ఎస్సీ వర్గీకరణే ఎమ్మార్పీఎస్‌ లక్ష్యం

5 Dec, 2023 05:20 IST|Sakshi

మంగళగిరి: ఎస్సీ వర్గీకరణే మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి లక్ష్యమని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య స్పష్టం చేశారు. సోమవారం గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బ్రహ్మయ్య మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సారాల క్రితం నాగార్జున యూనివర్సిటీ దగ్గర మాదిగ కురుక్షేత్ర మహాసభకు హాజరైన ఎమ్మార్పీఎస్‌ నాయకులు, కార్యకర్తలపై ఆనాటి టీడీపీ ప్రభుత్వం నిర్ధాక్షిణ్యంగా కేసులు నమోదు చేసిందన్నారు. కేసుల విషయమై ఇటీవల వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఎత్తేయాలని కోరాగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం అభినందనీయమన్నారు. ఎస్సీ వర్గీకరణే ధ్యేయంగా గత 30 ఏళ్లుగా అనేక మంది నాయకులు, కార్యకర్తలు తమ ప్రాణాలను పణంగా పెట్టి జాతి కోసం అమరులయ్యారని గుర్తు చేశారు. గత కురుక్షేత మహాసభ గాయాలు మానకముందే మరోసారి ఏపీలో కురుక్షేత్రం పేరుతో మళ్లీ మాదిగల జీవితాలను అంధకారం వైపు తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న నాయకుడిని మాదిగ జాతి గుర్తించి అప్రమత్తం కావాలన్నారు. సమావేశంలో రాష్ట్ర కో–కన్వీనర్లు ఏటుకూరి విజయ్‌, కొదమల కుమార్‌, మానికొండ శ్రీధర్‌, పరసా రామయ్య, రాష్ట్ర యువసేన అధ్యక్షుడు పొన్నిగంటి రమేష్‌, గుంటూరు జిల్లా అధ్యక్షుడు కొమురాల శ్రీనివాస్‌, చింతపల్లి గంగాధర్‌, చింతపల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు