కడపలో ప్రాచీన చరిత్ర ఆనవాళ్లు... బృహత్‌ శిలాయుగం నాటి..

8 Oct, 2021 16:10 IST|Sakshi

ప్రాచీన చరిత్రకు ఆనవాళ్లు...బృహత్‌ శిలాయుగపు సమాధులు

మూడు వేల సంవత్సరాల నాటివి

రాష్ట్రంలోనే పెద్ద మెగా లిథిక్‌ సైట్‌

వైఎస్సార్‌ జిల్లా (కడప సెవెన్‌రోడ్స్‌): జిల్లాకు ఎంతో ప్రాచీన చరిత్ర, సంస్కృతి ఉంది. సుండుపల్లె మండలం దేవావాండ్లపల్లె సమీపాన ఉన్న బృహత్‌ శిలాయుగపు సమాధులే ఇందుకు నిదర్శనం. ఆ గ్రామానికి ఉత్తరాన మూడు కిలోమీటర్ల దూరాన శేషాచల కొండల్లో బృహత్‌ శిలాయుగపు సమాధులు ఉన్నాయి. ఇవి మూడు వేల సంవత్సరాల క్రితం నాటి మనుషుల సమాధులు. దేశంలో ఇనుము వాడకం ప్రారంభమైన కాలానికి సంబంధించినవి. ఈ కాలాన్ని ఇనుపయుగం లేదా బృహత్‌ శిలాయుగం అంటారు. 

ఆ కాలంలో ఎవరైనా మరణిస్తే ప్రత్యేక పద్దతుల్లో పెద్దపెద్ద బండరాళ్లను ఉపయోగించి సమాధులు నిర్మించేవారు. సమాధుల్లో డాల్‌మెన్స్, స్టోన్‌ సర్కిల్స్, మెన్‌ హిర్స్, సిస్ట్‌ బరియల్స్, డాల్‌మెనాయిడ్‌ సిస్ట్స్‌ తదితదర రకాలు ఉంటాయి. దేవావాండ్లపల్లె వద్ద శేషాచల అడవుల్లో డాల్‌మెన్స్‌ రకానికి చెందిన సమాధులు ఉన్నాయి. ఆర్కియన్‌ యుగపు గ్రానైట్‌ రాయిని వీటి నిర్మాణానికి ఉపయోగించారు. ఈ సమాధుల్లో మనిషి శవంతోపాటు ఇనుప పరికరాలు కూడా పూడ్చి పెడతారు. అప్పట్లో బ్లాక్‌ అండ్‌ రెడ్‌ వేర్‌ మట్టి పాత్రలను వినియోగించేవారు. చనిపోయిన వ్యక్తికి సమాధుల్లో ఆహారం వంటివి అవసరమవుతాయన్న మూఢ విశ్వాసంతో  ఈ మట్టిపాత్రలను కూడా వేసి పూడ్చేవారు. ఈ సమాధుల వద్ద నేటికీ కొన్ని మట్టి పెంకులను మనం చూడవచ్చు.

డాల్‌మెన్స్‌ సమాధుల లోపలి భాగంలో బండలపై తెలుపు రంగులో ఏనుగు, ఏనుగుపై సవారి చేస్తున్న మనిషి, తాబేళ్లు, డైనోసార్స్‌ను పోలిన రేఖాచిత్రాలు ఉన్నాయి. ఆనాటి మనుషులు వీటిని చిత్రించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. వీటిని ఆనుకుని ఉన్న మరో గుట్టపై డాల్‌మెన్స్‌ ఎన్‌ సర్కిల్డ్‌ విత్‌ శ్లాబ్స్‌ ఉన్నాయి. తామరపుష్పం ఆకారంలో ఈ సమాధుల చుట్టూ పెద్దపెద్ద బండరాళ్లు పాతారు. గుప్తనిధుల కోసం కొందరు దుండగులు చాలా సమాధులను పగులగొట్టారు. ఎముకలు, కుండ పెంకులు తప్ప అక్కడ ఏమి లభించవని వారికి తెలియకపోవడం వల్లనే సమాధులు పగులగొట్టి ఉంటారు.

ప్రస్తుతం మిగిలినవి, పగుల గొట్టడబడినవి అన్నీ కలిపి 50 సమాధులు ఉన్నాయి. సుమారు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఇవి కనిపిస్తాయి. ఇలాంటి సంస్కృతి దక్షిణ భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈశాన్య భారతంలో కూడా కొంత ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తర భారతదేశంలో మాత్రం ఇలాంటి సమాధుల సంస్కృతి లేదు. ఆంధ్రప్రదేశ్‌లో మెగా లిథిక్‌  సైట్స్‌ ఎక్కువగా రాయలసీమలోనే ఉన్నాయి. అందులో కడపజిల్లాలోనే అధికభాగం ఉన్నట్లు చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు. జిల్లాలో ఉన్న మెగా లిథిక్‌ సైట్స్‌లో దేవావాండ్లపల్లె వద్ద ఉన్నవే పెద్దవి కావడం విశేషం.

వీటిలో పాండవులు నివసించారని, కడప, చిత్తూరు జిల్లా ప్రజల విశ్వాసం. కనుక వీటిని ఈ జిల్లాల్లో పాండవ గుళ్లుగా పిలుస్తారు. దేవావాండ్లపల్లె ప్రజలు పాండురాజు గుళ్లు అంటారు. ఇలాంటి సమాధుల్లో రాక్షసులు నివసించారని భావించే కర్నూలు, ప్రకాశం జిల్లాల ప్రజలు వీటిని రాక్షస గుండ్లు అని పిలుస్తారు. దేవావాండ్లపల్లెలోనే కాకుండా జిల్లాలో ఇతర చోట్ల కూడా అక్కడక్కడ ఇలాంటి సమాధులు మనకు కనిపిస్తాయి.

టూరిస్ట్‌ హబ్‌గా మార్చాలి
దేవావాండ్లపల్లె సమీపంలో ఉన్న బృహత్‌ శిలాయుగపు సమాధుల ప్రాంతాన్ని టూరిస్టు హబ్‌గా అభివృద్ది చేయాల్సిన అవసరం ఉంది. సమాధులు ఉన్న ప్రాంతానికి పర్యాటకులు, చరిత్ర పరిశోధకులు సులభంగా చేరుకోవడానికి వీలుగా రహదారి సౌకర్యం కల్పించాలి. సైట్‌ చుట్టూ రక్షణ కంచె, వివరాలు తెలిపే బోర్డులను ఏర్పాటు చేస్తే పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది.
– కొండూరు జనార్దన్‌రాజు, కార్యదర్శి, రాయలసీమ టూరిజం అండ్‌ కల్చరల్‌ సొసైటీ, కడప

చదవండి: Sirimiri Nutrition Food: ఓ ఇల్లాలి వినూత్న ఆలోచన.. కట్‌చేస్తే.. కోట్లలో లాభం!

మరిన్ని వార్తలు