AP Special: పక్షుల ప్రేమాయణ కేంద్రం నేలపట్టు..!

5 Oct, 2021 23:03 IST|Sakshi
నత్తగుళ్లకొంగలు- గూడబాతు కొంగలు

విదేశీ పక్షి సంపద....నేలపట్టులో వింత..

నాయుడుపేట: నెల్లూరుజిల్లా నేలపట్టు గ్రామం పక్షుల ప్రేమాయణ కేంద్రంగా పిలవబడుతోంది. నాయుడుపేటకు 12 కిలోమీటర్లు దూరంలో దొరవారిసత్రం మండల పరిధిలోని ఈ గ్రామం ఉంది. క్రమేపీ ఈ గ్రామం విదేశీ పక్షులకు కేంద్ర బిందువుగా మారింది. 40–50 ఏళ్లు క్రితం నుండి పక్షుల నేలపట్టు, మైలింగం గ్రామాల చెరువులు, అటవీ ప్రాంతం వైపు సంచరించేవి. దట్టమైన చిట్టడివి కావడం పక్షులు విడిది చేసేందుకు వీలుగా వుండడం, జన సంచారంలేని ప్రాంతంగా వుండేది. పగలంతా అటవీ ప్రాంతంలో పురుగులు, చేపలను వేటాడి ఆహారంగా తీసుకునేవి. సందగూకల (సాయింత్రంవేళ) నేలపట్టు గ్రామంలో చెట్లుపై కిలకిలరావాలతో సందడి చేసేవి.

దేవతా పక్షులుగా పూజలు...
మెట్ట ప్రాంతంగా పేరున్న నేలపట్టు, మైలాంగి గ్రామాలు వర్షాలు పడేవి కావు. జీవనోపాధి  కోసం గ్రామస్థులు కూలీ పనులకు ఇతర మండలాలలకు వలస వెళ్లేవారు. విదేశీ పక్షులు రావడం ఆరంభించాక, సకాలంలో వర్షాలు రావడంతో గ్రామస్థులు శుభ సూచికంగా భావించారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా వర్షాలు రావడం పంట పండించుకోవడంతో వలసలకు పుల్‌స్టాఫ్‌ పడింది. ఆనాటి నుండి వీటిని దేవత పక్షులుగా నేలపట్టు, మైలాంగం రైతులు పక్షులకు పూజలు చేయడం కొనసాగించారు. పక్షులపై దాడులు, పక్షులను వేటాడనివ్వకుండా సంరక్షించే బాధ్యత రైతులే తీసుకున్నారు.

రైతులకు కావాల్సిన వర్షాలు సంవృద్దిగా కురవడంతో పాటు పంటల దిగుబడి బాగా వుండేది. 1976లో అటవీశాఖ, వన్యప్రాణి సంరక్షణ శాఖల అధికారులు పక్షులను సంరక్షించే బాధ్యత తీసుకున్నారు. నేటపట్టులో చెరువులకు నీటిని నింపడం, బలహీనంగా వున్న చెరువు కట్టలను బాగు చేయడం, చెట్లు పెంచడం, పక్షులకు మేతను ఇచ్చే మొక్కలు పెంచడం, చెరువుల్లో చేప పిల్లలను వృద్ది చేయడం వంటి పలు సంరక్షణ చర్యలు చేపట్టారు. పైగా పక్షులకు ఆసియా కండంలోనే అతి పెద్ద రెండవ ఉప్పునీటి పులికాట్‌ సరస్సు వుండడం పక్షులకు అనువైన ఆవాసయోగ్యమైన ప్రాంతంగా నిలుస్తోంది.

సంతానోత్పత్తి ఇక్కడే....
విహంగాల్లో ప్రసిద్ధి చెందిన రారాజులుగా పిలువబడే గూడబాతులు (పెలికాన్స్‌), తెల్లకంకణాయిలు, తెడ్డు ముక్కుకొంగలు, నత్తగుళ్లకొంగలు (ఓపెన్‌బిల్‌స్టార్క్స్‌), నీటి కాకులు, స్వాతికొంగలు, పాముమెడకొంగలతో పాటు బాతు జాతీకి చెందిన పలు రకాల పక్షులు సైబీరియా, నైజీరియా, ఖజికిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బర్మ, నేపాల్‌ తదితర దేశాల నుంచి తరలివస్తాయి. ఇలాంటి విదేశీ పక్షులకు వాతావరణ సమతుల్యత, విశాలమైన భూభాగం కలిగివుండడం వీటి సతానోత్పత్తికి అనువైన ప్రాంతంగా నిలుస్తోంది. విదేశాల నుండి వచ్చిన పక్షులు స్నేహభావంతో మెలగడం, సహజీవనం చేయడం, ప్రేమాయణంలోపడి సంతానోత్పత్తిని వృద్ది చేసుకుంటాయి. సమీపంలోని చెరువులు, సరస్సుల్లో చేపలను పిల్లలకు ఆహారంగా అందించి తమ స్వస్థలాలకు తిరిగి ఏప్రిల్‌ నెలలో పయనమవుతాయి పక్షులు. నేలపట్టు పక్షుల కేంద్రాన్ని విదేశీ పక్షుల ప్రేమాయణ కేంద్రంగా స్థానికులు చర్చించుకోవడం విశేషం.

మరిన్ని వార్తలు