వేటపాలెం రైల్వేస్టేషన్‌కు కొత్త హంగులు

22 Mar, 2023 02:28 IST|Sakshi
నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్లాట్‌ఫారంలు

వేటపాలెం: స్థానిక వేటపాలెం రైల్వేస్టేషన్‌ కొత్త హంగులను సంతరించుకొంది. త్వరలో కొత్త రైల్వేస్టేషన్‌ భవనాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే విజయవాడ–గూడూరు రెండు ప్రధాన రైల్వే ట్రాక్‌లు ఉండగా మూడేళ్లుగా మూడో లైన్‌ కోసం నిర్మాణం పనులు జరుగుతున్నాయి. దక్షిణ భారతంలో విజయవాడ–గూడూరు లైన్‌ రైళ్లు, గూడ్సు రైళ్ల రాకపోకలతో అత్యంత రద్దీగా ఉంటుంది. 288 కిలోమీటర్ల విజయవాడ–గూడూరు మూడో లైన్‌ కోసం రైల్వే శాఖ రూ.3,246 కోట్లతో పనులకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో పనులు పూర్తయి అందుబాటులోకి వచ్చాయి. ఇటీవల కరవది–చిన్నగంజాం మధ్య 23.5 కిలో మీటర్ల మేర మూడో లైన్‌ పనులు పూర్తిచేశారు. ఆధునికీకరణలో భాగంగా వేటపాలెంలో ప్రస్తుతం ఉన్న పాత రైల్వేస్టేషన్‌ ఉన్న ప్రాంతంలో మూడో లైన్‌ వస్తున్నందున నూతనంగా రెండంతస్తుల రైల్వేస్టేషన్‌ భవనం నిర్మాణం చేపట్టి పనులు పూర్తి చేశారు. దీంతో స్టేషన్‌ నూతన శోభ సంతరించుకుంది. గతంలో రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం మూడు ప్లాట్‌ఫారాలు ఉండేవి. ప్రస్తుతం ఉన్న మూడు ప్లాట్‌ ఫారాలకు అదనంగా మరో రెండు ఫ్లాట్‌ ఫారాలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం నూతనంగా మరో ఫుట్‌ఓవర్‌ బిడ్జిని నిర్మించనున్నారు. నూతనంగా ఏర్పాటు చేసే స్టేషన్‌ అందుబాటులోకి వస్తే రైల్వే ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. వేటపాలెం నుంచి ప్రయాణికుల రాకపోకలు నిత్యం ఉండటంతో పాటు, జీడీగింజలు, జీడీపప్పు ఎగుమతులు దిగుమతులతో మంచి ఆదాయం వస్తుంటుంది.

గ్రంథాలయానికి రైల్వే శాఖ

ప్రత్యేక గుర్తింపు

వేటపాలెంలో నూతనంగా నిర్మించిన రైల్వేస్టేషన్‌ భవనంపై వందేళ్ల చరిత్ర కల్గిన సారస్వతనికేతనం గ్రంథాలయం భవనాన్ని రైల్వేస్టేషన్‌పై చిత్రీకరించారు. దీంతోపాటు గాంధీజీ వేటపాలెం వచ్చిన చిత్రాన్ని స్టేషన్‌పై తీర్చిదిద్దారు. ప్రయాణికులు ఈ చిత్రాలను ప్రత్యేకంగా వీక్షిస్తున్నారు.

అదనంగా రెండు ప్లాట్‌ఫాంలు

అందుబాటులోకి

త్వరలో నూతన స్టేషన్‌ భవనం

ప్రారంభం

మరిన్ని వార్తలు