రైల్వే కేసుల పరిష్కారానికి లోక్‌ అదాలత్‌

5 Dec, 2023 05:20 IST|Sakshi
బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్న డివిజన్‌ డీసీఎం కమలాకర్‌బాబు

లక్ష్మీపురం: సౌత్‌ సెంట్రల్‌ రైల్వే గుంటూరు రైల్వే డివిజన్‌ పరిధిలోని రైల్వేకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించేందుకు రైల్వే క్లెయిమ్స్‌ ట్రిబ్యునల్‌ ఈనెల 4వ నుంచి 7వ తేదీ వరకు అమరావతి బెంచ్‌ గుంటూరు లోక్‌ అదాలత్‌ను నిర్వహిస్తున్నట్టు డివిజన్‌ డీసీఎం కమలాకర్‌బాబు చెప్పారు. స్థానిక అరండల్‌పేటలోని గుంటూరు రైల్వే స్టేషన్‌ ప్రాంగణంలోని రైల్వే క్లెయిమ్స్‌ ట్రిబ్యునల్‌ అమరావతి కోర్టులో సోమవారం రైల్వే కేసుల పరిష్కారానికి లోక్‌ అదాలత్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైలు ప్రమాదాల బాధితులకు, రవాణాలో వస్తువులు పొగొట్టుకున్న, పాడైపోయిన వారికి త్వరితగతిన పరిహారం చెల్లించడం ద్వారా రైలు వినియోగదారులకు ఉపశమనం కలిగించడం ఈ అదాలత్‌ ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. నాలుగు రోజుల వ్యవధిలో 113 కేసులను పరిష్కరించేలా ప్రణాళిక రూపొందించామన్నారు. లోక్‌ అదాలత్‌ బెంచ్‌ను న్యాయమూర్తి సత్యభామ నిర్వహించనున్నారన్నారు. ప్రైవేట్‌ రైల్వే అడ్మినిస్ట్రేషన్‌ ద్వారా నాణ్యమైన పరిహారం కోసం పరస్పరం అంగీకారంతో ఈ 113 కేసుల దరఖాస్తుదారులు పరిహారం పొందేందుకు అర్హులని లోక్‌ అదాలత్‌ బెంచ్‌ సభ్యుడు జి.జాన్‌ ప్రసాద్‌ తెలిపారు. అనంతరం లోక్‌ అదాలత్‌లో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించారు.

ఈనెల 4నుంచి 7వ తేదీ వరకు నిర్వహణ డీసీఎం కమలాకర్‌బాబు

>
మరిన్ని వార్తలు