No Headline

25 Mar, 2023 02:08 IST|Sakshi
అధికారుల సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి

గుంటూరువెస్ట్‌: జిల్లాలో పరిశ్రమలను ఏర్పాటుచేసే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూర్తి సహకారం అందిస్తామని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం రాత్రి స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో నిర్వహించిన ఇండస్ట్రీయల్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కమిటీ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను అధికారులు ప్రభుత్వ పాలసీ ప్రకారం పరిశీలించి ఆమోదించాలన్నారు. చిన్న చిన్న సమస్యలు ఏర్పడితే తన దృష్టికి తీసుకు రావాలన్నారు. బ్యాంకర్లు కూడా పరిశ్రమల స్థాపనకు మరిన్ని రుణాలు మంజూరు చేయాలన్నారు. జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రుణాలు, ఇన్‌సెంటీవ్స్‌ ద్వారా ఆర్థిక సహకారం అందిస్తోందన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి పరిశ్రమల ఏర్పాటుకు 508 దరఖాస్తులు అందాయని, వీటిలో సమాచారం పూర్తిస్థాయిలో క్రోడీకరించని 368 దరఖాస్తులు అందాయన్నారు. వీటిలో పూర్తి సమాచారం పొందుపరిచి దరఖాస్తుదారులు రెండు వారాల్లో ఆన్‌లైన్‌లో అప్‌లోడు చేయాలన్నారు. సబ్సిడీలో పొందే క్రమంలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తారని హెచ్చరించారు. సమావేశంలో లీడ్‌బ్యాంక్‌ మేనేజర్‌ ఈదర రాంబాబు, జిల్లా పరిశ్రమల శాఖ డీఎం విజయరత్నం, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ గోపికృష్ణ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు