Nayanalappa Temple History: నయనాలప్ప క్షేత్రాన్ని చూసొద్దాం రండి..

4 Nov, 2021 19:31 IST|Sakshi

కోవెలకుంట్ల (కర్నూలు): కోరిన కోర్కెలు తీరుస్తూ ఓం కారేశ్వరుడు భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలిచారు. సహజసిద్ధ ఎర్రమల కొండల్లో వెలసిన  ప్రముఖ శైవ క్షేత్రమైన నయనాలప్ప క్షేత్రంలో ప్రతి ఏటా కార్తీక మాస సోమవారాన్ని  పురస్కరించుకుని ఉత్సవాలు, తిరుణాళ్లను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. కార్తీకమాసాన్ని పురస్కరించుకుని క్షేత్రంలో ఆదివారం నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 

నయనాలప్ప క్షేత్ర చరిత్ర: 
కర్నూలు జిల్లాలోని కోవెల కుంట్ల నుంచి జమ్మల మడుగుకు వెళ్లే రహదారిలో సంజామల మండలంలోని  అక్కంపల్లె సమీపంలో కొండలో వెలసిన నయనాలప్ప క్షేత్రానికి ప్రత్యేక చరిత్ర ఉంది.  సుమారు 400 సంవత్సరాల క్రితం కర్ణాటక రాష్ట్రానికి చెందిన చెన్నబసప్ప అనే శివభక్తుడు ఈప్రాంతాన్ని సందర్శించి ఇక్కడ ప్రకృతి సౌందర్యము, కొండగుహలను చూసి ముగ్దుడై కుటుంబసమేతంగా వచ్చి ఈ ప్రాంతంలో తపస్సు చేసుకుంటూ  స్థిరపడ్డాడు.

ఒకరోజు రాత్రి నిద్రిస్తుండగా ఓం అను ప్రణవ శబ్ధం వినబడటంతో లేచి ఆ శబ్ధం ఈశ్వరతత్వమని గ్రహించి శివున్ని ధ్యానించి ఇక్కడ శివాలయం నిర్మించ కోరిక కలదని భార్య శివాంబతో చెప్పారు. ఆలయ నిర్మాణం ఖర్చుతో కూడుకున్నదని ఆలోచన విరమించుకోవాలని భార్య చెప్పగా ప్రశాంత వాతావరణంలో ఆలయం నిర్మించడం వల్ల శివభక్తులను ఉపయోగకరంగా ఉంటుందని శివాలయాన్ని నిర్మించ తలపెట్టారు.

శివాలయ నిర్మాణంపై ఏమాత్రం దిగులు చెందాల్సిన అవసరం లేదని, పక్కనే ఉన్న అక్కంపల్లె గ్రామస్తులు మహా భక్తులని, వారిని ఆశ్రయించిన దేవాలయ నిర్మాణం సులభతరమవుతుందని ఓంకారేశ్వరునిగా  ఆలయంలో ప్రతిష్టించాలని ఒక రోజు రాత్రి శివుడు కలలో కన్పించి చెప్పడంతో ఈ విషయాన్ని భార్యకు తెలియజేశారు.  

శివుడు చెప్పినట్లు చేయాలని భార్య సలహా ఇవ్వడంతో చెన్నబసప్పా అక్కంపల్లె చేరుకుని  శివుడు కలలో ఆజ్ఞాపించిన విషయాన్ని గ్రామస్తులకు వివరించగా వారు దేవాలయ నిర్మాణానికి చేయూత నిస్తామని చెప్పడంతో ఆలయ నిర్మాణానికి  శ్రీకారం చుట్టారు. బసప్పా తన దగ్గర ఉన్న ఎద్దులసాయంతో రాళ్లను పైకి చేర్చి ముందుగా తాను పూజిస్తున్న గర్భగుడికి సరిగా కింద భూమిలో నేలగుహ అను పేరుతో పై ఆలయములోకి వచ్చునట్లుగా సోపానములను అమర్చారు. 

శివ మహిమతో నేల గుహ ఇప్పటికి ఎయిర్‌ కండీషన్‌ గదిలా ఉంది.  రాత్రి సమయాల్లో శివ మహిమతో రాళ్లు పైకి చేరుతుండటమేకాక, పగలు నిర్మించిన కట్టడాలు సరిగా లేని పక్షంలో చక్కగా సరిదిద్దబడేవని చరిత్ర. ఒక రోజురాత్రి నిద్రిస్తున్న సమయంలో శివాంబ శివాలయ ప్రాంతంలో అలికిడి విని లేచి చూడగా పరమేశ్వరుడు శివగణంబులతో శివాలయ నిర్మాణ విశేషములను తిలకించి వాటికి కావాల్సిన సద్దుబాట్లు చేయించుకున్న దృశ్యాలను చూసి నిశ్చేష్ఠురాలైంది.  

ఈ విషయాన్ని భర్తను లేపగా శివుడు అదృశ్యమయ్యాడు. శివుని ప్రత్యక్షంకోసం పర్వతం కింద కఠోర తపస్సు చేయగా తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షం కాకుండా  అదృశ్యవాణితో బసప్పను  దీక్ష విరమించి భార్య, కుమారుడు సుజాతప్పను కలుసుకోవాలని,  త్వరలో ఆలయ నిర్మాణం పూర్తి చేసి ఓంకారేశ్వరునిగా తనను ప్రతిష్ఠింపచేసి కాశీ క్షేత్రానికి వెళ్లి అక్కడి నుంచి కాశీ జలాన్ని తెచ్చి అభిషేకించాలని, అప్పుడు దర్శనభాగ్యం కలుగునని పలికెను. దీక్షను విరమించి ఇంటికి చేరుకున్న బసప్ప కాశీ విషయాన్ని భార్యకు చెప్పి మునీశ్వరుల వెంట కాశీకి బయలు దేరాడు. 

భర్త వెళ్లే సమయానికి శివాంబ రెండు నెలల గర్బవతి. భర్త కాశీకి వెళ్లడంతో ఆమె ప్రతి రోజు పరమేశ్వరుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించేది. ఆవుపాలు, నెయ్యితో వీబూది ముద్దలుగా చేసి గదిలో భద్రపరిచేది. శివాంబకు అచ్చం తన పోలికలతో కూడిన  కుమార్తె జన్మించడంతో శరణమ్మనామకరణం చేసి 16 సంవత్సరాల పాటు కఠోరంగా శివున్ని ప్రార్థించింది. ఒక రోజు శివాంబ బిక్షాటనకై అక్కంపల్లె గ్రామానికి వెళ్లగా ఆ సమయంలో కాశీ నుంచి బసప్ప ఇంటికి చేరుకున్నాడు. 

ఆయన రాకను చూసిన మునులు మీ తండ్రి కాశీ క్షేత్రం నుంచి వచ్చాడని చెప్పడంతో శరణమ్మ కలశంతో నీటిని తెచ్చి తండ్రి పాదములు కడుగుటకు ఎదురుగా వచ్చింది. బపస్ప కాశీ క్షేత్రానికి వెళ్లే సమయానికి భార్య గర్భవతని, తనకు కుమార్తె పుట్టిన విషయం తెలియకపోవడంతో బసప్ప కలశంతో నీళ్లు తెచ్చిన శరణమ్మ తన భార్యగా భావించి ముసలితనంలో ప్రాయం వచ్చనా అన్న మాటలు అనడంతో వెంటనే తండ్రి మనోభావాన్ని గ్రహించిన కుమార్తె తండ్రి వద్దకు వెళ్లి నేను నీ కుమార్తెనని తెలిపింది.

