Andhra Pradesh: ‘హజ్‌’ అరుదైన భాగ్యం

24 Nov, 2021 21:26 IST|Sakshi

ఆర్థిక స్థోమత ఉన్న ప్రతి ముస్లింకు తప్పనిసరి

2022 హజ్‌ యాత్ర దరఖాస్తులు షురూ

ఆన్‌లైన్‌లో జనవరి 31 వరకు గడువు

నియమ నిబంధనలు తప్పనిసరి

ఏఒక్క ఆప్షన్‌ సరిగ్గా లేకున్నా యాత్ర అవకాశం కోల్పోయే ప్రమాదం

దరఖాస్తు చేయు విధానంపై సమగ్ర కథనం

కర్నూలు (ఓల్డ్‌సిటీ) : ఇస్లాం ఐదు మూల స్తంభాలపై ఆధారపడి ఉండగా అందులో మొదటిది విశ్వాసం. ఆతర్వాతి స్థానాలు నమాజ్, రోజా, జకాత్, హజ్‌లకు లభిస్తాయి. నమాజ్, రోజాలకు ఆర్థిక స్థోమత అవసరం ఉండదు. నాలుగోది జకాత్‌ (అంటే దానధర్మాలు). హజ్‌ అనేది ఆర్థిక స్థోమతను బట్టి జీవితంలో ఒక్కసారైనా వెళ్లాల్సిన పవిత్ర యాత్ర. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది ముస్లింలు 40 రోజుల పవిత్ర హజ్‌యాత్ర చేస్తున్నారు. హజ్‌యాత్ర ఒకప్పుడు ప్రయాసతో కూడుకున్నది. సుదీర్ఘ ఓడ ప్రయాణం, ఆ తరువాత సౌదీలో ఒంటెలు, గుర్రాలపై ప్రయాణం వంటి దశలు ఉండేవి.

విమాన ప్రయాణం మొదలైనప్పటి నుంచి ఎంతో సులువుగా మారింది. 2019కి సంబంధించిన జిల్లా యాత్రికులు 473 మంది యాత్ర చేశారు. ఆతర్వాత కోవిడ్‌–19 కారణంగా 2020, 2021 సంవత్సరాల్లో భారతీయులకు హజ్‌ యాత్ర అవకాశం కలగలేదు. ప్రస్తుతం 2022కి సంబంధించిన దరఖాస్తుల  ప్రకియ ఈనెల 1వ తేదీనే ప్రారంభమైంది. హజ్‌ యాత్రకు వెళ్లాలనుకునే వారు పూర్తి చేసిన దరఖాస్తులను జనవరి 10వ తేదీలోపు అందజేయాల్సి ఉంటుంది. (కాగా ఆన్‌లైన్‌కు ఆఖరు తేది 2022, జనవరి 31). ముస్లింలలో ఎక్కువ శాతం నిరక్షరాస్యులు. పైగా దరఖాస్తు గడులన్నీ ఆంగ్లంలో ఉంటాయి.

వాటిని అర్థం చేసుకుని పూరించాలంటే తలప్రాణం తోకకు వస్తుంటుంది. ఒక్కగడి తప్పుగా పూరించినా హజ్‌ యాత్రలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. లేదా సెంట్రల్‌ హజ్‌ కమిటీ తరపున హజ్‌యాత్ర చేసే అవకాశం కోల్పోవచ్చు. అన్ని అంశాలను కూలంకషంగా అర్థం చేసుకున్న తర్వాతే పూరించాల్సి ఉంటుంది. దరఖాస్తు పూరించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియబరుస్తూ హజ్‌ యాత్రికులకు ‘సాక్షి’ అందించిన తోడ్పాటే ఈ కథనం..

