జైళ్ల శాఖలో 30 శాతం ఖాళీల భర్తీకి ప్రతిపాదనలు

25 Mar, 2023 02:08 IST|Sakshi
● రాష్ట్ర వ్యాప్తంగా 28 పెట్రోల్‌ బంకులు ఏర్పాటు ● జైళ్ల శాఖ ఐజీ హసన్‌ రిజా

సత్తెనపల్లి: రాష్ట్ర వ్యాప్తంగా జైళ్ల శాఖలో 30 శాతం ఖాళీలు ఉన్నాయని, వాటి భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని జైళ్ల శాఖ డీజీ హసన్‌ రిజా తెలిపారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి సబ్‌జైలులో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్‌ బంకును శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో 28 పెట్రోల్‌ బంకులు ఏర్పాటు చేశామని, వీటిలో 16 పూర్తి కాగా 12 వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. ఓపెన్‌ ప్రిజనర్‌ కింద పెట్రోల్‌ బంకుల్లో పనిచేసేందుకు ఐదేళ్ల పైబడి శిక్ష అనుభవిస్తున్న సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను తీసుకుంటున్నామన్నారు. జైళ్లలో ఖైదీలకు ఆహ్లాదకర వాతావరణం కల్పిస్తున్నామని చెప్పారు. రాజమండ్రి సబ్‌జైల్లో కూరగాయలు సాగు చేపట్టడంతో రూ.30 లక్షల ఆదాయం వచ్చిందని తెలిపారు. జైళ్లలో అనేక సంస్కరణలు అమలవుతున్నాయన్నారు. సత్తెనపల్లి సబ్‌ జైలులో రూ.9 లక్షలతో టాయిలెట్ల నిర్మాణం జరుగుతోందన్నారు. సబ్‌జైల్లో తనిఖీలు చేసి పలు సూచనలు చేశారు. ఆయన వెంట డీఐజీ వరప్రసాద్‌, గుంటూరు జైళ్ల శాఖ అధికారి వీరేంద్రప్రసాద్‌, సత్తెనపల్లి సబ్‌జైలు సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావు ఉన్నారు.

మరిన్ని వార్తలు