నాటకానికి కొత్తదారి

4 Dec, 2023 02:44 IST|Sakshi
పరాయి నాటకంలో సన్నివేశం

తెనాలిః ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి క్రమంగా ఉనికిని కోల్పోతున్న తెలుగు నాటకానికి ఇప్పుడు పరిషత్‌లే పెద్ద దిక్కన్నట్టుగా ఉంది. అలాంటి నాటకానికి ఆధునికత, అవసరమైన మార్పులు జోడించి పూర్వవైభవం కోసం కృషి చేస్తున్న అరుదైన రచయిత/దర్శకుల్లో తెనాలికి చెందిన ఉస్మాన్‌ ఘని ఒకరు. కెమికల్‌ ఇంజినీరింగ్‌లో పీజీ చేసినా, ప్రాణంగా భావించే నాటక కళను చదివాడు. థియేటర్‌ ఆర్ట్స్‌లో పీజీ చేశాడు. అద్భుతమైన నాటకాలను తీసుకొస్తున్నాడు. ప్రేక్షకులు టికెట్‌ కొనుక్కుని మరీ చూస్తున్నారు. దేశ విభజన మిగిల్చిన గాయాలతో హిందూ ముస్లింల మధ్య పేరుకుపోయిన అపనమ్మకం అనే కథను ‘పరాయి’ పేరుతో నాటకానికి కొత్త అర్థం చెప్పాడు. నాటకం కళాకారులను పోషిస్తుందన్న నమ్మకాన్ని కలిగించాడు. తెలుగు రాష్ట్రాల్లో సంచలన దర్శకుడిగా గుర్తింపు పొందిన ఉస్మాన్‌ ఘని పరిచయమిది.

ఉస్మాన్‌ ఘని స్వస్థలం తెనాలి దగ్గర్లోని మూల్పూరు. తండ్రి షేక్‌ సైదా ఇండియన్‌ ఆర్మీలో చేశారు. తల్లి గృహిణి. టెన్త్‌ తర్వాత చదువు కోసమని అమ్మమ్మ ఊరు నరసరావుపేట వెళ్లారు. చిన్నతనం నుంచీ నాటకాలంటే ఆపేక్ష. ఆంధ్రా యూనివర్శిటీలో 2016లో కెమికల్‌ ఇంజినీరింగ్‌లో ఎంటెక్‌ చేశాక ఉద్యోగం కోసం చూడలేదు. నేరుగా హైదరాబాద్‌ వెళ్లాడు. నాటక సంస్థ ‘భూమిక’లో చేరాడు. శిక్షణ తీసుకుని సహాయ దర్శకుడిగా, సెట్‌, లైటింగ్‌ డిజైన్‌ చేస్తూ నాటకంతో కొనసాగాడు. నాటకాన్ని చదవాలని పాండిచ్చేరి సెంట్రల్‌ యూనివర్శిటీలో థియేటర్‌ ఆర్ట్స్‌లో పీజీ కోర్సులో చేరాడు. దర్శకత్వంలో స్పెషలైజ్‌ చేశాడు. అప్పుడే రెండు నాటకాలు తయారుచేసి, ప్రదర్శించాడు. ప్రముఖ నాటక రచయిత/దర్శకుడు ఆంటోన్‌ బెకాన్‌ రచించిన ఇంగ్లిష్‌ కథ ‘స్వాన్‌ సాంగ్‌’ను నాటకీకరించాడు. ఏకే రామానుజన్‌ జానపద కథ ‘ఏ సాంగ్‌ అండ్‌ స్టోరీ’ని నాటకీకరించి ఆరొవిల్లాలో ప్రదర్శించారు.. డైలాగుల్లేని నాటకమిది. మోనోలాగ్‌ను నటి/రచయిత్రి ప్రియాంక పంపండేకర్‌చే రాయించారు. కోర్సు పూర్తయ్యాక 2022 జులైలో హైదరాబాద్‌కు చేరి, బి. స్టూడియోతో అసోసియేట్‌ అయ్యాడు. వ్యవస్థాపకుడు షేక్‌ జాన్‌ బషీర్‌ కోరికపై ‘పరాయి’ నాటకానికి అంకురార్పణ చేశాడు.