దరఖాస్తుల్లో రెండు విధాలు..
కుటుంబంలో ఒక్కరే హజ్‌యాత్రకు వెళ్లాలనుకుంటే వ్యక్తిగత వివరాలతో దరఖాస్తు  చేసుకుంటే చాలు. అదే కుటుంబంలోని నలుగురు సభ్యులు వెళ్లాలనుకుంటే ఒకే దరఖాస్తులో అందరి వివరాలు పొందుపరచవచ్చు. ఇలాంటి దరఖాస్తును ‘కవర్‌’ అంటారు. కవర్‌లో కవర్‌హెడ్‌ అందరి తరపున బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది. కవర్‌లో ఐదుగురు కుటుంబ సభ్యులు, బంధువులు  వెళ్లవచ్చు. ఇందులో (09.09.2022 నాటికి) రెండేళ్లలోపు వయస్సు కలిగిన ఇద్దరు చిన్నపిల్లలు కూడా ఉండవచ్చు. (వీరికి టికెట్టులో 10 శాతం చెల్లించాల్సి ఉంటుంది.) యాత్రికులు అందజేసిన దరఖాస్తులను హజ్‌ కమిటీలు, సొసైటీల ప్రతినిధులు బాధ్యత తీసుకుని ఆన్‌లైన్‌ చేస్తారు. కవర్‌ నెంబర్‌ మాత్రం ఐహెచ్‌పీఎంఎస్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా జనరేట్‌ చేస్తారు. హజ్‌ యాత్రికులను ఎంపిక చేసేందుకు సెంట్రల్‌ హజ్‌ కమిటీ వారు జనవరిలో కవర్‌ నంబర్‌తోనే డ్రా తీస్తారు.

అర్హతలు..
భారత పౌరసత్వం కల్గిన ముస్లింలు హజ్‌ కమిటీ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. హజ్‌ చేయాలంటే వారు తప్పనిసరిగా ఇండియన్‌ పాస్‌పోర్టు కలిగి ఉండాలి. (అది మిషన్‌ రీడబుల్, ఇంటర్నేషన్‌ పాస్‌పోర్టు అయి ఉండాలి) 2022 హజ్‌ యాత్ర కోసం పాస్‌పోర్టు కాలపరిమితి 2022, డిసెంబరు 31వ తేదీ వరకు ఉండాలి. ఒక్కరోజు తక్కువ ఉన్నా అనుమతించరు.

హజ్‌ దరఖాస్తుకు జత చేయాల్సినవి..
పూరించిన హజ్‌ దరఖాస్తుతో పాటు సెంట్రల్‌ హజ్‌ కమిటీ అకౌంటుపై బ్యాంక్‌లో (ఎస్‌బీఐ  బ్యాంక్‌లో) చెల్లించిన రూ. 300 చలానా, పాస్‌పోర్టు జిరాక్స్, అకౌంట్‌ నంబర్‌ కనిపించే విధంగా బ్యాంక్‌ పాస్‌బుక్‌ జిరాక్స్, నాలుగు ఫొటోలు (వెనక తెల్లటి బ్యాక్‌గ్రౌండ్‌ ఉండాలి.  తెలుపు కాకుండా తలకు ఇతర రంగు టోపీ ధరిస్తే మంచిది) అందజేయాల్సి ఉంటుంది. మహిళలు చెవులు కనిపించేలా ఫొటోలు దిగాలి. ఒకవేళ పాస్‌పోర్టులో సూచించిన ఇంట్లో నివాసం ఉండకపోతే ప్రస్తుత చిరునామాను సూచించే ధ్రువపత్రం (ఆధార్‌ లేక రేషన్‌ కార్డు) కూడా జతపరచాలి.

రెండు కేటగిరీల్లో యాత్ర..
హజ్‌ యాత్రకు వెళ్లే వారిలో చెల్లించే ఫీజును బట్టి గ్రీన్, అజీజియా అనే రెండు కేటగిరీలు ఉంటాయి. గ్రీన్‌ కేటగిరీ వారికి మక్కాకు సమీపంలో బస చేసే సదుపాయం కల్పిస్తారు. అయితే ప్రస్తుత సంవత్సరంలో గ్రీన్‌ కేటగిరీకి ‘ఎన్‌సీఎన్‌టీజడ్‌’ అని పేరు మార్చారు. అంటే ‘నాన్‌ కుకింగ్‌ నాన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ జోన్‌’ అని అర్థం.

