Kovelakuntla Daddanala Village Story:100 ఏళ్ల క్రితం ఆ గ్రామం కాలగర్భంలోకి.. కానీ నేటికి అక్కడ..

18 Nov, 2021 19:51 IST|Sakshi

కాలగర్భంలో కలిసిన దద్దనాల ఆనవాళ్లు పదిలం

ఆనవాళ్లుగా మిగిలిన రచ్చబండ, మారెమ్మ దేవాలయం

 దద్దనాల ఆచారాలను కొనసాగిస్తున్న ఆ గ్రామ వంశస్తులు 

సాక్షి,కోవెలకుంట్ల(కర్నూలు): సరిగ్గా వందేళ్ల క్రితం గ్రామం కాలగర్భంలో కలిసి పోగా ఈ ప్రాంతంలో ఒక ఊరు ఉండేదనటానికి చిహ్నంగా కొన్ని ఆనవాళ్లు నేటికి పదిలంగా ఉన్నాయి. గ్రామానికి గుర్తుగా ఉన్న ఆనవాళ్లు ఆ గ్రామ చరిత్రకు అద్దం పడుతున్నాయి. కోవెలకుంట్ల మండలంలో 100 సంవత్సరాల క్రితం కనుమరుగైన దద్దనాల గ్రామంపై ఆ గ్రామంలో నివాసం ఉన్న వారి వంశస్తులు సమాచారం ఆధారంగా గ్రామానికి సంబంధించిన  ఆనవాళ్లు గ్రామ చరిత్రను తెలియజేస్తున్నాయి. 

కోవెలకుంట్ల మండలంలోని కలుగొట్లకు అర కి.మీ. దూరంలో 562 సర్వే నంబర్‌లో 40 సెంట్ల విస్తీర్ణంలో దద్దనాల అనే చిన్న గ్రామం ఉండేది.  గ్రామంలో 50 కుటుంబాలు జీవనం సాగించేవారు. గ్రామంలో ఒకే ఒక రెడ్డి కులానికి చెందిన కుటుంబం కాగా మిగిలిన వారిలో బోయ, గాండ్ల కులస్తులు అధికంగా ఉండేవారు.  గ్రామానికి ఉన్న 200 ఎకరాల భూముల్లో  గ్రామ శివారులో ప్రవహిస్తున్న కుందూనది ఆధారంగా వ్యవసాయం చేసుకుని జీవనం సాగించేవారు. ఆ కాలంలో పత్తి, రాయచూర్‌ రకానికి చెందిన జొన్న, వేరుశనగ తదితర పంటలు ప్రధానంగా పండించేవారు. గ్రామస్తులు దసరా, ఉగాది పండుగలను ఘనంగా జరుపుకునేవారని ప్రస్తుతం అక్కడ ఉన్న ఆనవాళ్ల ఆధారంగా తెలుస్తోంది. 

దొంగల బెడద, కుందూవరదలతో గ్రామం ఖాళీ:
దద్దనాల గ్రామానికి దొంగలబెడద అధికంగా ఉండటం, కుందూనదికి సంభవించే వరదల కారణంగా గ్రామం ఖాళీ అయినట్లు పూర్వీకుల చరిత్ర. గ్రామంలో కేవలం 50 కుటుంబాలు ఉండటంతో గ్రామంపై తరుచూ దొంగలు పడేవారు. అప్పట్లో  డబ్బులు, ఆభరణాలు పెద్దగా లేకపోయినా దొంగలు కడుపు నింపుకునేందుకు చిన్న గ్రామం కావడంతో అనేకసార్లు దొంగతనాలకు పాల్పడేవారు. రైతులు పండించిన ధాన్యం, బట్టలు, పొట్టేళ్లు, కుక్కలు, తదితర వస్తువులను అపహకరించుకుపోయేవారు. దొంగల బెడద కారణంగా గ్రామస్తులు రాత్రిళ్లు ఇళ్లపై తిరుగుతూ కేకలు వేస్తూ ప్రహారా కాసేవారు. దొంగలబెడదకు తోడు గ్రామ శివారులో ప్రవహిస్తున్న కుందూనది ఉప్పొంగి గ్రామాన్ని, పంట పొలాలను ముంచెత్తుతుండేది. గ్రామం ఖాళీ కావడంతో గ్రామానికి చెందిన పొలాన్ని కలుగొట్ల, ఉప్పలూరు గ్రామ రెవెన్యూ రికార్డుల్లో చేర్చారు. 

దద్దనాల ఆనవాళ్లుగా నిలిచిన రచ్చబండ, మారెమ్మ దేవాలయం:
వందేళ్ల క్రితం దద్దనాల గ్రామం కనుమరుగు కాగా గ్రామ ఆనవాళ్లుగా గ్రామంలో రచ్చబండ, మారెమ్మ దేవాలయం, పునాదిరాళ్లు, గోడలు నిలిచాయి. గ్రామస్తుల దాహార్తి తీర్చే బావి పూడిపోయి అక్కడ బావి ఉండేదన్న గుర్తుగా నిలిచింది. మారెమ్మ దేవాలయానికి జీర్ణోద్ధరణ పనులు చేపట్టారు. కలుగొట్ల, ఉప్పలూరు గ్రామాల్లో  ఇప్పటికీ దద్దనాల గ్రామంలో నివాసం ఉన్న వారి వంశస్తులు నివాసం ఉంటున్నారు. కలుగొట్లలో పాపిరెడ్డి, పెద్దకొండారెడ్డి, చిన్న కొండారెడ్డి, గోపాల్‌రెడ్డి వంశస్తులతోపాటు బోయ కులానికి చెందిన వారి వంశస్తులు, ఉప్పలూరు గ్రామంలో గాండ్ల కులానికి చెందిన చెన్నయ్య వంశస్తులు జీవనం సాగిస్తున్నారు. దద్దనాల గ్రామం ఉన్న ప్రాంతంలో గత ఏడాది కాశీనాయన ఆశ్రమం, శ్రీకృష్ణ దేవాలయం, శివాలయం నిర్మించారు. 

చదవండి: ఆపరేషన్‌ ‘డాన్‌’.. ఇక వారికి చుక్కలే

మరిన్ని వార్తలు