చాళుక్య వంశ మూలపురుషుడి జన్మస్థలం.. ‘పెద్దముడియం’

18 Oct, 2021 11:16 IST|Sakshi

జమ్మలమడుగు: ప్రాచీన మధ్య యుగ దక్షిణ భారతదేశంలో ముఖ్యమైన రాజవంశాలలో చాళుక్యవంశం ఒకటి. బాదామి(వాతాపి) చాళుక్యులు, వేంగి చాళుక్యులు, కల్యాణి చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు ఇలా శాఖోపశాఖలుగా దక్షిణ భారతదేశంలో వివిధ ప్రాంతాలను సుదీర్ఘంగా పలించిన చాళుక్య వంశంలో మూల పురుషుడు విష్ణువర్థనుడు. విష్ణువర్థనుడు దక్షిణ భారతదేశంలో రాజ్యాన్ని ఏర్పాటు చేయడం గురించి వీరచోడుడు వేయించిన చెల్లూరు(తూర్పుగోదావరి జిల్లా) తామ్రా శాసనం వివరిస్తుంది.

ఈ శాసనం ప్రకారం చాళుక్యులు అయోధ్యా నగరానికి చెందిన చంద్రవంశరాజులు. వీరి పరంపరలో ఉదయనుడు అనే రాజు తరువాత 59 మంది రాజులు అయోధ్యను పాలించారు. తరువాత ఆ వంశంలోని విజయాదిత్యుడు అనే రాజు దక్షిణ జనపథానికి వచ్చాడు. విజయాదిత్యుడు పల్లవ రాజు త్రిలోచనుడుకి జరిగిన యుద్ధంలో విజయాదిత్యుడు మరణించాడు.

విజయాదిత్యుడి భార్య అప్పటికే గర్భవతి. ఆమె ముదివేము అనే అగ్రహారంలో విష్ణుభట్ట సోమయాజి అనే బ్రహ్మణుడి వద్ద ఆశ్రయం పొందింది. ఆమెకు మగ శిశువు జన్మించగా తమకు ఆశ్రయం ఇచ్చిన విష్ణుభట్ట పేరుమీద ఆ రాణి ఆ బాలుడికి విష్ణువర్థనుడు అని పేరు పెడుతుంది. విష్ణువర్థనుడు పెరిగి పెద్దయిన తర్వాత జరిగిన చరిత్రంతా తల్లి ద్వారా తెలుసుకుని చాణ్యు గిరికి వెళ్లి నందాదేవిని ఆరాధించి, కుమార నారాయణ, మాతృగణములను తృప్తి పరచి రాజచిహ్నాలైన శ్వేతా పత్రంలో శంఖము, పంచ మహా శబ్దము జెండా(పాలికేతన) వరాహా లాంఛనములు, పింఛ కుంత(బల్లెము) సింహాసనం మొదలైన వాటిని తీసుకుని కాదంబ, గాంగ రాజులను ఓడించి సమస్త దక్షిణ పథమును ఏలినాడు. ఈ విష్ణువర్థనుడే బాదామి చాణక్యులకు మూల పురుషుడు.

చెల్లూరు శాసనంలో ముదివేము నేడు కడప జిల్లాలో ఉన్న పెద్దముడియం అని 1903లో జమ్మలమడుగు తాలూకా డివిజన్‌ ఆఫీసర్‌ అయిన శ్రీరామయ్య పంతులు ప్రతిపాదించారు. నేడు కడప జిల్లా జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్‌లో పెద్దముడియం మండలకేంద్రంగా కుముద్వతీ (కుందూ)నది తీరాన ఉన్నది పెద్దముడియం. విష్ణు వర్థనుడి తండ్రి విజయాదిత్యుడు యుద్ధం చేసింది త్రిలోచన పల్లవుడితో కాగా పెద్దముడియం ఆగ్రహారాన్ని దానమిచ్చింది కూడా త్రిలోచన పల్లవుడే. పెద్దముడియం శాసనాలలో విష్ణు వర్ధునుడి జన్మ వృత్తాంతానికి సంబంధించిన ప్రస్తావన ఉంది.
 

Read latest Ap-special News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు