అన్నదాతలకు అండగా ప్రభుత్వం

6 Dec, 2023 01:54 IST|Sakshi
● ప్రభుత్వ ముందస్తు జాగ్రత్తలతో తప్పిన ప్రాణనష్టం ● పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం ● సహకార, మార్కెటింగ్‌ శాఖ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బత్తుల బ్రహ్మానందరెడ్డి

కారంచేడు: మిచాంగ్‌ తుఫాన్‌ ప్రభావంతో పంటలు నష్టపోయిన అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సహకార, మార్కెటింగ్‌ శాఖ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బత్తుల బ్రహ్మానందరెడ్డి చెప్పారు. మంగళవారం ఆయన మండలంలోని యర్రంవారిపాలెం గ్రామంలో ఆయన స్వగృహం వద్ద విలేకర్లతో మాట్లాడారు. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించారు. అనేక మంది రైతులతో ఆయన మాట్లాడారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అనేక ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారన్నారు. కలెక్టర్‌లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వారికి అవసరమైన సూచనలు చేశారన్నారు. అధికార యంత్రాంగం చేసిన కృషితో నష్ట తీవ్రత లేదన్నారు. కేవలం వరి, పొగాకు, శనగ, మొక్కజొన్న వంటి పంటలను మాత్రమే రైతులు నష్టపోయారన్నారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. వరద తీవ్రత తగ్గిన వెంటనే సంబంధిత అధికారులు, సిబ్బంది పంట నష్టం అంచనాలు వేస్తారన్నారు. వీటి ఆధారంగా పంటలు నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందిస్తుందన్నారు. ఎవ్వరూ అధైర్య పడొవద్దన్నారు. ముందస్తు జాగ్రత్తల్లో నిమగ్నమైన ప్రతి అధికారికి అభినందనలు తెలిపారు. మండలంలోని యర్రంవారిపాలెం గ్రామంతోపాటు మరికొన్ని గ్రామాల్లోని లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి వారికి అవసరమైన సదుపాయాలు ఏర్పాటును ఆయన అభినందించారు. ఆయన వెంట యర్రం లక్ష్మారెడ్డి, గుదిబండి అంజిరెడ్డి, స్ధానిక నాయకులు, రైతులున్నారు.

>
మరిన్ని వార్తలు