వారఫలాలు.. (5 డిసెంబర్‌ నుంచి 11 డిసెంబర్‌ 2021 వరకు)

5 Dec, 2021 07:28 IST|Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
అనుకున్న పనులు కొన్ని అవాంతరాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక విషయాలలో కొంత పురోగతి కనిపిస్తుంది. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. స్థిరాస్తి విషయంలో నూతన ఒప్పందాలు. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణాలు చేపట్టే వీలుంది. వ్యాపారాలు మరింత హుషారుగా సాగి లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. పారిశ్రామికవర్గాలకు సంతోషకరమైన సమాచారం రావచ్చు. వారం ప్రారంభంలో వ్యూహాలు తప్పుతాయి. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణం చేయండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
మొదటి రెండుమూడురోజులు ఇబ్బందులు, సమస్యలతో సతమతమవుతారు. అయితే క్రమేపీ అనుకూల వాతావరణం నెలకొంటుంది. ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది. స్థిరాస్తి విషయంలో నెలకొన్న వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. మీలో నైరాశ్యం తొలగి ముందడుగు వేస్తారు. వాహనాలు, విలువైన సామగ్రి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత పుంజుకుని ఉత్సాహంగా సాగుతారు. ఉద్యోగాలలో ఒడిదుడుకుల నుంచి గట్టెక్కుతారు. రాజకీయవర్గాల ఆశలు నెరవేరతాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. పసుపు, నీలం రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ముఖ్యమైన వ్యవహారాలలో అడుగు ముందుకేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థికంగా మరింత బలపడేందుకు కృషి చేస్తారు. కొన్ని రుణాలను ఎట్టకేలకు తీరుస్తారు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. సంఘంలో విశేష గౌరవమర్యాదలు పొందుతారు. ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు చిరకాల కోరిక నెరవేరవచ్చు. వ్యాపారాలు విస్తరణలో ఒకరి సాయం అందుతుంది. ఉద్యోగాలలో మీపై వచ్చిన అపవాదులు తొలగుతాయి. కళారంగం వారికి మరింత ఉత్సాహంగా ఉంటుంది. వారం మధ్యలో స్వల్ప అనారోగ్యం. మిత్రులతో విభేదాలు. గులాబీ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
కొత్త వ్యూహాలతో ముందుకు సాగి కొన్ని విజయాలు సాధిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. భూముల వివాదాలు తీరి ఊరట చెందుతారు. ముఖ్య పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన డబ్బు సకాలంలో అందుకుంటారు. వివాహాది వేడుకలపై కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో ఇంతకాలం పడిన ఇబ్బందులు తొలగుతాయి. ఉద్యోగాలలో హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు శుభవార్తలు అందుతాయి. వారం చివరిలో ధనవ్యయం. మానసిక అశాంతి. ఆకుపచ్చ, నేరేడు రంగులు. దక్షిణదిశప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఎంతటి పనినైనా నేర్పుగా పూర్తి చేస్తారు. మీ ప్రతిపాదనలు కుటుంబసభ్యులను ఆలోచింపజేస్తాయి. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. చీటికీమాటికీ చికాకుపరుస్తున్న ఆరోగ్య సమస్యలు సర్దుకుంటాయి. మీమాటంటే ఎదురులేని పరిస్థితి నెలకొంటుంది. ఆర్థిక విషయాలు మునుపటి కంటే మెరుగ్గా ఉంటాయి. భూ, వాహనయోగాలు ఉండవచ్చు. వ్యాపారాలు పుంజుకుని ఆశించిన లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు, ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు సంతోషకరమైన సమాచారం. వారం ప్రారంభంలో మిత్రులతో కలహాలు. కొన్ని ఒప్పందాలు వాయిదా. గులాబీ, ఎరుపు రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
మొదట్లో పడిన కష్టాలు, ఇబ్బందులను క్రమేపీ అధిగమిస్తారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు దక్కించుకుంటారు. సోదరులు మీపై ఉంచిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రుల సలహాలు స్వీకరిస్తారు. కొన్ని సమస్యలు పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడి ఊరట చెందుతారు. వ్యాపారాలలో భాగస్వాముల చేయూత అందుతుంది. ఉద్యోగాలలో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. కళారంగం వారికి ఊహించని విజయాలు వరిస్తాయి. వారం ప్రారంభంలో బంధువులతో తగాదాలు. స్వల్ప అనారోగ్యం. ఆకుపచ్చ, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. నిర్ణయాలలో కొన్ని మార్పులు చేసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు పడిన శ్రమ ఫలిస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఊహించని విజయాలు. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థికంగా కొంత వెసులుబాటు కలిగినా ఖర్చులు పెరిగి ఇబ్బందిపడతారు. అనుకున్న పనుల్లో కొంత జాప్యం తప్పదు. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఆలోచనలు నిలకడగా సాగవు. విద్యార్థులు శ్రమించినా ఫలితం కనిపించదు. స్థిరాస్తి వివాదాలతో సతమతమవుతారు. అనుకున్నది సాధించాలన్న పట్టుదల ఉన్నా కుటుంబసభ్యులు నిరాశ పరుస్తారు. వ్యాపారాలు స్వల్ప లాభాలు అంది పర్వాలేదనిపిస్తాయి. ఉద్యోగాలలో కొత్త వివాదాలు నెలకొంటాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. గులాబీ, పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
కొత్త వ్యక్తులతో పరిచయాలు. సమాజసేవలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆర్థికంగా మరింత అనుకూలం. భూములు, వాహనాలు కొనుగోలు చేసే వీలుంది. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. కీలక సమావేశాలలో పాల్గొంటారు. వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఇతరులకు సైతం చేయూతనిస్తారు. మీ అంచనాలు కొన్ని నిజం చేసుకుంటారు. వ్యాపారాలు క్రమేపీ వృద్ధిబాటలో నడుస్తాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. అనారోగ్యం. గులాబీ, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆస్తుల విషయంలో నెలకొన్న స్తబ్దత తొలగుతుంది. ఆర్థికంగా ఇబ్బందుల నుంచి బయటపడతారు. వ్యతిరేక పరిస్థితులను సైతం అనుకూలంగా మలచుకుంటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఊహించని ఉద్యోగావకాశాలు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం తొలగుతుంది. రాజకీయవర్గాల ఆశలు కొన్ని ఫలించే సూచనలు. వారం మధ్యలో వృథా ధనవ్యయం. అనారోగ్యం. నీలం, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఇతరులకు చేతనైన సహాయం అందిస్తారు. ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకుంటూ ముందుకు సాగుతారు. శుభకార్యాలకు కొంత వెచ్చించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. పలుకుబడి పెరుగుతుంది. గృహం, వాహనాలు కొంటారు. వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కించుకుంటారు. కళారంగం వారికి అనుకోని అవకాశాలు రావచ్చు. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. ఆకుపచ్చ, నీలం రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.  గణేశాష్టకం పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఏ పని చేపట్టినా సకాలంలో పూర్తి చేస్తారు. ఇంతకాలం పడిన కష్టాలను అధిగమిస్తారు. మీసేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో మీపై కొన్ని బాధ్యతలు పడవచ్చు. ఆత్మవిశ్వాసం, ధైర్యంతో ముందడుగు వేసి విజయం సాధిస్తారు. వివాహయత్నాలు కలసివస్తాయి. గతంలో తీసుకున్న నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. స్థిరాస్తిని వృద్ధి చేసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు, సమస్యలు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. మానసిక అశాంతి. పసుపు, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.

- సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు 

మరిన్ని వార్తలు