రాములోరి కల్యాణం.. పుణ్యస్నానాలకు ఇక్కట్లేనా? పైగా మురుగునీరు చేరిక!

28 Mar, 2023 01:21 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలంలో సీతారాముల కల్యాణాన్ని కనులారా చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి లక్ష మందికి పైగా భక్తులు భద్రాచలం రానున్నారు. గురువారం జరిగే కల్యాణోత్సవం, శుక్రవారం పట్టాభిషేకానికి భద్రాచలం ముస్తాబవుతోంది. అయితే ఇక్కడ గోదావరి తీరంలో నీరు అడుగంటిన నేపథ్యాన భక్తులు పుణ్యస్నానాలు చేయడం కష్టంగానే కనిపిస్తోంది. మరోవైపు లికేజ్ రూపంలో గోదావరిలోకి భద్రాచలం టౌన్  నుంచి మురుగు నీరు వచ్చి చేరుతోంది. 

పవిత్రమైన క్రతువు
భద్రగిరి పర్వతంపై లక్ష్మణ సమేతుడైన సీతారాములు కొలువై ఉండగా మిథిలా స్టేడియంలో కల్యాణోత్సవం జరగనుంది. ఈ రెండు ప్రాంగణాలకు అతి సమీపాన సుమారు అర కిలోమీటర్‌ నిడివితో గోదావరి తీరం వెంట కరకట్టను ఆనుకుని స్నానఘట్టాలు ఉన్నాయి. దూరప్రాంతాల నుంచి భద్రాచలం వచ్చే భక్తులు పావన గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి రాములవారి దర్శనానికి వెళ్లడం ఆనవాయితీ. మరికొందరు భక్తులు గోదావరి మాతకు పూజలు చేస్తారు. హనుమాన్‌ భక్తులు సైతం గోదావరిలో మునక వేయనిదే రాముడి దర్శనానికి వెళ్లరు. స్థానికులు తప్పితే దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తుల్లో నూటికి తొంభైమంది గోదావరి నీటిని తాకకుండా భద్రాచలం వీడి వెళ్లరు.

నది కాదు నీటి పాయే...
ప్రస్తుతం వేసవి కారణంగా గోదావరిలో నీటి ప్రవాహం తగ్గిపోయింది. వానాకాలంలో అరవై అడుగులను మించి ప్రవహించే గోదావరి ప్రస్తుతం చిన్న నీటి పాయను తలపిస్తోంది. అది కూడా స్నానఘట్టాల నుంచి చాలా దూరంగా చిన్న పాయ వెళ్తోంది. వేసవి మండుటెండలో, భగభగమండే ఇసుకలో నడుస్తూ భక్తులు అక్కడకు వెళ్లాల్సి వస్తోంది. ఒకవేళ వెళ్లి రావాలనుకున్నా కొద్దిసేపు సేద తీరేందుకు ఎలాంటి ఏర్పాట్లు లేవు. ఇంకోవైపు లికేజ్ రూపంలో గోదావరిలోకి వస్తున్న భద్రాచలం టౌన్ లో ఉన్న మురుగు నీరు. దీంతో శ్రీరామనవమికి వచ్చే భక్తుల్లో వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారితో పాటు చాలా మంది భక్తులు పుణ్యస్నానాలకు దూరం కావాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో స్నానఘట్టాల నుంచే గోదావరికి దండం పెట్టుకుని నిరాశగా వెనుతిరగాల్సిందే. ఎగున నుంచి వదిలే అవకాశమున్నా అధికారులు పట్టించుకోవట్లేదన్న విమర్శ వినిపిస్తోంది. 

నీళ్లు వదిలే అవకాశం ఉన్నా...
వేసవిలో గోదావరిలో నీటి మట్టం పడిపోవడం సర్వసాధారణమే. అయితే ప్రస్తుతం గోదావరి ఎగువన దుమ్ముగూడెం బ్యారేజీ(సీతమ్మసాగర్‌) మొదలు సమ్మక్కసాగర్‌, లక్ష్మి బ్యారేజీ(మేడిగడ్డ) వరకు సుమారు 30 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన బ్యారేజీలు ఉన్నాయి. ఇందులో నుంచి కొంత మొత్తంలో నీటిని దిగువకు వదిలితే గోదావరిలో భక్తులు సులభంగా పుణ్యస్నానాలు చేసేందుకు అనువైన పరిస్థితులు నెలకొంటాయి. ప్రస్తుతం దుమ్ముగూడెం బ్యారేజీలో ఒక టీఎంసీ, సమ్మక్క సాగర్‌ బ్యారేజీలో 1.5 టీఎంసీలు, లక్ష్మిబ్యారేజీలో 4 టీఎంసీల నీళ్లు ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో లక్ష్మి బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో 3,500 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. దీనికి ఇంద్రావతి నీటిని సైతం కలుపుకుంటే ఐదువేల క్యూసెక్కులకు పైగానే ప్రవాహం ఉంటుంది.

ఇరిగేషన్‌ అధికారులు సాధ్యాసాధ్యాలను పరిశీలించి నవమికి గోదావరిలో నీళ్లు ఉండేలా చూస్తే బాగుంటుందని భక్తులు కోరుతున్నారు. ఇవన్నీ కాకపోతే గోదావరిలో ప్రస్తుతం పదుల సంఖ్యలో ఇసుక రీచ్‌లు ఉండగా.. ఇసుక రవాణాకు అనుగుణంగా పొక్లెయినర్‌ వంటి భారీ యంత్రాలతో ట్రెంచ్‌లు కొట్టి నీటి ప్రవాహాన్ని మళ్లిస్తుంటారు. అదే తరహాలో స్నానఘట్టాలకు దూరంగా వెళ్తున్న నీటి పాయను దగ్గరకు తీసుకువచ్చేలా చేసినా భక్తులు తృప్తిగా పుణ్నస్నానాలు ఆచరించి రామయ్యను దర్శించుకునే వీలు కలుగుతుంది. ఇవన్నీ కాకపోతే కనీసం స్నానఘట్టాల వద్ద పైపులైన్లతో షవర్‌ మాదిరి ఏర్పాట్లు చేసినా భక్తులు గోదావరి జలాలతో పుణ్యస్నానం చేసినట్లుగా తృప్తి పడతారు.

మరిన్ని వార్తలు