ్యూటీషన్‌ (ఎంఎం గోల్డ్‌) రకం విత్తనం తీసుకువచ్చాను.

2.40 ఎకరాల్లో 12 వందల వలయాకార సిమెంట్‌ స్తంభాలను ఏర్పాటు చేసి రూ.15 లక్షలు పెట్టుబడితో డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు చేపట్టాను. సేంద్రియ పద్ధతులను అనుసరిస్తున్నాను. తొలి పంట ఫలసాయం 2022 ఫిబ్రవరిలో లభించనుంది. డ్రాగన్‌ ఫ్రూట్స్‌ రుచులను స్థానికులకు అందించాలన్న ఆలోచనతో వ్యాపారులతో ఒప్పందాలకు అంగీకరించలేదు. 

– పోలిశెట్టి రామారావు, అభ్యుదయ రైతు, తుని

మరిన్ని వార్తలు