రాయచోటి రాక్‌ గార్డెన్స్‌.. శిలల సొగసు చూడతరమా!

7 Oct, 2021 12:27 IST|Sakshi

వైఎస్సార్‌ జిల్లా: రాయచోటి ప్రాంతంలోని కొండల్లో వివిధ ఆకృతులతో ఏర్పడిన శిలలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పెద్ద రాతి గుండుపై మరో గుండు, దానిపై ఇంకొకటి...ఇలా ఎవరో పేర్చినట్లు ఉంటాయి. కొన్ని శిలలు అడుగు భాగాన కొద్దిపాటి ఆధారంతో నిలుచుని ఎప్పుడూ పడిపోతాయో అన్నట్లు ఉంటాయి. లక్కిరెడ్డిపల్లె మండలం గంధం వాండ్లపల్లె సమీపాన ఉన్న కొండపై అచ్చం ఓ మనిషి మద్దెల వాయిస్తున్నట్లుగా ఉన్న ఓ రాయి విశేషంగా ఆకట్టుకుంటోంది. స్థానిక ప్రజలు దీన్ని బొమ్మ కొండ లేదా మద్దెల కొండ అని పిలుస్తారు. ఇక్కడికి సమీపంలోనే మరో కొండలోని ఓ రాయి వెలిగించిన కొవ్వొత్తి రూపంలో ఉంది.

కడప నుంచి రాయచోటికి వెళ్లే మార్గంలో గువ్వల చెరువు దాటాక వచ్చే మేదరపల్లె వద్దనున్న చెరువులో ఉన్న రాయి ప్రత్యేక ఆకర్షణగా  చెప్పవచ్చు. పాలకడలిలో శేష తల్పాన్ని పోలినట్లు ఈ రాయి కనబడుతుంది. శిలలు వివిధ ఆకృతుల్లో ఏర్పడటానికి గల శాస్త్రీయ కారణాలు తెలియని ప్రజలు ఒక్కొ రాయి చుట్టూ ఒక్కొ కథను అల్లారు. అవే నేటికీ ప్రచారంలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో ప్రతి గుట్టకు, ప్రతి రాయికి ఏదో ఒక కథ ప్రచారంలో ఉంది.

రాయచోటి రాక్‌ గార్డెన్స్‌ వెనుక ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉంది. జియాలజిస్టులు చెబుతున్న ప్రకారం లావా చల్లబడుతూ వచ్చిన క్రమంలో ఇలాంటి కొండలు, గుట్టలు ఏర్పడ్డాయి. టెంపరేచర్, ప్రెషర్‌ను బట్టి రకరకాల రూపాలు ఏర్పడ్డాయి. రాయచోటి ప్రాంతంలోని శిలలు ఇగ్నస్‌ రాక్స్‌ లేదా మాగ్నాటిక్‌ రాక్స్‌ అంటారు. ఆర్కియన్‌ యుగంలో ఇవి ఏర్పడ్డాయి. కొన్ని లక్షల సంవత్సరాలు గాలి, వాన, నీరు రాపిడి వల్ల శిలలు వివిధ ఆకృతులను సంతరించుకున్నాయి. అడుగు భాగాన చిన్నపాటి ఆధారంతో ఎప్పుడు మీద పడుతాయో అన్నట్లుగా ఉండే శిలలను టార్స్‌ అని పిలుస్తారు.

గ్రానైట్‌లో ఉండే సిలికా కంటెంట్‌ సాలిడ్‌ అయ్యి గువ్వల చెరువు ప్రాంతంలో క్వార్ట్‌జైట్స్‌ ఏర్పడ్డాయి. రాయచోటి ›ప్రాంతంలోని రాక్‌ గార్డెన్స్‌ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయనడంలో సందేహం లేదు. అయితే ఇటీవల స్టోన్‌ క్రషింగ్‌ యజమానులు ఇష్టమొచ్చిన రీతిలో కొండలను ధ్వంసం చేస్తున్నారు. చాలాచోట్ల అక్రమ మైనింగ్‌ జరుగుతోంది. ఇందువల్ల అందమైన శిలలు క్రమేపీ ధ్వంసం కావడం ప్రకృతి ప్రేమికులను ఆందోళన పరుస్తోంది. అరుదైన శిలలను కాపాడి భావి తరాలకు అందించాల్సిన అవసరముందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు