వృశ్చిక రాశి ఫలాలు 2022-23

2 Apr, 2022 07:11 IST|Sakshi

ఆదాయం–14 

వ్యయం–14  

రాజయోగం–3 

అవమానం–1

విశాఖ 4 వ పాదము (తొ)
అనురాధ 1,2,3,4 పాదములు (నా, నీ, నూ, నే)
జ్యేష్ఠ 1,2,3,4 పాదములు (నో, యా, యీ,యూ)

సంవత్సరం గురువు ఏప్రిల్‌ 13 వరకు కుంభం (చతుర్థం)లోను తదుపరి మీనం (పంచమం)లోను సంచారం చేస్తారు. శని ఏప్రిల్‌ 28 వరకు మరల జూలై 12 నుంచి 2023 జనవరి 17 వరకు మకరం (తృతీయం)లోనూ మిగిలినకాలం అంతా కుంభంలోనూ సంచరిస్తారు. ఏప్రిల్‌ 12 వరకు రాహువు వృషభం (సప్తమం), కేతువు వృశ్చికం (జన్మం)లోను తదుపరి రాహువు మేషం (షష్ఠం), కేతువు తుల (వ్యయం)లో సంచరిస్తారు. 

2022 ఆగస్టు 10 నుంచి 2023 మార్చి 12 వరకు కుజుడు వృషభం (సప్తమం)లో స్తంభన. కుజస్తంభన వల్ల ఆగస్టు నుంచి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇది మినహా మిగిలిన గ్రహాలన్నీ చాలా యోగ్యంగా ఉంటాయి. గురువు సంచారం అనుకూలత దృష్ట్యా ఆర్థిక విషయాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఆదాయం కావలసిన రీతిగా అందడం, శుభకార్యాలు, ధర్మకార్యాలకు చక్కగా వెచ్చించడం, సంఘంలో గౌరవ మర్యాదలు పెంచుకోవడం వంటివి జరుగుతాయి. గతంలో చాలాకాలంగా ఉన్న సమస్యలు ఎటువంటివైనా ఈ సంవత్సరం గట్టిగా ప్రయత్నిస్తే అనుకూలం అవుతాయి. భవిష్యత్తులో చేయాలనుకునే పెద్ద ప్రాజెక్ట్‌లకు ఈ సంవత్సరమే శ్రీకారం చుట్టడం శుభదాయకం. 

కుటుంబంలో పెద్దల ఆరోగ్యం, పిల్లల అభివృద్ధి బాగా అనుకూలం. ఋణ సంబంధ విషయాలలో మంచి అనుకూల స్థితి ఉంటుంది. కుటుంబ విషయంలో అందరి నుంచి అనుకూల పరిస్థితి ఉంటుంది. కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి కాలం అనుకూలం. వృత్తిరీత్యా స్థాయి గౌరవము పెరుగుతాయి. మీరు ఇతరులకు బాగా సçహాయం చేసే అవకాశం ఉంటుంది. తరచుగా శుభవార్తలు వింటారు. వ్యాపార విషయంగా స్థానమార్పు కోరుకునేవారికి ప్రస్తుతం కాలం బాగా అనుకూలిస్తుంది. వ్యాపారులకు సంవత్సరం అంతా చక్కటి వ్యాపారం జరిగి మంచి ఫలితాలు అందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగులకు అన్ని కోణాల్లోనూ సానుకూల స్థితి ఉంటుంది. అందరూ బాగా సహకరిస్తారు. ఆశించిన రీతిలో ఫలితాలు ఉండటంలో ధైర్యంగా ముందుకు వెడతారు. ఆగస్టు తరువాత కొంచెం జాగ్రత్తలు అవసరం. ఆరోగ్యపరంగా పెద్ద ఇబ్బందులు ఉండవు. ఆగస్టు నుంచి ఏదో తెలియని మానసిక శారీరక బాధలు ఉన్నాయనే భావనతో చికాకులకు లోనవుతారు.

ఈ సంవత్సరం గత సమస్యలకు కూడా పరిష్కారం లభించే అవకాశాలు ఉంటాయి. మెరుగైన వైద్య సలహాలు అందుకుంటారు. తేలికపాటి ప్రయత్నాలతోనే స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో కార్యసిద్ధి. నూతన ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు చేసేవారికి ఊహాతీతంగా కాలం అనుకూలిస్తుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి విద్యా, ఉద్యోగ విషయాల్లో మంచి ఫలితాలుంటాయి. షేర్‌ వ్యాపారులకు, ఫైనాన్స్‌ వ్యాపారులకు ఈ సంవత్సరం అంతా లాభాలు అందుతాయి. విద్యార్థులకు శ్రమ చేసిన కొద్దీ మంచి ఫలితాలు అందుతాయి. మంచి గౌరవం వచ్చేలాగా విద్యా వ్యాసంగం సాగుతుంది. రైతులకు అన్ని కోణాల్లోనూ సహాయ సహకారాలు అందుతాయి. తద్వారా మంచి వ్యవసాయ ఫలితాలు ఉంటాయి. గర్భిణిలు సంవత్సరం అంతా ఆనందంగా ఉంటారు. ఆగస్టు 10 తరువాత చిన్న చిన్న చికాకులు ఉంటాయి.

విశాఖ నక్షత్రం వారికి విద్యా వ్యాసంగంలో మంచి ఫలితాలు వుంటాయి. భార్యా భర్తల నడుమ మనస్పర్థలు తొలగి అన్యోన్యత ఏర్పడుతుంది. అయితే ఆగస్టు నుంచి కుటుంబ వ్యవహారాల్లో ఇతరుల ప్రమేయానికి అవకాశం ఇవ్వవద్దు. ఆరోగ్య, ఋణ విషయాల్లో ఆగస్టు నుంచి జాగ్రత్తలు అవసరం.

అనురాధ నక్షత్రం వారికి ఈ ఏడాది ప్రశాంతత కలుగుతుంది. ఎప్పటినుంచో ఉన్న చికాకులకు ఈ సంవత్సరం పరిష్కారాలు లభిస్తాయి. ఆగస్టు లోపు ప్రయత్నిస్తే మొండి బాకీలు వసూలవుతాయి. ఆగస్టు తర్వాత ఏ విధమైన వ్యవహారాలూ వుండకుండా చూసుకోండి.

జ్యేష్ఠ నక్షత్రం వారికి శుభ పరిణామాలు ఎక్కువ ఉంటాయి. అయితే అనారోగ్యవంతులయిన ఈ నక్షత్రం వారు ఆగస్టు నుంచి తరచుగా ఇబ్బందులు పడే అవకాశముంది. అందువల్ల ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలి. దూరప్రాంత ప్రయాణాలు విరమించండి. మీ విషయాలు గోప్యంగా వుంచకుండా కుటుంబ సభ్యులతో పంచుకోండి. 

శాంతి: ప్రత్యేకంగా ఆగస్టు 10 తరువాత కుజుడికి శాంతి చేయించండి. సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం, ఆరు ముఖాల రుద్రాక్షధారణ చేయడం శ్రేయస్కరం.

ఏప్రిల్‌: మీరు స్వయంగా ప్రయత్నిస్తే, చాలాకాలంగా ఉన్న సమస్యలకు ఈ నెలలో పరిష్కారాలు దొరుకుతాయి. ఆదాయ వ్యయాలు సమతూకంగా ఉంటాయి. ఋణ ప్రయత్నాలు సానుకూలం. ఉద్యోగంలో ఒత్తిడి పెరిగినా, ఫలితాలు మాత్రం అనుకూలం. రోజువారీ పనులు, వృత్తి వ్యవహారాలు ఇబ్బంది లేకుండా సాగుతాయి.

మే: ఉల్లాసంగా కాలక్షేపం చేస్తారు. ప్రయత్నాలన్నీ సానుకూలం అవుతాయి. ఇతరుల సహాయ సహకారాలు లేకున్నా, విజయం సాధిస్తారు. కుటుంబసభ్యుల అవసరాలు తీర్చడంలో  కృతకృత్యులవుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక, ఉద్యోగ విషయాల్లో మంచి పరిస్థితి ఉంటుంది.

జూన్‌: కుటుంబ వ్యవహారాల్లో చిన్న చిన్న చికాకులు ఉంటాయి. పెద్దల ఆరోగ్య విషయంలోకాని, పిల్లల అభివృద్ధిలోకాని అనుకూలత తక్కువ. ఇతరులను నమ్మి ఏ పనీ చేయవద్దు. ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. దూరప్రయాణాలు చేయవద్దని సూచన.

జూలై: కొన్ని అంశాలు అనుకూలం, కొన్ని ప్రతికూలంగా ఉంటాయి. చాలా వరకు మంచి ఫలితాలే ఉంటాయి. మీ సంబంధీకుల ఇళ్లలో నిశ్చయమైన శుభకార్యాలు మీకు ఆనందం కలిగిస్తాయి. అంతటా విజయం సాధిస్తారు. ముఖ్యంగా ఆర్థిక వెసులుబాటు, ఆరోగ్య సమస్యలకు పరిష్కారం విశేషం.

ఆగస్టు: కుజుడు వృషభ మిథున రాశులలో సంచారం చేస్తూ అనుకూలించని స్థితి. రానున్న కాలంలో కొంచెం జాగ్రత్తలు పాటించాలి. తరచుగా కుజ గ్రహ శాంతి చేయించండి. రాబోయే కాలంలో మీ జాతకానికి, ఈ కుజ సంచారానికి అనుబంధంగా ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి జాతక శోధన చేయించుకోండి.

సెప్టెంబర్‌: కుజుడు మినహా మిగిలిన గ్రహాల అనుకూలత దృష్ట్యా ఇది చాలా మంచి కాలం అనే చెప్పాలి. తెలివిగా ప్రవర్తిస్తారు. మానసిక స్థితి ప్రశాంతంగా ఉంటుంది. అభివృద్ధి వైపు ప్రయాణం సాగుతుంది. గత సమస్యల పరిష్కారానికి వెదుకులాట ఈ నెల ఫలిస్తుంది. పెంపుడు జంతువులతో ఇబ్బంది ఎదురవుతుంది.

అక్టోబర్‌: వ్యక్తిగత విషయాలు గోప్యంగా ఉంచుకోవాలి. అలాగే వ్యవహార ప్రతిబంధకాలు రాకుండా 15వ తేదీ నుంచి జాగ్రత్తపడాలి. మిగిలినకాలం మిగిలిన అన్ని అంశాలూ సానుకూలంగానే ఉంటాయి. ఇతరుల వ్యవహారాలపై దృష్టి పెట్టకండి. నెలాఖరులో ఆరోగ్యపరంగా చికాకులు ఉంటాయి.

నవంబర్‌: శని గురు రాహువుల అనుకూల సంచారం, మిగిలిన గ్రహాల ప్రతికూల సంచారం వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలలో తోటివారి సహకారం, సిబ్బంది సహకారం తగ్గుతుంది. శుభకార్యాలు, పుణ్యకార్యాల నిమిత్తం తరచు ప్రయాణాలు చేస్తుంటారు.

డిసెంబర్‌: చాలా విచిత్రమైన కాలం. ఎప్పుడు యోగ్యంగా ఉంటుందో, ఎప్పుడు చికాకుగా ఉంటుందో చెప్పలేని కాలం. అయితే శుక్ర సంచారం అనుకూలత వల్ల చాలా వరకు కుటుంబ వ్యవహారాల్లో అనుకూల స్థితిని పొందుతారు. బంధుమిత్రుల సహకారం బాగుంటుంది. అధికారుల ఒత్తిడి తప్పదు. ప్రతి విషయంలోనూ అధిక దనవ్యయం జరుగుతుంది.

జనవరి: శుభాశుభ పరిణామములు ఎక్కువ అనే చెప్పాలి. ఈ నెల 22 వరకు కొత్త ప్రయోగాలు చేయవద్దు. ధైర్యం విడనాడకుండా ముందుకు వెడతారు. దానధర్మాలు చేయాలనే కోరిక పెరుగుతుంది. శ్రమ ఎక్కువ అవుతుంది. కానీ చివరకు లాభం ఉంటుంది. ఆర్థిక వెసులుబాటు బాగుంటుంది.

ఫిబ్రవరి: రోజూ ఏదో ఒక కొత్త వ్యవహారం మీద ఆలోచనలు చేస్తారు. అన్ని అంశాల్లోనూ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆదాయం ఎక్కువగానే ఉంటుంది. ఖర్చులు అదే రీతిగా ఉంటాయి. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. ఆరోగ్య భద్రత కోసం ముందు జాగ్రత్తలు పాటిస్తారు. అధికారులతో జాగ్రత్తగా ఉండటం మంచిది.

మార్చి: సహజంగా అష్టమ కుజుడు ఇబ్బందులు కలిగించే గ్రహం. అయితే మిగిలిన గ్రహాల అనుకూలతల వల్ల ప్రశాంతంగా ఉంటారు. ఉద్యోగ భద్రత బాగుంటుంది. వ్యాపారులు మంచి వ్యాపారం చేయగలుగుతారు. సిబ్బంది బాగా సహకరిస్తారు.

మీ జాతకానికి ఈ గోచారానికి మీ జ్యోతిషవేత్త ద్వారా అన్వయం చేయించుకోండి. దశ అంతర్దశ ప్రభావానికి, గోచారానికి పోలిక చేసి ఫలితములు తెలుసుకోండి.

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సర 2022 – 23:  మీ రాశిఫలాలు కోసం క్లిక్ చేయండి..

మరిన్ని వార్తలు