జీవితాన్ని ‘క్షయ’ం చేసుకోవద్దు

24 Mar, 2023 06:18 IST|Sakshi
క్షయవ్యాధిని తెలియజేసే పోస్టర్లు
● అప్రమత్తంగా లేకపోతే టీబీ ప్రాణాలు తీస్తోంది ● ప్రాథమిక దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చు ● నేడు వరల్డ్‌ టీబీ డే

గుంటూరు మెడికల్‌: భారతదేశంలో ప్రతి ఏడాది ఐదు వేల మంది క్షయ వ్యాధి బారిన పడుతున్నారు. ప్రతిరోజూ దేశ వ్యాప్తంగా వెయ్యి కంటే ఎక్కువ మంది టీబీతో చనిపోతున్నారు. ప్రతి పది నిమిషాలకు ఇరువురు టీబీతో మరణించడం చాలా బాధాకరం. గుంటూరు జిల్లాలో 2021లో 30,476 మందికి టీబీ అనుమానిత కేసులుగా భావించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయగా, 9,622 మందికి టీబీ నిర్ధారణ అయింది. 2022లో 28,900 మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయగా, 9,525 మందికి టీబీ నిర్ధారణ అయింది. 2023లో జనవరి నుంచి ఫిబ్రవరి వరకు 4,225 మందికి టీబీ నిర్ధారణ పరీక్షలు చేయగా, 1,225 మందికి టీబీ నిర్ధారణ అయింది. క్షయవ్యాధి (టీబీ)కి కారణమయ్యే బ్యాక్టీరియా ట్యూబర్‌క్యులోసిస్‌ను 1862 మార్చి 24న బెర్లిన్‌కు చెందిన డాక్టర్‌ రాబర్ట్‌కోచ్‌ కనుకొన్నాడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ప్రతి ఏటా మార్చి 24న ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’అందిస్తున్న ప్రత్యేక కథనం.

ఉచిత పరీక్షలు

జిల్లాలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో టీబీ జబ్బు సోకిందా లేదా అని నిర్ధారించే కళ్ళె పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. కళ్ళె పరీక్ష, ఎక్సరే ద్వారా వ్యాధిని నిర్ధారించి వ్యాధి ఉన్నవారికి మందులను కూడా ఉచితంగా అందజేస్తారు. మందులు ఆరు నెలల నుండి ఎనిమిది నెలలపాటు క్రమం తప్పకుండా వాడాలి. మధ్యలో మందులు మింగటం ఆపివేస్తే వ్యాధి ముదిరిపోయి ప్రాణాంతకం అవుతుంది. అప్పుడు నయం చేయటం చాలా కష్టం అవుతోంది. మందులను ఆరోగ్య కార్యకర్తలే ఇళ్ల వద్దకు వచ్చి వ్యాధి గ్రస్థుల చేత మింగిస్తారు.వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి మందులు మింగటం ద్వారా నయం అవుతుంది. 2020లో క్రమం తప్పకుండా మందులు వాడినవారిలో 92 మంది, 2021లో 92 మంది, 2022లో 93 మంది విజయవంతంగా టీబీ నుంచి విముక్తి పొందారు. హెచ్‌ఐవి ఉన్నవారిలో 80 శాతం మందికి క్షయవ్యాధి సోకే అవకాశాలు ఎక్కువ. పొగతాగేవారికి, టీబీ రోగులకు వైద్యం అందించే వారికి, షుగర్‌వ్యాధి ఉన్నవారికి మూడు శాతం టీబీ సోకే అవకాశాలు ఉన్నాయి. సీబీ న్యాట్‌ వైద్య పరికరం ద్వారా హెచ్‌ఐవి బాధితులకు క్షయనిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు.

ఉచితంగా పౌష్టికాహారం

ప్రధాన మంత్రి టీబీ ముక్తభారత్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా క్షయ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం ఉచితంగా పౌష్టికాహార పదార్ధాల కిట్‌ను అందజేస్తోంది. జిల్లా కలెక్టర్‌ వేణుగోపాలరెడ్డి చేతుల మీదుగా స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సహకారంతో 1200 మందికి ఆరు నెలలపాటు పౌష్టికాహార కిట్‌లను అందజేశారు. అంతేకాకుండా ప్రతినెలా ఒక్కో పేషెంట్‌కు రూ. 500లు చొప్పున ఆరు నెలలకు గాను జిల్లాలో గత ఏడాది రూ. 84 లక్షలు పారితోషికంగా అందజేశారు. టీబీ వ్యాధి నిర్ధారణ చేసే ప్రైవేటు వైద్యులకు, టీబీ మందులు అందిస్తున్న వైద్య సిబ్బందికి ఇన్‌సెంటీవ్‌లు అందిస్తున్నాం.

– డాక్టర్‌ అమర్తలూరి శ్రావణ్‌బాబు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, గుంటూరు

నేడు టీబీ అవగాహన ర్యాలీ

వరల్డ్‌ టీబీ డే సందర్భంగా శుక్రవారం గుంటూరు డీఎంహెచ్‌ఓ కార్యాలయం నుంచి గుంటూరు జీజీహెచ్‌ వరకు అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నాం. గుంటూరు జీజీహెచ్‌లోని శుశృత హాలులో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో టీబీ నియంత్రణ కోసం కృషి చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందిస్తాం. వ్యాసరచన, ఇతర పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు అతిధుల చేతుల మీదుగా బహుమతులు అందజేస్తున్నాం.

– డాక్టర్‌ బండారు సుబ్బారావు,

జిల్లా క్షయ వ్యాధి నియంత్రణ అధికారి

లక్షణాలు ఇలా....

రెండు వారాలకు మించి దగ్గు ఉండటం, దగ్గినప్పుడు రక్తం పడటం, ఛాతిలోనొప్పి, బరువు తగ్గిపోవటం, ఆకలి మందగించటం, రాత్రి వేళల్లో జ్వరం రావటం, చమటలు పట్టడం క్షయవ్యాధి లక్షణాలు.వ్యాధి సోకినవారు దగ్గినా, తుమ్మినా వారి నోటి తుంపరలు మీద పడటం ద్వారా వ్యాధి సోకుతుంది. ధూమపానం, మధ్యపానం లాంటి చెడు వ్యసనాలు ఉన్నవారికి, హెచ్‌ఐవి బాధితులకు టిబి వ్యాధి సోకే ప్రమాదం ఉంది.

మరిన్ని వార్తలు