విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం

6 Dec, 2023 01:54 IST|Sakshi
పునరావాస కేంద్రాల్లో ఉన్న వారితో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌, ఎస్పీ
తీర ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్‌, ఎస్పీ, ఎమ్మెల్యే

చీరాల: మిచాంగ్‌ తుఫాన్‌ విపత్తులో సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రజలెవ్వరూ ఆందోళన పడొద్దని జిల్లా కలెక్టర్‌ రంజిత్‌ బాషా, జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ అన్నారు. మిచాంగ్‌ తుఫాన్‌ నేపథ్యంలో మంగళవారం చీరాల రూరల్‌ మండలం వాడరేవు సముద్రతీర ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్‌ రంజిత్‌బాషా, ఎస్పీ వకుల్‌ జిందాల్‌, ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి పరిశీలించి అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను పరిశీలించారు. అలానే తుఫాన్‌ షెల్టర్లలో ఉన్న వారిని పరామర్శించారు. తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు అందరం సిద్ధంగా ఉన్నామన్నారు. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ఎటువంటి సమస్యలు వచ్చినా ఎదుర్కొనేందుకు పోలీస్‌శాఖ సిద్ధంగా ఉందన్నారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. చప్టాలు, రోడ్లుపై నీరు ప్రవహించే ప్రదేశాల వద్ద పికెట్లు ఏర్పాటు చేశామన్నారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు అవసరమైన చోట్ల సేవలందిస్తున్నాయన్నారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీస్‌శాఖ తక్షణ సహాయం కోసవ డయల్‌ 100, 112 నంబర్లకు సంప్రదించాలన్నారు.

ఆందోళన చెందవద్దు

జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌

బాపట్లటౌన్‌: తుఫాన్‌ విపత్తుపై జిల్లాలోని ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, విపత్తును ఎదుర్కొవడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు. మంగళవారం తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా సిబ్బందితో కలిసి ఎస్పీ పర్యటించారు. ఎస్పీ వకుల్‌ జిందాల్‌ మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. చప్టాలు, రోడ్ల మీద నీరు ప్రవహించే ప్రదేశాల వద్ద పోలీస్‌ సిబ్బందిని నియమించి పికెట్లు వేసి ప్రాణాపాయం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అవసరమైన చోట్ల ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సేవలందిస్తున్నాయన్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితులలో పోలీస్‌ శాఖ తక్షణ సహాయం కోసం జిల్లా ప్రజలు డయల్‌ 100, 112 పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ నెంబర్‌ 8333813228 సమాచారమివ్వాలన్నారు. 114 మంది సిబ్బందితో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. 132 మంది పోలీస్‌ సిబ్బందిని కల్వర్టులు, బ్రిడ్జ్‌ల వద్ద నియమించామని, ప్రజలను అటుగా వెళ్లకుండా అప్రమత్తం చేస్తున్నారన్నారు. సుమారు 300 మందిని ప్రజలకు సహాయక చర్యలు అందించడానికి నియమించామన్నారు. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఈదురుగాలులకు రోడ్లపై విరిగిపడిన చెట్లను పోలీస్‌ అధికారులు వెంటనే జేసీబీల ద్వారా తొలగించి ప్రయాణికులకు ట్రాఫిక్‌ అంతరాయం కలుగకుండా చర్యలు చేపట్టారు. ముంపు ప్రాంతల్లోని ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

>
మరిన్ని వార్తలు