శోభితమై.... శోభకృతమై...

22 Mar, 2023 02:28 IST|Sakshi

ఉగాది చేసే ప్రతి సవ్వడిలో మహోపదేశముంటుందట. అది పంచాంగ పఠనమైనా, షడ్రుచుల సమ్మేళనమైనా. ‘మనింటికి చుట్టాలు వచ్చివెళ్లినట్లుగా వసంతం వచ్చి వెళ్లదు.. ఒక జీవన సూత్రాన్ని మాత్రం కచ్చితంగా తెలియచేసే వెళ్తుంది’. వేప చెట్టుకు వేప పువ్వు, మామిడి చెట్టుకు పిందెలు, కోయిల గొంతుకు కుహూ రాగాలు.. వంటివన్నీ మన ముగింటకు తెచ్చేది ఉగాది పర్వదినమే. అందుకే అది ఊహలకు ‘గాదె’ అయ్యింది. ‘తరలిరాద తనే వసంతం.. తనదరికి రాని వనాల కోసం’ అని సీతారాముడు పదవిన్యాసం చేసింది ఈ వసంతాన్ని పూర్తిగా తనకుతాను ఆకళింపు చేసుకోబట్టే. అందుకే జీవితాల్లో శిశిరానికి చోటివ్వకూడదని పెద్దలు చెబుతారు. ‘శిశిరంలో మోడువారినా వసంతంలో చిగురిస్తావు / గ్రీష్మ తాపముందని తెలిసినా వర్షమొస్తుందని అభయమిస్తావు, ఓ ప్రకృతి నీవిచ్చిన వన్నీ మాకు మధుమాసాలే’ అని చెబుతాడు ఓ యువకవి. ప్రతి వ్యక్తి జీవితంలో ‘వసంతం’ అవసరమే. అయితే దాన్ని మనకు మనమే ఆహ్వానించుకోవాలి. ఒత్తిడి లేని జీవనం, కాలుష్యం ఎరుగని ప్రకృతి మధ్య జీవనం సాగితేనే అది సాధ్యం. అలా ఉండగలిగితే వారి జీవితాల్లోకి ‘శిశిర’ ప్రవేశం ఉండదు. కలియుగం ఆరంభమైనది ఉగాది నాడే అని చెప్పినా, జీవితం షడ్రుచులమయం కావాలని బోధించినా.. (మధుర (తీపి) ఆమ్ల (పులుపు), కటు (కారం), కషాయ (ఒగరు), అవగణ (ఉప్పు), తిక్త (చేదు).. వాటంన్నిటి పరమార్థం.. అంతరార్థం నిత్యవసంతమై జీవితాలు సాగాలనే. అలాంటి సుసంపన్నమైన జీవనం ఈ ‘శోభకృత్‌ నామసంవత్సరంలో అందరికీ ఒనగూడాలని ఆశిద్దాం. – గుంటూరు డెస్క్‌

మరిన్ని వార్తలు