65 ఏళ్ల లోపు వారే అర్హులు.
గతంలో డెభ్భై ఏళ్లు నిండిన సీనియర్‌ సిటిజన్లకు హజ్‌యాత్రలో రిజర్వు కేటగిరీ కేటాయించేవారు. ప్రస్తుతం కోవిడ్‌–19 వచ్చాక నిబంధనలు మారాయి. 65 ఏళ్లలోపు వయస్సు కలిగిన వారు మాత్రమే యాత్రకు వెళ్లాలి. రెండేళ్లలోపు పిల్లలను వెంట తీసుకెళితే పాస్‌పోర్టు అవసరం ఉండదు. అంతకు పైబడి వయస్సు కలిగిన పిల్లలకు ప్రత్యేక పాస్‌పోర్టు అవసరం. మహిళలకు ఒంటరిగా వెళ్లే అవకాశం ఉండదు. నిబంధనల్లో సూచించిన వ్యక్తి (మెహరం) తోడుండాలి. లేదా 31.05.2022 నాటికి వయస్సు 45 ఏళ్లు పైబడిన నలుగురు మహిళలు గ్రూప్‌గా వెళ్లవచ్చు.

వ్యాక్సినేషన్‌ తప్పనిసరి..
హజ్‌ యాత్రకు వెళ్లే ముందు ప్రతి యాత్రికుడు తప్పనిసరిగా రెండు డోసుల కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ వేయించుకుని ఉండాలనే నిబంధన ఉంది. వ్యాక్సినేషన్‌ చేయించుకోవడమే కాకుండా ఆ మేరకు సర్టిఫికెట్‌ కూడా పొందుపరచాల్సి ఉంటుంది. 

వీరు అనర్హులు..
గర్భిణీ మహిళలు, మానసిక రోగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, కుష్ఠు, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉండదు.

నామినీ..
హజ్‌ యాత్రికుల వెంట రాకుండా ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల పేరును (పూర్తి చిరునామాతో) మాత్రమే  నామినీగా పొందుపరచాలి.

బ్యాంక్‌లో ఖుర్బానీ ఫీజు..
హజ్‌యాత్రలో భాగంగా ఖుర్బానీ నిర్వహించడానికి సౌదీ ప్రభుత్వం గుర్తించిన ఇస్లామిక్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఐడీబీ)లో ‘అదాయి కూపన్‌’ తీసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులో ఈ అంశాన్ని స్పష్టం చేయాలి. (ప్రైవేట్‌ వ్యక్తులకు ఖుర్బానీ సొమ్ము అప్పగిస్తే వారు మోసగించే అవకాశం ఉందని చెబుతారు).

లక్కీ డ్రా..
దరఖాస్తులు అధిక సంఖ్యలో వచ్చినా సెంట్రల్‌ హజ్‌ కమిటీ నిర్ణయించిన కోటా మేరకే యాత్రికులు ఎంపికవుతారు.  ముంబాయిలో డ్రా తీస్తారు. డ్రాలో వచ్చిన వారికి మాత్రమే కమిటీ తరపున హజ్‌యాత్రకు వెళ్లే అవకాశం కలుగుతుంది.

ఉచితంగా ఆన్‌లైన్‌ సేవలు..
హజ్‌ యాత్రికులకు సేవ చేస్తే పుణ్యం లభిస్తుందనే సదుద్దేశంతో జిల్లాలో అనేక సొసైటీలు ముందుకు వచ్చి వారి ప్రయాణానికి అవసరమైన సేవలు ఉచితంగా అందిస్తున్నాయి.  సొసైటీల ప్రతినిధులు దరఖాస్తులను ఉచితంగా ఆన్‌లైన్‌ చేస్తున్నారు. దరఖాస్తులు మొదలు హజ్‌ యాత్రికులు విమానం ఎక్కే దాకా వారికి అవసరమైన శిక్షణ, సదుపాయాలు, రోగనిరోధక వాక్సినేషన్‌ వంటి సేవాభావంతో కల్పిస్తాయి. బుధవారపేటలోని మహబూబ్‌సుభానీ మసీదులో రాయలసీమ హజ్‌ సొసైటీ వారు సేవలు అందిస్తున్నారు. వీరి ఫోన్‌ నంబర్లు: అధ్యక్షుడు ఎం.మొహమ్మద్‌పాష: 76809 01952, ప్రధాన కార్యదర్శి బాషా సాహెబ్‌: 99633 18255. జిల్లా హజ్‌ సొసైటీ అధ్యక్షుడు నాయబ్‌ సలీం: 99123 78586, ప్రధాన కార్యదర్శి అష్వాక్‌ హుసేని: 98662 86786. దరఖాస్తుకు జతపరచాల్సిన పత్రాలతో వీరిని సంప్రదిస్తే ఉచితంగా ఆన్‌లైన్‌ చేస్తారు.

ఒంట్లో సత్త ఉన్నప్పుడు వెళ్లి రావడమే మేలు: ఇర్షాదుల్‌ హక్‌
ఆర్థిక స్థోమత కలిగిన వాళ్లు వృద్ధాప్యం వచ్చేంత వరకు నిరీక్షించాల్సిన అవసరం లేదు. ఎవరి ఆయుష్షు ఎంత ఉంటుందో ఎవరికి తెలియదు కదా.. పైగా వృద్ధాప్యంలో లేనిపోని జబ్బులు వస్తుంటాయి. వాటిని భరించి 40 రోజుల ప్రయాణంలో ఇబ్బందులు పడటం కంటే, యవ్వన ప్రాయంలోనే హజ్‌ యాత్రకు వెళ్లి రావడం ఉత్తమం. నేను అబ్బాస్‌నగర్‌లో ఉంటాను. నాకు ఏసీ స్పేర్‌పార్ట్స్‌ షాప్‌ ఉంది. హజ్‌కు వెళ్లేంత స్థోమత ఉంది కాబట్టి నా 50వ ఏటనే హజ్‌  ముగించుకువచ్చాను. నా ముగ్గురు పిల్లలను బంధువులకు అప్పగించి నేను, నాభార్య ఇద్దరు కలిసి ఓ ఐదేళ్ల క్రితమే హజ్‌ యాత్రకు వెళ్లొచ్చాం. యాత్రకు అవసరమైన డాక్యుమెంటేషన్‌ అంతా హజ్‌ సొసైటీల వాళ్లే ఉచితంగా చేసి పెట్టారు. అల్లా వారికీ పుణ్యం ప్రసాదిస్తాడు.

శిక్షణ తీసుకోకపోతే ఇక్కట్లే.. : జాకిర్‌ హుసేన్, సివిల్‌ ఇంజనీరు
నేను సివిల్‌ ఇంజనీర్‌ని. బాలాజీనగర్‌లో ఉంటాను. హజ్‌కు వెళ్లాలంటే సాధారణ దుస్తులను వదిలేసి ఇహ్‌రాం అనే వస్త్రాన్ని ధరించాల్సి ఉంటుంది. దేశం వదిలి ఇతర దేశానికి వెళతాం కాబట్టి అక్కడి చట్టం, అక్కడి నియమ నిబంధనలపై అవగాహన ఉండాలి. హజ్‌ యాత్రలోని ప్రధాన ఘట్టాలు కూడా తెలిసి ఉండాలి. పక్కనే ఉండే వ్యక్తిని అడిగితే అతనూ మనదేశీయుడే అయి ఉంటాడు. అందువల్ల హజ్‌యాత్రకు ముందే అన్ని తెలుసుకుని ఉండాలి. ఇందుకు హజ్‌ సొసైటీలు నిర్వహించే శిక్షణ తరగతులు బాగా ఉపయోగపడతాయి. అప్లికేషన్‌ భర్తీ చేసేటప్పుడు ఒక్క గడి తప్పున్నా అవకాశం కోల్పోయే ప్రమాదం ఉంది. నేను విద్యావంతుడినైనా కూడా ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ను సొసైటీ ద్వారానే భర్తీ చేయించుకున్నాను.

మరిన్ని వార్తలు