మీన రాశి ఫలాలు 2022-23

2 Apr, 2022 08:17 IST|Sakshi

ఆదాయం–2

వ్యయం–8

రాజయోగం–1

అవమానం–7

పూర్వాభాద్ర 4 వ పాదము (ది)
ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదములు (దు, శ్య, ఝా, థా)
రేవతి 1,2,3,4 పాదములు (దే, దొ, చా, చి)

ఈ సంవత్సరం గురువు ఏప్రిల్‌ 13 వరకు కుంభం (వ్యయం)లోను తదుపరి మీనం (జన్మం)లోను సంచారం చేస్తారు. శని ఏప్రిల్‌ 28 వరకు మరల జూలై 12 నుంచి 2023 జనవరి 17 వరకు మకరం (లాభం)లోను మిగిలినకాలం అంతా కుంభంలోనూ సంచరిస్తారు. ఏప్రిల్‌ 12 వరకు రాహువు వృషభం (తృతీయం) కేతువు వృశ్చికం (భాగ్యం)లోను తదుపరి రాహువు మేషం (ద్వితీయం) కేతువు తుల (అష్టమం)లో సంచరిస్తారు.

2022 ఆగస్టు 10 నుంచి 2023 మార్చి 12 వరకు కుజుడు వృషభం (తృతీయం)లో స్తంభన. మొత్తం మీద ఈ సంవత్సరం అంతా అధికకాలం శని సంచారం అనుకూలత దృష్ట్యా మంచి ఫలితాలు ఉంటాయి. అలంకరణ వస్తువులు కొనుగోలుకు బాగా ధనవ్యయం చేస్తారు. ఆదాయం బాగా ఉండి, అది అన్ని విధాలా సద్వినియోగపడడం వలన చాలా సుఖంగా కాలక్షేపం జరుగుతుంది. కొత్త ఋణాలు అనుకూలంగా అందుతాయి. 

పుణ్యక్షేత్ర సందర్శన, విజ్ఞాన వినోద కార్యక్రమాల్లో ప్రత్యేక దృష్టితో పాల్గొనడం జరుగుతుంది. సాంఘికంగా గౌరవ మర్యాదలు బాగా అందుకుంటారు. ప్రమోషన్‌లు, అనుకున్న రీతిగా ట్రాన్స్‌ఫర్‌లు మీకు సంతృప్తికర ఫలితాలు ఇస్తాయి. శుభకార్య ప్రయత్నాలు తేలికగా పూర్తవుతాయి. చిరకాల సమస్యలకు ఈ సంవత్సరం నివారణ మార్గాలు దొరుకుతాయి. కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారికి మంచి సలహాలు సూచనలు అంది, సమస్యలను పరిష్కరించుకునే దిశగా ప్రయాణం చేస్తారు.

అన్ని రంగాల్లోనూ ఈ సంవత్సరం ఈ రాశివారికి శుభ ఫలితాలు అందుతాయి. మంచి జీవనం సాగుతుంది. మొండిబాకీలు వసూలు చేయడంలో స్నేహితులు బాగా సహకరిస్తారు. సరైన ప్రణాళికలను అమలు చేసినట్లయితే, అన్ని రకాలుగా వ్యాపార సమస్యలు తీరగలవు. వ్యాపారులకు సంవత్సరం అంతా లాభసాటిగానే ఉంటుంది. ఉద్యోగులకు అనుకోని లాభాలు చేకూరే అవకాశం ఉంది. పనులు తేలికగా పూర్తి చేస్తారు. తోటివారు సహకరిస్తారు. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. పాత ఆరోగ్య సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్తలు పాటిస్తారు. వైద్యం పెద్దగా అవసరం లేకుండానే ఈ సంవత్సరం అనారోగ్యవంతులు కూడా సుఖపడే అవకాశం ఉంది. స్థిరాస్తి కొనుగోలులో తెలివిగా ప్రవర్తిస్తారు.

నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చేసేవారికి అన్ని పనులు వేగంగా పూర్తవుతాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి ధనవ్యయం అధికమైనా, పనులు సానుకూలంగా ఉంటాయి. షేర్‌ వ్యాపారులకు, ఫైనాన్స్‌ వ్యాపారులకు గురువు మీనంలో ఉన్న కాలం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు ఏప్రిల్‌ నుంచి అనుకూలంగా సాగుతుంది. అన్ని రంగాల్లోనూ సానుకూల ఫలితాలుంటాయి. రైతులకు కావలసిన సౌకర్యాలు బాగా అందుతాయి. శ్రమకు తగిన ఫలితాలు అందుతాయి. గర్భిణీ స్త్రీలు సుఖంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంటుంది.

పూర్వాభాద్ర నక్షత్రం వారు సంబంధం లేని అంశాల్లో ఇబ్బందులకు గురవుతారు. కొన్ని సందర్భాలలో మీకు ఎదురులేని రీతిగా గ్రహచారం అనుకూలిస్తుంది. కొన్నిసార్లు ఎంత శ్రమ చేసినా ఫలితం లేని తీరు వుంటుంది. ధన, కుటుంబ వ్యవహారాల్లో అనుకూల స్థితి ఉంటుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వారు నగలు, వాహనాలు, భవంతుల కొనుగోలు విషయాలపై ఆసక్తి చూపుతారు. ప్రతి చిన్న విషయంలోనూ విపరీతమైన మానసిక ఒత్తిడి పొందుతారు. ప్రతిపనిలోనూ కలహతత్వం ప్రదర్శిస్తారు. రేవతీ నక్షత్రం వారికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరిగిపోతుంది. అనవసర విషయాల్లో భయాందోళనలు చెందుతారు. ఇతరులకు సహకారం చేయాలి అనుకున్నా మీకు అవమానకరమైన పరిస్థితులు ఎదురయ్యే సూచనలున్నాయి.

శాంతి: ప్రత్యేకమైన శాంతి కార్యములు అవసరం లేదు. రోజూ విష్ణూ సహస్ర పారాయణ చేయుట. లక్ష్మీనారాయణ పూజ, గోపూజ చేసుకోవడం శుభప్రదం. పంచముఖ రుద్రాక్షధారణ శుభప్రదం.

ఏప్రిల్‌: శ్రమ చేసినా ఫలితాలు సంతృప్తికరంగా ఉండవు. శనికి శాంతి అవసరం. ఏలినాటి శని ఈ నెల నుంచి ప్రారంభమవుతుంది. మీ జాతక పరిశీలన చేయించుకోండి. ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరం కాగలవు. ఉద్యోగ, వ్యాపారాలు భారంగా నడుస్తాయి. సానుకూలత తక్కువ ఉన్న కాలం.

మే: గురు శుక్రుల అనుకూలత, శని కుజుల ప్రతికూలత దృష్ట్యా విచిత్రమై చికాకులు వెంబడిస్తాయి. ఆదాయం బాగున్నా, ఖర్చులు నియంత్రించలేరు. ఉద్యోగంలో అనుకోని చికాకులు రాగలవు. మితభాషణ అవసరం. మీ పనులు స్వయంగా చేసుకోవడం చాలా ఉత్తమం. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు.

జూన్‌: ఉద్యోగం వ్యాపారాల్లో అధికారులతోను, పనివారితోను చాలా జాగ్రత్తగా ఉండవలసిన కాలం. మితభాషణ, ఓర్పు చాలా అవసరం. ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చేసుకోండి. ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. గాయాలు కాకుండా జాగ్రత్తలు తీసుకోండి.

జూలై: మంచి కాలం. అన్ని అంశాలూ అనుకూలిస్తాయి. డబ్బు వెసులుబాటు బాగుంటుంది. ధైర్యంగా, స్వయంగా పనులు చేసుకుంటూ విజయం సాధిస్తారు. అభివృద్ధి వైపు ప్రయాణం సాగుతుంది. కుటుంబ సమస్యలు తేలికగా పరిష్కారమవుతాయి. ఋణ సమస్యలు తీరే కాలం.

ఆగస్టు: అన్ని అంశాల్లోనూ మంచి ఫలితాలు ఉంటాయి. అనుకున్న ప్రతిపనినీ సకాలంలో పూర్తి చేస్తారు. సందర్భానుసారం ప్రవర్తించడం, అందరితో స్నేహంగా ఉండడం, ఆర్థిక వెసులుబాటు, ఆరోగ్యం సహకరించడం వంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఈ నెల చాలా మంచికాలం.

సెప్టెంబర్‌: చాలా జాగ్రత్తలు పాటిస్తారు. అన్ని విషయాల్లోనూ మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా వృత్తి విషయాల్లో సుఖంగా కాలక్షేపం జరుగుతుంది. మితభాషణ చేస్తారు. అవసరం అయిన చోట ధైర్యం తెలివి ప్రదర్శిస్తారు. కుటుంబ సౌఖ్యం తక్కువనే చెప్పాలి. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు.

అక్టోబర్‌: ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. వృత్తి వ్యవహారాల్లో అనుకూల స్థితి ఉంటుంది. ఈ నెలలో ఇతరుల నుంచి సహాయ సహకారాలు తక్కువనే చెప్పాలి. ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువ అయినా తెలివిగా ఖర్చులను నియంత్రించగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో మంచి ఫలితాలుంటాయి.

నవంబర్‌: చాలా మంచి రోజులు ప్రారంభం అవుతున్నాయి. మీ పాత సమస్యల పరిష్కారం గురించి భవిష్యత్‌ ప్రణాళికలు గురించి చక్కటి పరిశ్రమ చేయండి. రోజురోజుకు మంచి ఫలితాలు వస్తాయి. ఋణ విషయాలు ఆర్థిక సమస్యలు ఈ నెల 15వ తేదీ తరువాత క్రమంగా సానుకూలం అవుతాయి. మంచి జీవనకాలం ప్రారంభమైంది.

డిసెంబర్‌: గౌరవ మర్యాదలకు భంగం కలుగకుండా ప్రవర్తిస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికం అవుతాయి. రోజువారీ పనులు మాత్రమే చేస్తారు. కొత్త ప్రయోగాలు చేయరు. పుణ్యకార్య ఆకాంక్ష ఎక్కువ అవుతుంది. చాలావరకు మంచి ఫలితాలు ఉంటాయి. డబ్బు విషయంలో ఇబ్బంది లేకుండా సాగిపోతుంది. శుభ ప్రయత్నాలు వేగవంతం అవుతాయి.

జనవరి: అద్భుతమైన కాలం. 22వ తేదీతో వ్యయంలో శుక్రుడి సంచారం ప్రారంభమైన తరువాత కొంత ప్రయాణ చికాకులు ఉంటాయి. ఈ నెల వృత్తి విషయంలో అంతా సుఖంగా ఉంటుంది. ఆదాయం బాగుంటుంది. చక్కగా ఖర్చు చేయగలుగుతారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. 

ఫిబ్రవరి: 15 వరకు రవి, 15 నుంచి శుక్రుడు అనుకూలిస్తారు. తద్వారా ఏలినాటి శని ఫలితాలను దాటవేస్తారు. అతి జాగ్రత్తలు పాటిస్తారు. కొన్ని సందర్భాలలో మీ నడవడి తోటివారికి ఇబ్బంది కలిగిస్తుంది. కొత్త పనులు చేపట్టవద్దు. రోజువారీ పనులు ఆలస్యంగా పూర్తవుతాయి.

మార్చి: ఒక విచిత్రమైన కాలం. రోజువారీ పనులు కూడా శ్రమతో నడుస్తాయి. ఏ పనిలోనూ నష్టాలు ఉండవు. ఆదాయం అందడం ఆలస్యంగానూ, ఖర్చులు వేగంగానూ వస్తుంటాయి. సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శుభకార్య పుణ్యకార్య ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

మీ జాతకానికి ఈ గోచారాన్ని మీ జ్యోతిషవేత్త ద్వారా అన్వయం చేయించుకోండి. దశ అంతర్దశ ప్రభావానికి, గోచారానికి పోలిక చేసి ఫలితములు తెలుసుకోండి.

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సర 2022 – 23:  మీ రాశిఫలాలు కోసం క్లిక్ చేయండి..

మరిన్ని వార్తలు