ఆక్వా రైతులు అప్రమత్తంగా ఉండాలి

4 Dec, 2023 02:44 IST|Sakshi
పెనుమూడిలో ఆక్వా రైతులకు సూచనలిస్తున్న ఫిషరీస్‌ ఏడీ సైదా నాయక్‌
ఫిషరీస్‌ ఏడీ సైదా నాయక్‌

రేపల్లె రూరల్‌: మిచాంగ్‌ తుఫాన్‌ నేపథ్యంలో తీరంలోని ఆక్వా రైతులు అప్రమత్తంగా ఉండాలని ఫిషరీస్‌ ఏడీ సైదానాయక్‌ సూచించారు. తుఫాన్‌ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మండలంలోని పెనుమూడిలో ఆదివారం ఆక్వా రైతులకు వివరించారు. తుఫాన్‌ వచ్చే సమయంలో చేపలు, రొయ్యలు పట్టుబడి చేయరాదన్నారు. సాగు చేసే చెరువులో మేతలు వేయటం తగ్గించాలని కోరారు. ఎటువంటి ఎరువులు, రసాయన మందులు చెరువులలో చల్లరాదన్నారు. విద్యుత్‌ కోతలు ఉండేందుకు అవకాశం ఉన్నందున డీజిల్‌ ఆయిల్‌ సరిపడా సిద్ధం చేసుకోవాలని సూచించారు. కొత్తగా రొయ్య పిల్లలు, చేప పిల్లలు వదలటం, బదిలీ చేయటం చేయరాదని చెప్పారు. బలహీనంగా ఉన్న చెరువు గట్లను ఇసుక బస్తాలతో పటిష్ట పరచుకోవాలని కోరారు. అధిక వర్షపాతానికి చెరువులు పొంగే అవకాశం ఉన్నందున కొంత నీటిని ముందుగానే బయటకు పంపించాలని వివరించారు. చెరువు గట్లపై ఉండే వృద్ధులు, మహిళలు, పిల్లలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. మబ్బులు, వర్షం కారణంగా ప్రాణ వాయువు స్థాయి తగ్గే అవకాశం ఉన్నందున పొటాషియం పర్మాంగనేట్‌గాని, కాల్షియం పెరాకై ్సడ్‌గాని, ఆక్సిజన్‌ బిళ్లలను సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు. సాగులో ఉన్న చెరువు గట్లు తక్కువ ఎత్తు ఉంటే ఆ చెరువు చుట్టూ వలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సాగులో చేపలు చనిపోతే గోతులో సున్నం వేసి కప్పిపెట్టాలన్నారు. రొయ్యల చెరువులో వర్షం తగ్గిన వెంటనే చెరువులలోని వర్షపు నీటిని బయటకు పంపించాలన్నారు. చెరువు గట్లు మీద విద్యుత్‌ ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.

>
మరిన్ని వార్తలు