1992 డిసెంబర్‌ 6న ఏం జరిగింది ?

1 Oct, 2020 02:41 IST|Sakshi

బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనపై సమగ్ర విచారణ కోసం ఏర్పాటు చేసిన లిబర్‌హాన్‌ కమిషన్‌ తన నివేదికలో ఆ రోజు అయోధ్యలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో వివరించింది. కరసేవకులు మసీదుని కూలగొట్టడానికి వస్తున్నారన్న సమాచారం ముందే అందడంతో వేలల్లో పోలీసుల్ని పట్టణంలో మోహరించారు. అయితే లక్షన్నర మంది వరకు కరసేవకులు ఒకేసారి రోడ్ల మీదకి రావడంతో వారిని అడ్డుకోవడం సాధ్యం కాలేదని నివేదిక వెల్లడించింది. మన్మోహన్‌ సింగ్‌ లిబర్‌హాన్‌ ఆధ్వర్యంలోని కమిషన్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం ఉదయం 12:15కి మొదలైన కూల్చివేత కార్యక్రమం సాయంత్రం 5:30కి ముగిసింది.

1992 డిసెంబర్‌ 5 నుంచే అయోధ్యలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో యూపీలో నాటి కళ్యాణ్‌ సింగ్‌ ప్రభుత్వం భారీగా పోలీసుల్ని మోహరించింది. 35 కంపెనీల ప్రావిన్షియల్‌ ఆర్మీడ్‌ కాన్‌స్టబ్యులరీ (పీఏసీ), 195 కంపెనీల పారామిలటరీ బలగాలు, నాలుగు కంపెనీల సీఆర్‌పీఎఫ్‌ బలగాలు, 15 బాష్ప వాయు స్క్వాడ్స్, 15 మంది ఇన్‌స్పెక్టర్లు, 30 మంది ఎస్‌ఐలు, 2,300 మంది పోలీసు కానిస్టేబుళ్లు మోహరించారు. ఉదయం 10:30 గంటలకి అడ్వాణీ, జోషి వంటి బీజేపీ అగ్రనాయకులు కరసేవ ప్రారంభం చూడడం కోసం వచ్చారు. ఒక 20 నిమిషాల సేపు అక్కడే గడిపిన వారు రామ్‌కథ కుంజ్‌లో మతాధికారులు ఇచ్చే ప్రసంగాలు వినడానికి వెళ్లారు.

పలుగు పారలతో మసీదుపై దాడి
మసీదు చుట్టూ ఉన్న భద్రతా వలయాన్ని ఛేదించుకొని ఒక టీనేజీ యువకుడు 12 గంటల సమయంలో మసీదు గుమ్మటంపైకి నెమ్మదిగా ఎక్కాడు. అతని వెంట మరో 150 మంది వరకు పైకి ఎక్కి గునపాలు, ఇనుప రాడ్లు, పలుగులు, పారలతో మసీదుని కూల్చడం మొదలుపెట్టారు. మరో పావు గంట గడిచేసరికి 5 వేల మంది వరకు కరసేవకులు మసీదుపైకి ఎక్కేశారు. చేతికి దొరికిన ఆయుధాలతో కూల్చే పని కొనసాగించారు. అడ్వాణీ, జోషి, అశోక్‌ సింఘాల్, విజయ్‌రాజె సింథియా వంటి నేతలు వారిని వెనక్కి వచ్చేయమని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కరసేవకులు వినిపించుకోలేదు. భద్రతా బలగాలు, మీడియా ప్రతినిధులపైకి ఇటుకలు విసురుతూ ఉద్రిక్తతలకు తెర తీశారు.

పోలీసు బలగాలు అడ్డుకోలేకపోయాయి
జిల్లా మెజిస్ట్రేట్‌ పారామిలటరీ బలగాల్ని మోహరించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. వాళ్లెవరూ కాల్పులకు దిగకూడదన్న షరతు మీద ఆ నాటి యూపీ సీఎం కళ్యాణ్‌ సింగ్‌ బలగాలకు అనుమతించారు. కానీ వారు వివాదాస్పద కట్టడం దగ్గరకి వెళ్లడంలో విఫలమయ్యారు. మార్గం మధ్యలోనే వారిని కరసేవకులు అడ్డుకున్నారు. ఇక రాష్ట పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్ట కుండా మిన్నకుండిపోయారు. మసీదులో ఒక భాగం కూలిపోగానే డీజీపీ కాల్పులకు అనుమతి అడిగితే కళ్యాణ్‌సింగ్‌ నిరాకరిం చారు. మసీదు కూలడం మొదలు కావడంతో ఒక్కసారిగా అయోధ్యలో మత ఘర్షణలు పెచ్చరిల్లాయి. సాయంత్రమ య్యేసరికి మసీదు అంతా నేలమట్టమైంది. కేంద్ర కేబినెట్‌ యూపీలో రాష్ట్రపతి పాలన విధిస్తున్నట్టుగా ప్రకటించింది.

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు