దక్షిణ కాశీగా పేరు.. కన్నడిగులతో కిక్కిరిస్తున్న కోవెల

9 Oct, 2021 17:06 IST|Sakshi

దక్షిణ కాశీగా వెలుగొందుతున్న వీరభద్రాలయం

కన్నడిగులతో కిక్కిరిస్తున్న కోవెల

చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి కృషితో శరవేగంగా వీరభద్రాలయ అభివృద్ధి

వైఎస్‌ఆర్‌ జిల్లా(సంబేపల్లె):  దక్షిణ కాశీగా పేరొందిన శ్రీ వీరభద్రస్వామి రాచవీడు రేడుగా విరాజిల్లుతున్నారు. వివరాల్లోకి వెళితే.. వైఎస్‌ఆర్‌ జిల్లా రాయచోటి పట్టణ నడిబొడ్డున 11వ శతాబ్దంలో శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రాలయం నెలకొని దినదినాభివృద్ధి చెందుతోంది. 8వ శతాబ్దపు రాజరాజచోళుడు, 11వ శతాబ్దపు కాకతీయ గణపతిదేవుడు, శ్రీకృష్ణదేవరాయలు ఈ క్షేత్ర అభివృద్ధికి బాటలు వేసినట్లు శాసనాలు చెబుతున్నాయి. వీరభద్రస్వామి వీరశైవులకు ఇలవేల్పుగా వెలుగొందుతున్నారు. ఈ ఆలయంలో ప్రతి యేటా మాఘమాస బహుళ ఏకాదశి నుంచి స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.

ఈ ఉత్సవాలను తిలకించడానికి స్థానిక భక్తులతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల నుంచి లక్షలాది మంది భక్తులు ప్రతి ఏటా వస్తుంటారు. బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టాలైన అగ్నిగుండప్రవేశం, మహానైవేద్యం, రథోత్సవం కార్యక్రమాలు కీలకం. అంతేకాకుండా ప్రతి అమావాస్య నాడు కర్ణాటక భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటుంటారు. 1980లో దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అప్పుడు మంత్రిగా ఉన్న సమయంలో కొన్ని అభివృద్ధి పనులను చేపట్టారు.

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి చొరవతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వీరభద్రాలయానికి పశ్చిమాన రాజగోపురం నిర్మాణంతో పాటు సాలహారం నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.58 కోట్లను మంజూరు చేయించగా మరో రూ.38 లక్షలతో విమాన గోపురం, గర్భాలయ అభివృద్ధి పనులను చేపట్టారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే భక్తుల రాకను దృష్టిలో ఉంచుకున్న వీరభద్రాలయ అధికారులు ప్రత్యేక గదులను కూడా ఏర్పాటు చేసి బస సౌకర్యాలను కల్పిస్తున్నారు.

చదవండి: శవమే శివం.. భోజనం 2 పూటలే.. శుభకార్యాలకు దూరం

మరిన్ని వార్తలు