ఏడేళ్ల వయస్సులో ప్రపంచ రికార్డు సొంతం

9 Nov, 2021 14:04 IST|Sakshi

తణుకు(ప.గో జిల్లా) : చిన్నారి వయస్సు కేవలం ఏడేళ్లు... అయితేనేం వరల్డ్‌ రికార్డు సొంతం చేసుకుంది. తణుకు పట్టణానికి చెందిన చిన్నారి వేగేశ్న జ్యోత్స్న సాత్విక ఫైర్‌  విత్‌ బ్లేడ్‌ లింబో స్కేటింగ్‌లో ప్రపంచ రికార్డు సొంతం చేసుకుంది. వజ్ర వరల్డ్‌ రికార్డ్స్, లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన సాహసోపేతమైన ప్రదర్శనలో జ్యోత్స్న సాత్విక విజయం సాధించింది. 26 మీటర్లు పొడవునా 8 అంగుళాల ఎత్తులో స్టాండ్స్, బ్లేడ్స్‌ ఏర్పాటు చేసి మంటల కింద నుంచి నిర్వహించిన ప్రదర్శనలో చిన్నారి విజయం సాధించి ఫైర్‌ విత్‌ బ్లేడ్‌ లింబో స్కేటింగ్‌  వజ్ర వరల్డ్‌ రికార్డ్స్‌ సీఈవో తిరుపతిరావు, కిడ్స్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ సీఈవో అరుణ్, లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ కోఆర్డినేటర్‌ ప్రతాప్‌లు చేతుల మీదుగా అవార్డులు  అందుకుంది. 

స్కేటింగ్‌పై ఆసక్తితో...
అయిదేళ్ల వయస్సు నుంచి చిన్నారి జ్యోత్స్న సాత్వికకు స్కేటింగ్‌పై మక్కువ. సాత్విక తాడేపల్లిగూడెంలోని ప్రైవేటు స్కూలులో మూడో తరగతి చదువుతోంది. ఆమెలోని ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు స్కేటింగ్‌ కోచ్‌  లావణ్య వద్ద శిక్షణ నిమిత్తం చేర్పించారు. తండ్రి ఫణికుమార్‌ వ్యవసాయం చేస్తుండగా తల్లి మోహననాగసత్యవేణి గృహిణి. తల్లిదండ్రులు చిన్నారిని నిత్యం చదువుతోపాటు స్కేటింగ్‌లో శిక్షణ ఇచ్చేందుకు ప్రోత్సహిస్తున్నారు. సుమారు ఏడాదిన్నరపాటు శిక్షణ తీసుకుని అనంతరం కోవిడ్‌  కారణంగా నిలిపివేసింది. అనంతరం ఇటీవల మూడు నెలలుగా కఠోర శిక్షణ తీసుకున్న చిన్నారి ఫైర్‌ విత్‌ బ్లేడ్‌ లింబో స్కేటింగ్‌లో ప్రపంచ రికార్డు కైవసం చేసుకుంది. స్కేటింగ్‌లో  ఇప్పటి వరకు ఎవరూ చేయని విధంగా భవిష్యత్తులో వినూత్నంగా చేసి ఒలింపిక్స్‌లో పతకం  సాధించాలని చిన్నారి సాత్విక చెబుతోంది. 

మరిన్ని వార్తలు