ఇంటర్నేషనల్‌ స్కూల్లో టీచర్లకూ

నాటకం పాఠాలు

నవంబరు 10న హైదరాబాద్‌లో జాన్‌ బషీర్‌ దర్శకత్వంలో, ప్రముఖ రచయిత, పాత్రికేయుడు ఖదీర్‌బాబు రచన ‘న్యూ బాంబే టైలర్స్‌’లోనూ పలు పాత్రల్లోనూ ఉస్మాన్‌ ఘని జీవించాడు. మరోవైపు జీవనం కోసం పాఠశాలల్లో నటశిక్షణ తరగతులు చెబుతున్నాడు. ఓ ఇంటర్నేషనల్‌ స్కూల్లో టీచర్లకూ నాటకం పాఠాలను బోధిస్తున్నాడు.

‘పరాయి’తో నాటక రంగ సంచలనం

భారత్‌–పాకిస్తాన్‌ విభజన

మిగిల్చిన వేదన ఇతివృత్తం

నాటక కళా సేవ చేస్తున్న

కెమికల్‌ ఇంజినీర్‌

తెనాలికి చెందిన యువ రచయిత/

దర్శకుడు ఉస్మాన్‌ ఘని

పరాయి ఒక సంచలనం ..

తెలుగు రాష్ట్రాల్లో పరాయి ఒక సంచలనం. ఇండియా–పాకిస్తాన్‌ విభజన మిగిల్చిన వేదననీ, విద్రోహపు విషాదాన్నీ, హిందూ ముస్లింల మధ్య పేరుకుపోయిన అపనమ్మకం తనను వెంటాడుతోంది. ఆ కథను కొత్తదారిలో చెప్పటానికి ఎంచుకున్న నాటకమే ‘పరాయి’గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రపంచ ప్రఖ్యాత ఉర్దూ కథా రచయిత సాదత్‌ మంటో రాసిన కథలు ‘ఖోల్దో’, ‘సహాయ్‌’కు మరో సమకాలీన కథను జోడించి ఆనాటి గాయాలకు ప్రాసంగికతను తెచ్చేందుకు ప్రయత్నించాడు. దేశవిభజన ఏ సమూహాలను, ఏ మతాన్ని రాత్రికి రాత్రే దాయాదినీ, పరాయినీ చేసిందో కళ్లకు కట్టేలా రాశారు. పాటలకు బదులుగా ప్రసిద్ధ కవులు సాహిర్‌ లుథియాన్వీ, ఫైజ్‌ అహ్మద్‌ వంటి అయిదుగురు ప్రసిద్ధ కవుల కవితలు, షాహెర్‌లు, అనంతు చింతలపల్లి అద్భుతమైన డైలాగులతో నాటకం సిద్ధమైంది. 30 మంది నటీనటులు...అంతా 25–30 ఏళ్ల వయస్కులే. రవీంద్రభారతిలో తొలి ప్రదర్శన. రూ.250 టికెట్‌ కొనుక్కుని మరీ చూశారు. ఐఐటీ, హైదరాబాద్‌ వాళ్లు మొత్తం టికెట్లు కొనుక్కుని తమ క్యాంపస్‌లోనే ప్రదర్శనను తిలకించారు. ఇలా ఇప్పటికి మొత్తం తొమ్మిది ప్రదర్శనలతో ఉస్మాన్‌ ఘని ఇప్పుడో నాటకానికి కొత్త అర్థం చెప్పారు. పుస్తకంగానూ వెలువరించారు. అదే నాటకంలో తను నటించాడు కూడా.

>
మరిన్ని వార్తలు