ఇది గొప్ప సంకల్పం

27 May, 2023 11:36 IST|Sakshi
పసిబిడ్డతో పట్టా కోసం..

సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో సొంత ఇల్లు లేని పేదలు ఉండకూడదు అన్న గొప్ప సంకల్పంతో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకాన్ని ప్రభుత్వం చేపట్టిందని గుంటూరు కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి చెప్పారు. శుక్రవారం వెంకటపాలెంలో జరిగిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో స్వాగతోపన్యాసం చేసిన ఆయన గుంటూరు జిల్లాలో ఇప్పటికే లక్షా 17,108 మందికి ఇళ్ల పట్టాలు అందచేసినట్టు వివరించారు.

దీనికోసం 276 ఎకరాల ప్రభుత్వ భూమితోపాటు రూ.1,452 కోట్ల రూపాయలు వెచ్చించి 2,512 ఎకరాల ప్రైవేటు భూములను సేకరించామని వెల్లడించారు. మొత్తం 2,789 ఎకరాలలో 284 జగనన్న కాలనీలు నిర్మిస్తున్నామని, ఆ భూములు చదునుచేసి సరిహద్దురాళ్లు, గ్రావెల్‌ రోడ్ల కోసం 81.56 కోట్ల రూపాయలు, తాగునీరు, విద్యుత్‌ సరఫరా కోసం రూ. 47.57 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. మొదటి దశలో 209 కాలనీలలో 66,125 ఇళ్లు ప్రారంభమై వేగవంతంగా జరుగుతున్నాయని, జిల్లాలో 18,448 టిడ్కో ఇళ్ల నిర్మాణం దాదాపుగా పూర్తయిందని వివరించారు.

మంగళగిరి, తెనాలి, పొన్నూరులో అన్ని మౌలిక వసతులతో ప్రారంభోత్సవాలు కూడా చేశామని, అమరావతిలో ఈరోజు ముఖ్యమంత్రి చేతుల మీదుగా సీఆర్డీఏ పరిధిలోని పది గ్రామాలలో 5,024 ఇళ్లు ప్రారంభోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈరోజు 23,762 మంది లబ్ధిదారులకు 10 లేఅవుట్లలో 1402.58 ఎకరాల భూమిలో పట్టాలు ఇస్తున్నామని వివరించారు.

మరిన్ని వార్తలు