అక్రమ నివాస గృహ స్థలాల క్రమబద్ధీకరణకు సువర్ణావకాశం

6 Oct, 2021 12:55 IST|Sakshi

300 చదరపు గజాల వరకు సక్రమం చేసుకునే వెసులుబాటు

సచివాలయాల ద్వారా దరఖాస్తుల ఆహ్వానం

సిక్స్‌ స్టెప్‌ వ్యాలిడేషన్‌ నియమ, నిబంధనలు పాటించాలి

జీఓ ఎంఎస్‌ నంబర్‌ 225ను విడుదల చేసిన ప్రభుత్వం

కర్నూలు(సెంట్రల్‌) : ఆక్షేపణ లేని ప్రభుత్వ భూముల్లో అక్రమ నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారికి శుభవార్త. వారి ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తూ జీఓ నంబర్‌ 225ను విడుదల చేసింది. 300 గజాల చదరపు అడుగుల వరకు సక్రమం చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. డిసెంబర్‌ 31వ తేదీ వరకు అర్హులైన వారు తమ సమీపంలోని గ్రామ/వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు ఇవ్వవచ్చు. 

ఎవరు అర్హులంటే....
అక్రమ నిర్మాణాలను సక్రమం చేసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనలు పాటించాలని సూచించింది. విధిగా సిక్స్‌ స్టెప్‌ వ్యాలిడేషన్‌ నిబంధలను పాటించాలి. అంటే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికే అవకాశం ఇస్తారు. 

గ్రామీణ ప్రాంతము..
–సదరు అక్రమ నివాస కుటుంబ సభ్యుల నెలసరి ఆదాయం(అన్ని వనరులు)రూ.10 వేలు ఉండాలి. అనగా సంవత్సరం ఆదాయం రూ1.20 లక్షలకు దాటకూడదు.
– 10 ఎకరాల మెట్ట లేదా 3 ఎకరాల తడి భూమి..రెండు కలిపి 10 ఎకరాల వరకు ఉండవచ్చు.
–  సదరు కుటుంబంలో ఎవరూ ఆదాయ పన్ను కట్టకూడదు
– సదరు కుటుంబంలో 4 చక్రాల వాహనాలు ఉండరాదు. అయితే ట్రాక్టర్, ఆటో, ట్యాక్సీ ఉంటే మినహాయిస్తారు.
– సదరు కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉండరాదు
పట్టణ ప్రాంతము...
– సదరు ఆక్రమణదారు కుటుబం నెలసరి ఆదాయం(అన్ని వనరురులు) నెలకు రూ.12 వేలు వరకు మాత్రమే ఉండాలి. సంవత్సారానికి 1.44 లక్షల వరకు ఆదాయం ఉండవచ్చు
– సదరు కుటుంబంలో ఎవరూప్రభుత్వ ఉద్యోగం చేయరాదు. అయితే కాంట్రాక్ట్‌ ఉద్యోగం చేస్తే మినహాయిస్తారు.
– సదరు కుటుంబంలో ఎవరూ ఆదాయపు పన్ను చెల్లించరాదు
– సదరు కుటుంబంలో 4 చక్రాల వాహనాలు ఉండరాదు. అయితే ట్రాక్టర్, ఆటో, ట్యాక్సీ ఉంటే మినహాయిస్తారు.
– అంతేకాక సదరు కుటుంబం 500కు పైగా గజాల ఇంటి స్థలం ఎవరి పేరిట ఉండరాదు

సక్రమం ఎలా చేస్తారంటే...
అక్రమ నిర్మాణాలను సక్రమం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీఓ ఎంఎస్‌ 225ను విడుదల చేసింది. దీని ప్రకారం ప్రభుత్వం పొందు పరచిన షరతులు, నియమ, నిబంధనలను పాటిస్తూ ఆక్రమణలు ఉంటే క్రమబద్ధీకరించుకోవచ్చు. అది కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆక్షేపణ లేని భూముల్లోమాత్రమే క్రమబద్ధీకరణకు అవకాశం ఇస్తారు. 
– 75 చదరపు గజాల విస్తీర్ణం వరకు సిక్స్‌ స్టెప్‌ వ్యాలిడేషన్‌లో దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్లు తెలితే ఉచితంగా డీపట్టా జారీ చేస్తారు. 
–75 నుంచి 150 చదరపు గజాల విస్తీర్ణాన్ని క్రమబద్ఖీరించుకోవాలంటే ఆ భూమి యొక్క ప్రాథమిక విలువలో 75 శాతం ప్రభుత్వానికి చెల్లించాలి.
– 150–300 చదరపు గజాల విస్తీర్ణం ఉన్న స్థలాన్ని క్రమబద్ధీకరించుకోవాలంటే ఆ భూమి యొక్క ప్రాథమిక విలువలో 100 శాతం చెల్లించాలి. 

క్రమబద్ధీకరిచుకోవడం ద్వారా లాభమేమిటీ?
అక్రమ ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించుకోవడం ద్వారా పలు లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆ స్థలం లేదా ఇంటికి మార్కెట్‌ విలువ వస్తుంది. రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. బ్యాంకులో మార్టిగేజ్‌ చేసుకొని అవసరమైన సమయాల్లో ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టేక్కెందుకు వీలు ఉంటుంది. క్రమబద్ధీకరించకపోతే ఆ స్థలం లేదా ఇంటికి ఎలాంటి విలువ ఉండదు. ఎవరూ అమ్మినా కొనుగోలు చేయరు. 

సచివాలయాల ద్వారా దరఖాస్తుల స్వీకరణ...
అక్రమ నివాస ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించేందుకు సచివాలయాల్లో సంబంధిత బాధిత కుటుంబాలు దరఖాస్తులు ఇవ్వాలి. వారు ఇచ్చిన దరఖాస్తులను అక్కడి టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు పరిశీలించి సిక్స్‌ స్టెప్‌ వ్యాలిడేషన్‌ కిందకు వస్తారా రారా అన్న విషయాన్ని పరిశీలిస్తారు. వస్తే క్రమబద్ధీకరించేందుకు అవకాశం కల్పిస్తారు. సంబంధిత లబ్ధిదారులు డిసెంబర్‌ 31వ తేదీ వరకు దరఖాస్తులను ఇవ్వవచ్చు. 

మంచి అవకాశం
అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు ఇది మంచి అవకాశం. దారిద్రరేఖకు దిగువన ఉన్న ప్రతి ఒక్కరికీ జీఓ నంబర్‌ 225 వర్తిస్తుంది. అర్హులందరూ దరఖాస్తులను డిసెంబర్‌ 31వ తేదీలోపు సమీపంలోని గ్రామ/వార్డు సచివాలయాల్లో ఇవ్వాలి. ఇళ్లను క్రమబద్ధీకరించుకోవడం ద్వారా మార్కెట్‌ విలువ వస్తుంది. 
 – పి.కోటేశ్వరరావు, కలెక్టర్, కర్నూలు

మరిన్ని వార్తలు