రాగిజావ, చిక్కీ పంపిణీ వేళల్లో మార్పులు

25 Mar, 2023 02:08 IST|Sakshi

గుంటూరు ఎడ్యుకేషన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జగనన్న గోరుముద్ద కార్యక్రమంలో భాగంగా అందజేస్తున్న రాగిజావ, చిక్కీ పంపిణీ వేళల్లో మార్పులు చేస్తూ మిడ్‌ డే మీల్స్‌ డైరెక్టర్‌ నిధిమీనా ఉత్తర్వులు విడుదల చేసినట్లు డీఈవో పి.శైలజ శుక్రవారం తెలిపారు. ఈ నెల 21న ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన రాగిజావ పంపిణీ ప్రక్రియ వారంలో మూడు రోజుల పాటు ప్రతి మంగళ, గురు, శనివారాల్లో ఉదయం 8.45కల్లా అందజేయాలని ఇచ్చిన ఉత్తర్వులను సవరించినట్లు పేర్కొన్నారు. ఇక నుంచి ఫౌండేషన్‌ స్కూళ్లలో ఆయా రోజుల్లో ఉదయం 10:35కు, హైస్కూళ్లలో ఉదయం 10:45కు రాగిజావ పంపిణీ చేయాలని తెలిపారు. చిక్కీని మధ్యాహ్న భోజనం తరువాత విద్యార్థులకు అందజేయాలని డీఈవో శైలజ హెచ్‌ఎంలను ఆదేశించారు.

ఉర్దూ పాఠశాలల పనివేళల్లో

మార్పులను అమలు చేయాలి..

రంజాన్‌ మాసం సందర్భంగా ఉర్దూ మీడియం పాఠశాలల పనివేళల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులను అమలుపరచాలని డీఈవో శైలజ పేర్కొన్నారు. ఆయా పాఠశాలలు ఏప్రిల్‌ 22 వరకు ఉదయం 8.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు పని చేసేలా పర్యవేక్షించాలని డీవైఈవోలు, ఎంఈవోలతో పాటు ఉర్దూ డీఐని ఆదేశించారు.

ఉదయం 8:45 గంటలకు బదులుగా 10:35 నుంచి పంపిణీ

మరిన్ని వార్తలు