హాట్సాఫ్‌ హరిత.. ‘మూగ’ ప్రేమ

21 Oct, 2021 22:53 IST|Sakshi
కుక్క పిల్లలకు పాలు పోస్తున్న హరిత,బుజ్జిమేకను బుజ్జగిస్తూ బుజ్జి హరిత

నోరులేని జీవుల పట్ల దయ చూపుతున్న చిన్నారి

సొంత డబ్బుతో కుక్కపిల్లలకు పాలపాకెట్లు

మేకలతో సహవాసం

కర్నూలు (ఓల్డ్‌సిటీ): ‘బుజ్జీ.. ఏం డల్‌గా ఉన్నావ్‌..  ఎగిరెగిరి గంతులు వేసే దానివి కదా.. ఏం.. మీ అమ్మ పాలు తాపించలేదా..’  అంటూ మేకపిల్లను ఎత్తుకుని తల్లి మేక వద్ద వదిలింది చిన్నారి హరిత. అంతేకాదు.. దానికి అది పాలు తాపించేదాకా వదలలేదు.. మరో మేకపిల్ల వద్దకు వెళ్లి ‘నువ్వేమి అలిగినట్లు కూర్చున్నావమ్మా.. నీకేమైందిరా.. దా.. నేను ఎత్తుకుంటా’ అంటూ ఒళ్లో కూచోబెట్టుకుని దాని తల నిమిరుతుంటే సమీపంలోనే ఉండే మరో మూడు మేకపిల్లలు కూడా వచ్చి చేరాయి.. ఇది సీన్‌ కాదు.. కట్టు కథ అసలే కాదు..  నగరంలోని గీతాంజలి వెంచర్‌కు పునాది పడక ముందు నుంచి వెంచర్‌ యజమాని గోపాల్‌ను వాచ్‌మేన్‌గా నియమించాడు.

అక్కడే ఉండి నిర్మాణ పనులపై నిఘా పెట్టేందుకు వీలుగా యజమాని గోపాల్‌ దంపతులకు ఓ షెడ్డు నిర్మించి ఇచ్చారు. వారికి నలుగురు సంతానం. ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు చేశారు. ప్రస్తుతం ఓ పద్నాలుగేళ్ల బాలుడు, ఓ పన్నెండేళ్ల బాలిక మాత్రమే వారి వద్ద ఉంటున్నారు. గోపాల్‌ వాచ్‌మేన్‌ ఉద్యోగంతో పాటు మేకల పెంపకం కూడా చేస్తున్నాడు. బాలుడు మేకల్ని మేపుకుని వస్తే.. భార్య, బాలిక ఇంట్లో మేత వేస్తుంటారు.

ఈ రకంగా బాలిక హరితకు మేకలతో, మేకపిల్లలతో బాగా దోస్తీ అయింది. వాటిని వదిలిపెట్టి ఉండలేదు. హరిత ఎన్టీఆర్‌ నగర్‌లోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతుంది. వీధిలో ఇటీవలే ఓ ఆడకుక్క ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. కుక్క పిల్లలు పొద్దున్నుంచి ఏమీ తినలేదని బాధ పడుతుంటుంది. హరిత స్కూల్‌ నుంచి వచ్చేటప్పుడు తన సొంత డబ్బుతో ఓ పాలపాకెట్‌ కొనుక్కుని వచ్చి, పాలను ఓ పెద్ద బాలెలో పోసి కుక్కపిల్లలకు తాపిస్తుంటుంది. 

ఏ కుక్కపిల్ల మిస్‌ కాకుండా అన్నింటిని మొదట బాలెవద్దకు తీసుకొస్తుంది.. ఆమె పాలపాకెట్‌ తేగానే ఆ దృశ్యం చూసేందుకు చుట్టుపక్కల చిన్నారులు కూడా అక్కడికి చేరుకుంటారు. మూగ జీవుల ఆకలి ఆక్రందనలు ఏమిటో తెలుసుకుని వాటికి ఆహారం అందించే దయా గుణం కలిగిన ఆ చిన్నారిని చూసిన ప్రతిఒక్కరు హాట్సాఫ్‌ చెబుతున్నారు.

మరిన్ని వార్తలు