అక్కడ సినిమా తీస్తే.. బంపర్‌ హిట్టే..

17 Oct, 2021 08:23 IST|Sakshi

కోడూరుపాడు, గూడాల గ్రామాలకు నిర్మాతల క్యూ

ఇక్కడ తీసిన ఎన్నో చిత్రాలు విజయవంతం

ఈ పల్లెల అందాలకు మంత్ర ముగ్ధులవుతున్న నటీనటులు

వేకువనే నిదుర లేపుతున్న పక్షుల కిలకిల రావాలు.. మంచుపరదాల ముసుగుల్లో మసక కాంతులు.. తల్లి పాల కోసం లేగ దూడల అరుపులు.. పచ్చని పంట పొలాలు.. కొబ్బరి తోటలు.. కార్మికుల శ్రమ జీవన సౌందర్యం.. బంధాలను పెనవేసుకున్న మండువా లోగిళ్లు.. హృదయాన్ని హత్తుకుని ఊయలలూపే ఇటువంటి సౌందర్యాన్ని చూడాలంటే పల్లెల్లోకి.. అందునా కోనసీమ పల్లెల్లోకి అడుగు పెట్టాల్సిందే. ఎంతటి వారైనా అక్కడ అడుగు పెట్టగానే బాహ్య ప్రపంచాన్ని మరచిపోవాల్సిందే.. ఆ పల్లె వాతావరణానికి మంత్రముగ్ధులవ్వాల్సిందే. అల్లవరం మండలంలోని కోడూరుపాడు, గూడాల అటువంటి పల్లెలే.


 గూడాలలో పోలిశెట్టి భాస్కరరావు మండువా లోగిలి ముందు శతమానంభవతి చిత్రం తారాగణం

సాక్షి, అల్లవరం (తూర్పుగోదావరి): కోడూరుపాడు, గూడాల గ్రామాలకు.. తెలుగు సినీ రంగానికి అవినాభావ సంబంధం ఉంది. 1962 నుంచి అనేక సినిమాలు ఈ రెండు గ్రామాల నుంచి తెరకెక్కాయి. ఇక్కడ తీసిన సినిమాలు బంపర్‌ హిట్టు అవుతాయనే సెంటిమెంట్‌ బలంగా ఉంది. కోడూరుపాడు, గూడాల గ్రామాల్లో కనీసం ఒక్క సన్నివేశమైనా చిత్రీకరించాలని నిర్మాతలు, హీరోలు కోరుకుంటారు. ఎన్‌టీఆర్, శోభన్‌బాబు, బాలకృష్ణ, రాజశేఖర్, శర్వానంద్, ప్రకాష్‌రాజ్, తనికెళ్ల భరణి, శ్రీహరి, నాని, విజయశాంతి, జయసుధ, జీవిత, హేమ వంటి హేమాహేమీలు ఇక్కడ తీసిన అనేక చిత్రాల్లో నటించారు. టాలీవుడ్‌నే కాకుండా బాలీవుడ్‌ హీరోలను కూడా ఈ రెండు గ్రామాలు ఆకర్షించాయి. జీవనజ్యోతి, భానుమతి గారి మొగుడు, శివయ్య, శతమానంభవతి, అష్టాచమ్మా, శ్రీనివాస కళ్యాణం వంటి చిత్రాల్లో అనేక సన్నివేశాలు ఇక్కడే చిత్రీకరించారు. బాలీవుడ్‌ అగ్రహీరో ఆమిర్‌ఖాన్‌ తీస్తున్న లాల్‌సింగ్‌ చద్దా సినిమాలోని పలు సన్నివేశాలను ఇటీవల కోడూరుపాడులో చిత్రీకరించారు. దీంతో ఈ గ్రామాల ఖ్యాతి మరింత పెరిగింది. 

లాల్‌సింగ్‌ చద్దా చిత్రం షూటింగ్‌ కోసం కోడూరుపాడులో సందడి చేసిన బాలీవుడ్‌ అగ్రహీరో ఆమిర్‌ఖాన్‌ 

గూడాలలో ఎకరం విస్తీర్ణంలో వందేళ్ల క్రితం నిర్మించిన పోలిశెట్టి భాస్కరరావుకు చెందిన మండువా లోగిలిలో 2009లో తొలిసారిగా అష్టాచమ్మా సినిమా తీశారు. ఈ సినిమా నుంచే తెలుగు సినిమా రంగానికి నాని, అవసరాల శ్రీనివాస్‌ హీరోలుగా పరిచయమయ్యారు. బాలీవుడ్‌ నిర్మాత నితిన్‌ తివారీ బిల్డింగ్‌ బ్లాక్‌ గ్రూప్‌ యాడ్‌ ఇక్కడే తీశారు. నాలుగు స్తంభాలాట సీరియల్‌ ఇక్కడే చిత్రీకరించారు. శర్వానంద్‌ హీరోగా ఇక్కడి మండువా లోగిళ్లలో పల్లె వాతావరణంలో తీసిన శతమానం భవతి చిత్రం ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరించిందో అందరికీ తెలిసిందే. నితిన్‌ హీరోగా కోడూరుపాడులో తీసిన శ్రీనివాస కళ్యాణం సినిమా కూడా సక్సెస్‌ సాధించింది. ప్రముఖ దర్శకులు ఇంద్రగంటి మోహన్‌కృష్ణ, వేగేశ్న సతీష్‌తో పాటు దిల్‌రాజు వంటి అగ్ర నిర్మాతలు ఈ గ్రామాల్లో సినిమా తీయడం సెంటిమెంట్‌గా భావిస్తున్నారని పోలిశెట్టి భాస్కరరావు తెలిపారు.

అష్టాచమ్మా సినిమా : కోడూరుపాడులోని
పెంకుటిశాల వద్ద హీరో నాని

 

Read latest Ap-special News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు