-

భద్రగిరిలో సవాళ్లు.. ప్రతి సవాళ్లు

28 Nov, 2023 00:28 IST|Sakshi
●పరస్పరం విరుచుకుపడ్డ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీలు ●అభివృద్ధి, ఓటింగ్‌పై బహిరంగ చర్చలకు రావాలని సవాల్‌

భద్రాచలం: సవాళ్లు, ప్రతి సవాళ్లతో భద్రాచలం నియోజకవర్గంలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరుకుంది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు, కాంగ్రెస్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలకు దిగారు. సోమవారం భద్రాచలంలో విడివిడిగా ఏర్పాటు చేసిన పత్రికా సమావేశాల్లో బహిరంగ చర్చకు రావాలంటూ సవాళ్లు విసురుకున్నారు. దూషణలు చేసుకున్నారు.

అభివృద్ధిపై బహిరంగ చర్చకు రా: బాలసాని లక్ష్మీనారాయణ

పరోక్ష ఎన్నికలతో ప్రజాప్రతినిధిగా ఉన్న తాతా మధు భద్రాచలంలో బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తాననడం హాస్యాస్పదంగా ఉందని మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ అన్నారు. సోమవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. భద్రాచలంలో ఏ ఏ మండలాల్లో ఏ ప్రజా సమస్యలు ఉన్నాయో మధు చెప్పగలరా అని ప్రశ్నించారు. గిరిజన మాజీ సర్పంచ్‌ భూక్యా శ్వేతను పార్టీ మారాలంటూ మధు రాయబారాలు పంపారని, అవి పనిచేయకపోవడంతో అక్రమంగా పోలీసులతో అర్ధరాత్రి దాడులు చేయించారని ఆరోపించారు. భద్రాచలం అభివృద్ధికి బీఆర్‌ఎస్‌ ఏం చేసిందో బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. టీపీసీసీ సభ్యులు బుడగం శ్రీనివాస్‌, పట్టణ అధ్యక్షుడు సరెళ్ల నరేష్‌, నాయకులు చింతిరేల రవికుమార్‌, అడబాల వెంకటేశ్వరరావు, వెంకటేష్‌, టీడీపీ నాయకులు కొడాలి శ్రీనివాస్‌, రాజారాం తదితరులు పాల్గొన్నారు.

దమ్ముంటే నీ మండలంలో

ఆధిక్యం తెచ్చుకో: తాతా మధు

‘నీ సొంత మండలమైన వెంకటాపురంలో ఈ ఎన్నికలలో దమ్ముంటే కాంగ్రెస్‌ పార్టీకి ఆధిక్యం తెచ్చుకో బాలసానీ..’ అంటూ ఎమ్మెల్సీ, బీఆర్‌ఎస్‌ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు మండిపడ్డారు. సోమవారం పట్టణంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్ది తెల్లం వెంకట్రా వ్‌తో కలిసి మాట్లాడారు. గతంలో, ఇప్పుడు నీ సొంత మండలంలో పోలయ్యే ఓట్లకు, నా సొంత మండలంలో నా పార్టీకి పోలయ్యే ఓట్లపై బహిరంగ చర్చకు సిద్దమా అని ప్రశ్నించారు. వ్యక్తిగత దూషణలకు దిగే నీచ రాజకీయాలు మానుకోవాలని హితవు చెప్పారు. మండల అధ్యక్ష, కార్యదర్శులు తిరుపతిరావు, కృష్ణమూర్తి, నాయకులు తిప్పన సిద్దులు, తాండ్ర వెంకటరమణ, సునీల్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు