ప్రపంచ వ్యాప్తంగా రేనాటి ఖ్యాతి చాటిన ‘సూర్యచంద్రులు’

20 Oct, 2021 12:45 IST|Sakshi

తెల్లదొరలను గడగడలాడించిన విప్లవ వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

దేశానికి వన్నెతెచ్చిన అపర దానకర్ణుడు బుడ్డావెంగళరెడ్డి

కోవెలకుంట్ల(కర్నూలు జిల్లా): కోవెలకుంట్లకు చెందిన ఇద్దరు మహనీయులు శతాబ్ధం క్రితమే రేనాడు ప్రాంతఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారు. బ్రిటీష్‌ నిరంకుశత్వ పాలనపై తిరుగుబాటు బావుట ఎగరవేసిన విప్లవ వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, అడిగిన వారికి లేదనకుండా దానధర్మాలు చేసి అప్పటి ఇంగ్లాండ్‌ మహారాణితో సత్కరించబడి దానకర్ణుడిగా పేరొందిన బుడ్డా వెంగళరెడ్డి రేనాటి సూర్యచంద్రులుగా వెలుగొందుతున్నారు. నరసింహారెడ్డి వీరమరణం పొంది 174 సంవత్సరాలు, వెంగళరెడ్డి మరణించి 121 సంవత్సరాలు గడిచినా ఇప్పటికి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.

తెల్లదొరల పాలిట సింహస్వప్నమైన నరసింహారెడ్డి:
కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన సీతమ్మ, పెద్దమల్లారెడ్డి దంపతుల కుమారుడు నరసింహారెడ్డి. హైదరాబాద్‌ నవాబులు రాయలసీమ జిల్లాలైనా కర్నూలు, కడప, అనంతపురం, బళ్లారిని దత్తత మండలాలుగా ప్రకటించి బ్రిటీష్‌వారికి దారాదత్తం చేశారు. నొస్సం ప్రధాన కేంద్రంగా బ్రిటీష్‌ పాలన  కొనసాగేది. బ్రిటీష్‌ ప్రభుత్వం నరసింహారెడ్డి తాత జయరామిరెడ్డికి పన్నులు, భూమిశిస్తూ వసూలు చేసే అధికారం అప్పగించారు. ఆయన మరణానంతరం వారసత్వంగా ఈ బాధ్యత నరసింహారెడ్డికి వర్తించింది. 

బ్రిటీష్‌పాలన నిరంకుశత్వపాలనను ప్రతిఘటించి 1842వ సంవత్సరంలోనే మొట్టమొదటి విప్లవవీరునిగా తిరుగుబాటుకు విప్లవశంఖం పూరించారు. 1846 వ సంవత్సరంలో కోవెలకుంట్ల పట్టణంలోని బ్రిటీష్‌ ట్రెజరీపై దాడి చేసి  805 రూపాయల 10 అణాల నాలుగుపైసలను కొల్లగొట్టారు. నరసింహారెడ్డి తిరుగుబాటుకు బ్రిటీష్‌ సామ్రాజ్యం గజగజ వణికిపోయింది. తన పోరాటంలో కోవెలకుంట్ల తహశీల్దార్‌ను నరికిచంపడమేకాక బ్రిటీష్‌వారి ఖజానాను కొల్లగొట్టారు. 

తెల్లదొరలపాలిట సింహ స్వప్నంగా మారటంతో నరసింహారెడ్డిని  పట్టించిన వారికి 10వేల దినారాలు బహుమతి అందజేస్తామని బ్రిటీష్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఎట్టకేలకు 1847 సంవత్సరంలో సంజామల మండలం జగన్నాథగుట్టపై నరసింహారెడ్డిని ప్రాణాలతో పట్టుకుని బందిపోటు దొంగగా ముద్రవేసి 1847 ఫిబ్రవరి 22వతేదీ కోవెలకుంట్ల పట్టణ సమీపంలోగల జుర్రేరు ఒడ్డున ఉరిశిక్ష అమలుపరిచారు. అయితే నరసింహారెడ్డి మరణించిన వంద సంవత్సరాలకు దేశానికి స్వాతంత్య్రం సిద్ధించింది. 

నాటి నుంచి భారతీయులు ఆయనను రేనాటి సూర్యుడిగా పిలుస్తున్నారు.  ఇప్పటికీ కూడా రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్లలో నరసింహారెడ్డి పేరుపై సైరా నరసింహారెడ్డి.. నీపేరే బంగారు కడ్డీ అన్న జానపద గేయాలు వినిపిస్తుండటం అలనాటి వీరత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. ప్రతి ఏటా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతిని ఆయన వంశస్తులు, రేనాటి సూర్యచంద్రుల స్మారక సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. విప్లవ సింహం నరసింహారెడ్డి జీవిత చరిత్రను వెండితెరపైకి ఎక్కించారు. చిరంజీవి కథానాయకుడిగా 2019వ సంవత్సరంలో సైరా నరసింహారెడ్డి పేరుతో చలనచిత్రం విడుదలైంది.  

రేనాటి చంద్రుడు బుడ్డా వెంగళరెడ్డి:
భారతదేశంలోని రేనాటిగడ్డలో పాలెగాళ్లేకాదు దానకర్ణులూ ఉన్నారంటూ ఉయ్యాలవాడ బుడ్డా వెంగళరెడ్డి మానవత్వాన్ని, దాతృత్వాన్ని ప్రపంచానికి చాటారు. ఉయ్యాలవాడ గ్రామంలో 1822 సంవత్సరం రైతు కుటుంబంలో నల్లపురెడ్డి, వెంకటమ్మ దంపతులకు జన్మించిన బుడ్డా వెంగళరెడ్డి  చిన్ననాటి నుంచి దానధర్మాలు చేస్తూ దానకర్ణుడిగా వెలుగొందారు. 1860 సంవత్సరంలో రాయలసీమలో కనీవినీ ఎరగని రీతిలో డొక్కల కరువు సంభవించింది. అప్పట్లో పేదలు ఆకలిమంటలు తట్టుకోలేక సాటిమనసుల డొక్కలు చీల్చి వారి పేగుళ్లలోని ఆహారాన్ని తినేంతటి కరువని చరిత్ర పేర్కొంది.  

కరువును తట్టుకోలేక ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలి పోయారు. బ్రిటీష్‌ ప్రభుత్వం అక్కడక్కడా గంజికేంద్రాలు ఏర్పాటు చేసినా ప్రయోజనం లేకుండాపోయింది. కరువు బీభత్సాన్ని గమనించిన బుడ్డా వెంగళరెడ్డి గంజికేంద్రాలను ప్రారంభించి తన వద్ద ఉన్న ధాన్యంతో మూడు సంవత్సరాలపాటు అన్నదానం చేశారు. కర్నూలు జిల్లా ప్రాంత వాసులకేకాక బళ్లారి, చిత్తూరు, కడప ప్రాంతాల నుంచి ప్రజలు ఈ ప్రాంతానికి వలస వచ్చి ప్రతి రోజూ సుమారు 10వేల మందికి పైగా ఉయ్యాలవాడలో ఆయన ఇంటి వద్దనే భోజనం చేసేవారు. బుడ్డా వెంగళరెడ్డి దానగుణం తెలుసుకున్న ఇంగ్లాండ్‌ విక్టోరియా మహారాణి ఢిల్లీ రాజప్రతినిధుల సభలో ఆయనకు బంగారు పతకాన్ని, ప్రశంసాపత్రాన్ని ఇచ్చి ఘనంగా సన్మానించారు. 

1900 సంవత్సరం డిసెంబర్‌ 31న బుడ్డా వెంగళరెడ్డి మృతిచెందారు. కడప–కర్నూలు కాల్వకు, ఉయ్యాలవాడ – రూపనగుడి గ్రామాల మధ్య కుందూనదిపై నిర్మించిన వంతెనకు ఈయన పేరు పెట్టారు. విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇచ్చేందుకు నంద్యాల ఎస్‌బీఐ బ్యాంకులో బుడ్డా వెంగళరెడ్డి పేరున ఒక విద్యానిధిని ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం వర్ధంతి రోజు, ఉగాది పండుగ రోజున బుడ్డా వంశుస్థులు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి, విక్టోరియా మహారాణి బహుకరించిన బంగారు పతకాన్ని ప్రజల సందర్శనార్థం ఆయన సమాధిపై ఉంచుతున్నారు. ఇప్పటి కూడా యాచకులు బస్టాండుల్లో, రైల్వేస్టేషన్లలో ఉత్తరాధి ఉయ్యాలవాడలో ఉన్నది ధర్మం చూడరయా, ధర్మ ప్రభువు బుడ్డా వెంగళరెడ్డి అంటూ జానపద గీతాలు ఆలపిస్తూనే ఉన్నారు.

మరిన్ని వార్తలు