జాతీయ కబడ్డీ పోటీలకు ఇంకొల్లు క్రీడాకారిణి

22 Mar, 2023 02:28 IST|Sakshi

చినగంజాం: జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఇంకొల్లుకు చెందిన కబడ్డీ క్రీడాకారిణి జే కోమలి ఎంపికయ్యారు. హరియాణాలో మార్చి 23 నుంచి 26 వరకు నిర్వహించే 69వ జాతీయ స్థాయి సీనియర్‌ మహిళా ఆంధ్ర కబడ్డీ జట్టుకు ఆమెను ఎంపిక చేశారు. ఆమె ఎంపికపై ఆంధ్ర కబడ్డీ కార్యదర్శి వై శ్రీకాంత్‌, జిల్లా కార్యదర్శి ఆమంచి వెంకటేశ్వరరావు, అధ్యక్షులు ఎన్‌ అర్జునరావు, కోశాధికారి సీహెచ్‌ పుల్లయ్య, చైర్మన్‌ పీ భాస్కర్‌, సీనియర్‌ క్రీడాకారుడు కేవీ రమణారెడ్డి, పీ రామచంద్రరావులు మంగళవారం అభినందనలు తెలిపారు.

అర్జీ గడువు దాటితే రూ.100 జరిమానా..

గుంటూరు వెస్ట్‌: గ్రామ, వార్డు సచివాలయాలు మీ సేవ ద్వారా వచ్చిన దరఖాస్తులను గడువులోపు పరిష్కరించకపోతే సంబంధిత అధికారికి రోజుకు రూ.100 జరిమానా విధిస్తామని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌ రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీని కోసం ప్రత్యేక ఖాతాను తెరవనున్నారు. అర్జీల పరిష్కారంలో కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, స్పందన కార్యక్రమాలకు సరిగ్గా హాజరు కాకపోవడం లాంటి చర్యలు ఇటీవల అధికమయ్యాయి. దీంతో కలెక్టర్‌ ఈనిర్ణయం తీసుకున్నారు.

ఘనవ్యర్థాల నిర్వహణలో సేవలకు పురస్కారాలు

గుంటూరు ఎడ్యుకేషన్‌: జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం, ఐటీసీలోని సెర్చ్‌, ఫినిష్‌ ఎన్జీఓ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం జెడ్పీ సమావేశ మందిరంలో గ్రామీణ ఘన వ్యర్థాల నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు పురస్కారాలు ప్రదానం చేశారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినా ముఖ్య అతిథిగా హాజరైన కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య నిర్వహణలో అత్యుత్తమ సేవలు అందించిన ఎంపీడీఓలు, ఈఓలు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, గ్రామ వలంటీర్లు, క్లాప్‌మిత్రలు, షెడ్‌ మిత్రలను శాలువాతో సత్కరించి, జ్ఞాపిక అందించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ బత్తుల అనురాధ, సీఈఓ జె.మోహనరావు, డీపీఆర్సీ జిల్లా సమన్వయకర్త పీఎస్‌ పద్మాకర్‌, డీపీఓ ఆర్‌.కేశవరెడ్డి, జెడ్పీ అకౌంట్స్‌ అధికారి జి. శ్రీనివాసరావు, ఐటీసీ స్టేట్‌ ప్రోగ్రాం మేనేజర్‌ గౌరీ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

కేజీబీఎస్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

నకరికల్లు: స్థానిక కస్తూరిబా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్‌ లక్ష్మి సోమవారం తెలిపారు. ఐదో తరగతి ఉత్తీర్ణులైన బాలికలు స్టడీ సర్టిఫికెట్‌తో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 40ఖాళీలు మాత్రమే ఉన్నాయని ఈనెల 27వ తేదీలోగా దరఖాస్తును ఆన్‌లైన్‌లో పొందుపరచాలని కోరారు.

ఉగాది పంచాంగ

శ్రవణంలో పాల్గొనండి

అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతి అమరేశ్వరాలయంలో బుధవారం శోభకృత్‌ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా నిర్వహించే పంచాంగ శ్రవణంలో పాల్గొనాలని మంగళవారం ఆలయ ఈఓ సునీల్‌కుమార్‌ భక్తులను కోరారు. బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు ఆలయంలో నిర్వహించే ఉగాది పంచాంగ శ్రవణంలో శోభకృత్‌ నామ సంవత్సర ఫలితాలను, గ్రహగమనాలను, వాటి ఫలితాలను ఆలయ అర్చకులు వివరిస్తారన్నారు. స్థానిక కోదండరామాలయం, పాండురంగస్వామి ఆలయం, హనుమద్గీతామందిరంలో కూడా ఉగాది పంచాంగ శ్రవణం నిర్వహిస్తున్నట్లు ఆయా ఆలయ నిర్వాహకులు తెలిపారు.

సాగర్‌ నీటిమట్టం

విజయపురిసౌత్‌: నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం మంగళవారం 534.50 అడుగుల వద్ద ఉంది. ఇది 175.0650 టీఎంసీలకు సమానంగా ఉంది. సాగర్‌ జలాశయం నుంచి కుడికాలువకి 9,217, ఎడమకాలువకు 3,035, ఎస్‌ఎల్‌బీసీకి 1,500, వరదకాలువకి 320 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్‌ జలాశయం నుంచి మొత్తం ఔట్‌ఫ్లోగా 14,072 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్‌ జలాశయానికి 14,072 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 813.00 అడుగుల వద్ద ఉంది. ఇది 36.0870 టీఎంసీలకు సమానం.

మరిన్ని వార్తలు