-

ఓట్ల వరకే మనుషులు, ఓటర్లు.. ఆ త‌ర్వాత అంతా ఉత్త‌దే! : ఆదివాసీల ఆవేదన

28 Nov, 2023 12:58 IST|Sakshi
ఆధార్‌, ఓటుహక్కు కార్డులు చూపుతున్న ఆదివాసీలు

ఎన్నికల తర్వాత విస్మరిస్తున్నారని ఆదివాసీల ఆవేదన..

పాలకులు, ప్రభుత్వాలు మారినా అభివృద్ధికి నోచుకోని ఆవాసాలు!

విద్యుత్‌, రహదారి, తాగునీటి సౌకర్యం లేక అష్టకష్టాలు..

ఐటీడీఏ పరిధి భద్రాద్రి జిల్లాలో 84 ఆదివాసీగూడేలు!

సాక్షి, భద్రాద్రి/కొత్తగూడెం: భద్రాచలం కేంద్రంగా గిరిజన సమగ్రాభివద్ధి సంస్థ(ఐటీడీఏ) కొనసాగుతోంది. అయితే, ఐటీడీఏ పరిధిలోని భద్రాద్రి జిల్లాలో నివాసం ఏర్పర్చుకున్న ఆదివాసీ గూడేలలో అభివృద్ధి మాటేమో కానీ కనీస మౌలిక వసతులు లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఐటీడీఏ ద్వారా కొంత మేర ఫలితాలు వచ్చినా నూరు శాతం గిరిజనుల సమగ్రాభివృద్ధి జరగలేదని వారి జీవన స్థితిగతలను చూస్తే తెలిసిపోతుంది. పాలకులు ఐదేళ్ల కోసారి మారుతున్నా.. ఎన్నికల వేళ ఈ గూడేలకు బారులుతీరే నాయకులు ఆ తర్వాత ముఖం చూపకపోవడంతో సమస్యలు పరిష్కారం కావడం లేదు.

తొలుత ఖమ్మంలో ఏర్పాటు!
1975లో తొలుత ఖమ్మంలో ఐటీడీఏ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1979లో పాల్వంచకు మార్చా రు. ఇక 1993 ఫిబ్రవరి 9న భద్రాచలం కేంద్రంగా ఐటీడీఏ ఏర్పాటైంది. భద్రాచలం కొత్తగూడెం జిల్లా పరిధిలో 23 మండలాలు, ఖమ్మం జిల్లాలో ఐదు మండలాలు, ములుగు జిల్లాలోని రెండు మండలాలతో పాటు మహబూబాబాద్‌ జిల్లాలోని రెండు మండలాలు కలిపి 9,674.42 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఐటీడీఏ పరిధి ఉంది.

చట్టాలు ఉన్నా అమలేది?
ఆదివాసీ, గిరిజనుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలను అమలు చేస్తున్నాయి. కానీ, అవి సమగ్రంగా అమలుకు నోచుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వం గిరిజనుల సమగ్రాభివృద్ధికి ఐటీడీఏను ఏర్పాటుచేసి దశాబ్దాలు దాటినా ఆదివాసీల జీవనంలో మార్పులు మాత్రం రాలేదు. అడవిని నమ్ముకుని జంతువుల మధ్యే జీవనం సాగించే గిరిపుత్రుల నివాసాలకు వెళ్లేందుకు కనీస దారులు లేక తాగేందుకు గుక్కెడు నీళ్లు లభించని పరిస్థితులు కనిపిస్తాయి.

ఇక విద్యుత్‌ సౌకర్యం లేక అంధకారంలో మగ్గుతున్న గూడెంలు సైతం ఉన్నాయి. ఏళ్ల కిందట ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఇక్కడకు వలస వచ్చిన ఆదివాసీలు స్థానికంగా నివాసం ఏర్పర్చుకున్నారు. కానీ, వీరిని ఎన్నికల సమయంలో మనుషులుగా, ఓటర్లుగా గుర్తిస్తున్న నాయకులు ఆ తర్వాత ఇటు ముఖం చూడకపోవడంతో సమస్యలు అలాగే మిగిలిపోతున్నాయి.

అటవీ ఫలసాయమే ఆధారం!
గూడేలలో నివాసముంటున్న ఆదివాసీలు వ్యవసాయంతో పాటు అటవీ ఫలసాయమే జీవనాధారంగా బతుకుతున్నారు. కనీస రహదారి సౌకర్యం లేక నిత్యం కిలోమీటర్ల మేర కాలినడకన నడిచి వెళ్లి సరుకులు తెచ్చుకోవాల్సిందే. వర్షాకాలంలో అయితే ఆ బాట కూడా ఉండకపోతే అనారోగ్యం ఎదురైతే దేవుడిపై భారం వేసి గడపాల్సి వస్తోంది.

విద్యుత్‌ సౌకర్యం కోసం ఐటీడీఏ ద్వారా పలు ఆదివాసీ గ్రామాల్లో సోలార్‌ లైట్లు బిగించినా అందులో అత్యధికం పనిచేయడం లేదు. ఇక తాగునీరు లేక అల్లాడిపోతున్నారు. అటవీ శాఖ నిబంధనలతో బోర్లు వేయడం సాధ్యం కాక వాగులు, వంకలపై ఆధారపడాల్సి వస్తోంది. ఈసారైనా పార్టీ అభ్యర్థులు తమ సమస్యలపై స్పష్టమైన హామీలు ఇవ్వాలని.. అప్పుడే ఓట్లు వేస్తామని ఆదివాసీలు తేల్చిచెబుతున్నారు.

భద్రాద్రి జిల్లాలో..

ఇవి కూడా చదవండి: ప్రచారం.. నేటితో పరిసమాప్తం! ఇకపై గెలిచేవ‌ర‌కు మూగనోమే..

మరిన్ని వార్తలు