దీంతో బసప్ప కుమార్తెను అక్కున చేర్చుకుని తాను పొరబడ్డానని బాధించి ఓంకారేశ్వరుని సన్నిధికి చేరుకుని నయనములు కల్గి ఉండుటవల్లే ఈ తప్పిదం జరిగిందని, ఈ నయనములు ఉండటానికి వీల్లేంటూ రెండు కళ్లూ పీకి శివసన్నిధిని ఉంచారు. 

భార్య, పిల్లలు ఎంత చెప్పినప్పటికీ వినకుండా అంధత్వ జీవితం భరించుట సాధ్యం కాదని, జీవసమాధి అయ్యారు. కొంతకాలానికి ఎద్దులు కూడా మృతి చెందటంతో బసప్ప పక్కనే వాటిని సమాధి చేశారు.  జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాలైన శ్రీశైలం, మహానంది తర్వాత అంతటి ప్రాధాన్యత నయనాలప్ప క్షేత్రానికే ఉంది. ఓంకారేశ్వర ఆలయంలో బసప్ప పూజలు నిర్వహించిన నేలగుహ ఇప్పటికి చెక్కు చెదరలేదు.

నేలగుహలో ప్రతిష్టించిన శివలింగానికి బసప్ప పూజలు చేసేవారు.  శివమహిమతో ఉన్న ఈ గుహను అలాగే ఉంచి దానిపై ఆలయాన్ని నిర్మించడం విశేషం. ప్రస్తుతం ఆలయం ఉన్న గర్భగుడిలో నేలగుహ ఎయిర్‌కండీషన్‌ గదిని పోలి ఉంది. ఇది నయనాలప్ప క్షేత్రంలో ఉన్న ప్రత్యేకత.

ఓంకారేశ్వర క్షేత్రంలో కార్తీక కడసోమవార ఉత్సవాలు:
ప్రతిఏటా కార్తీక మాసంలో ఓంకారేశ్వరస్వామి క్షేత్రంలో  ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కార్తీకమాస కడ సోమవారాన్ని పురస్కరించుకుని  క్షేత్రంలో మూడు రోజులపాటు తిరుణాల ఉత్సవాలు జరగడం ఆనవాయితీగా వస్తోంది.  ఈ ఏడాది శుక్రవారం నుంచి కార్తీక మాసం ప్రారంభం కానుండగా కడ సోమవారాన్ని పురస్కరించుకుని క్షేత్రంలో పార్వతీ పరమేశ్వరుల కల్యాణోత్సవం, ధ్వజరారోహణ నిర్వహిస్తారు .

అదేవిధంగా.. స్వామివార్ల గ్రామోత్సవం, కోలాటాలు, హరిభజనలు, భక్తిరసపూరిత కార్యక్రమాలు, హరికథా కాలక్షేపం, నాటకాలు, తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉత్సవాలను తిలకించేందుకు జిల్లా నుంచేకాక కడప, అనంతపురం జిల్లాల నుంచి వేలాదిగా  భక్తులు క్షేత్రాన్ని చేరుకుని ఓంకారేశ్వరస్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు.

నయనాలప్ప క్షేత్రానికి ఇలా  చేరుకోవాలి:
కర్నూలు జిల్లా కేంద్రం నుంచి బేతంచెర్ల, బన గానపల్లె, కోవెలకుంట్ల, మాయలూరు మీదుగా సంజామల మండలం అక్కంపల్లె గ్రామ శివారు నుంచి నయనాలప్ప క్షేత్రానికి చేరుకోవచ్చు. నంద్యాల నుంచి గోస్పాడు, కోవెలకుంట్ల మీదుగా, ఆళ్లగడ్డ నుంచి పెద్దముడియం మీదుగా, వైఎస్‌ఆర్‌ జిల్లా నుంచి భక్తులు జమ్మలమడుగు, ఉప్పలపాడు, నొస్సం మీదుగా నయనాలప్ప క్షేత్రానికి చేరుకోవచ్చు. 
 

మరిన్ని వార్తలు